France Protests: రణరంగంలా ఫ్రాన్స్‌.. చనిపోయిన ఆ టీనేజర్‌ ఎవరు..?

France Protests: ఐరోపా దేశం ఫ్రాన్స్‌లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ టీనేజర్‌ మృతి వల్ల.. ఐదురోజులుగా అక్కడ ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. 

Published : 02 Jul 2023 01:28 IST

పారిస్‌: ఐదురోజులుగా ఐరోపా దేశం ఫ్రాన్స్‌(France) రణరంగాన్ని తలపిస్తోంది. తీవ్రస్థాయి నిరసనలు, లూటీలతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది. ఈ ఆందోళనలను కట్టడి చేసేందుకు 45 వేల మంది బలగాలను మోహరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్..  యువత ఇంటిపట్టునే ఉండేలా చూడాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల టీనేజర్‌ మృతి చెందడం ఈ పరిస్థితికి దారితీసింది. (France Protests) 

మంగళవారం పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఆ యువకుడు పేరు నేహల్‌. అల్జీరియా సంతతికి చెందిన నేహల్‌.. తన తల్లి వద్ద ఉంటూ, ఒక డెలివరీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి రగ్బీ ఆట అంటే చాలా ఇష్టమట. అందుకే పైరేట్స్‌ ఆఫ్ నాన్‌టెర్రె రగ్బీ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడికి చదువు మీద పెద్దగా ఆసక్తి లేదని, ఎలక్ట్రీషియన్‌గా శిక్షణ పొందాడని తెలుస్తోంది. నేర చరిత్ర ఏమీ లేనప్పటికీ.. స్థానిక పోలీసులకు మాత్రం అతడు సుపరిచితుడు కావడం గమనార్హం.

అయితే మంగళవారం రోజు ట్రాఫిక్ చెక్‌పాయింట్ వద్ద పోలీసులు అతడి కారు ఆపేందుకు ప్రయత్నించారు. ఆ వాహనం నడుపుతున్న అతడు చూడటానికి పిల్లాడిలా కనిపించేసరికి వారు ఆపాలనుకున్నారు. అంతేగాకుండా అతడి వద్ద పాలిష్‌ నంబర్ ప్లేట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే నేహల్ కారు ఆపకుండా.. తమ మీదకు కారు పోనిచ్చేందుకు యత్నించాడని చెప్పారు. తమతో పాటు రోడ్డుపై ఉన్న ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. ఆ కాల్పుల్లో అతడు మృతి చెందాడు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ప్రాథమిక నివేదిక ప్రకారం..ఆ ఆధికారి ఆయుధం వాడే విషయంలో చట్టపరమైన షరతుల ఉల్లంఘన జరిగిందని తేలింది. దాంతో ఆ అధికారి కావాలనే కాల్పులకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 

ఇదిలా ఉంటే.. ఈ కేసులో జాతి వివక్ష ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతి వివక్ష వల్లే ఆ పోలీసు తన బిడ్డ ప్రాణాలు తీశాడని నేహల్ తల్లి ఆరోపించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌ కావడంతో ఫ్రాన్స్‌ రణరంగంలా మారిపోయింది. ప్రత్యక్ష సాక్షులు, సీసీటీవీ దృశ్యాలు.. అధికారి చెప్పిన స్టోరీకి విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దానివల్లే ఆ టీనేజర్ మృతి ఘటన ప్రజాగ్రహానికి దారితీసిందని పలు మీడియా కథనాలు వెల్లడించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని