Putin: గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు.. 24 ఏళ్లుగా అధికారంలోనే!

గత 24 ఏళ్లుగా అధికారంలో (ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి) కొనసాగుతోన్న పుతిన్‌.. ఈ పదవీకాలం పూర్తయితే రష్యాను (Russia) సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు.

Published : 18 Mar 2024 15:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకే పార్టీ లేదా వ్యక్తి దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగడం ప్రజాస్వామ్య దేశాల్లో అరుదు. కానీ, పలు దేశాల పాలనా పగ్గాలు ఎక్కువకాలం కొందరి చేతుల్లోనే ఉండిపోతున్నాయి. తాజాగా జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో 87 శాతం ఓట్లతో పుతిన్‌ (Vladimir Putin) భారీ విజయం సాధించడం కూడా ఈ కోవలోకే వస్తుంది. తాజా ఫలితంతో మరో ఆరేళ్ల పాలనను ఆయన చేతుల్లోనే ఉంచుకోనున్నారు. గత 24 ఏళ్లుగా అధికారంలో (ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి) కొనసాగుతోన్న ఆయన.. ఈ పదవీకాలం పూర్తయితే రష్యాను (Russia) సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. ఈనేపథ్యంలో ఓ గూఢచారి నుంచి సుదీర్ఘకాలంగా దేశాన్ని పాలిస్తూ ఎదురులేని నేతగా పుతిన్‌ ఎదిగిన క్రమాన్ని పరిశీలిస్తే..

ఎందరో దేశాధినేతలు మారినా..

పుతిన్‌ రష్యా పాలనా పగ్గాలు చేపట్టినప్పటినుంచి పలు దేశాల్లో అనేకమంది పాలకులు మారారు. 24 ఏళ్ల పుతిన్‌ అధికార ప్రస్థానం.. ఎనిమిది ఆస్ట్రేలియన్‌ పార్లమెంటరీ పర్యాయాలకు సమానం. అంటే.. అక్కడ మూడుసార్లు పాలకపక్షం మారగా, ఎనిమిది మంది ప్రధానులను చూసింది. అమెరికాలో ఐదుగురు అధ్యక్షులు మారారు. ఈ రెండున్నర దశాబ్దాల్లో బ్రిటన్‌కు ఏడుగురు వేర్వేరు ప్రధానులు వచ్చారు. భారత్‌లోనూ ముగ్గురు ప్రధానులు మారగా, మన్మోహన్‌ సింగ్, నరేంద్ర మోదీ పదేళ్ల చొప్పున అధికారంలో ఉన్నారు.

గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు..

నావల్నీని విడిచిపెట్టాలనుకున్నాం.. ప్రత్యర్థి మృతిపై పుతిన్‌ తొలి స్పందన

  • న్యాయశాస్త్రం పూర్తిచేసిన పుతిన్‌.. 1975లో రష్యా గూఢచార సంస్థ కేజీబీలో చేరారు.
  • 1991లో రాజకీయ ప్రవేశం చేసిన ఆయన.. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు.
  • 1998లో రష్యా సెక్యూరిటీ సర్వీస్‌కు అధిపతిగా అప్పటి అధ్యక్షుడు బోరిస్‌ యెల్సిన్‌ నియమించారు.
  • 1999లో అప్పటి ప్రధాన మంత్రిని తొలగించిన యెల్సిన్‌.. 46 ఏళ్ల పుతిన్‌ను ఆ స్థానంలో భర్తీ చేశారు.
  • ఆ తర్వాత కొన్ని నెలలకే ఆయన రాజీనామా చేయడంతో తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలను పుతిన్‌ చేపట్టారు.
  • అనంతరం 2000లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలవడంతోపాటు 2004లో రెండోసారి ఆ బాధ్యతల్లో కొనసాగారు.
  • రాజ్యాంగం ప్రకారం.. వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం లేకపోవడంతో 2008లో ప్రధాని పదవి చేపట్టారు. ఈ సమయంలోనే అధ్యక్ష పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచుతూ రాజ్యాంగ సవరణ చేశారు.
  • మళ్లీ 2012లో మరోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన పుతిన్‌.. 2018లో నాలుగోసారి ఎన్నికయ్యారు. 
  • తాజా (2024 ఎన్నికల్లో) గెలుపుతో ఐదోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ఆయన.. మరో ఆరేళ్లు పాలించేందుకు సిద్ధమయ్యారు.
  • ఇలా 1999లో తొలిసారి రష్యా పాలనా పగ్గాలు చేపట్టిన పుతిన్‌.. గత 24 ఏళ్లుగా ఆ దేశ ప్రధానిగా, అధ్యక్షుడిగా కొనసాగుతూనే ఉన్నారు.
  • ఈ పూర్తి పదవీకాలం అధికారంలో కొనసాగితే.. 29ఏళ్లు సోవియట్‌ను పాలించిన జోసెఫ్‌ స్టాలిన్‌ను (1924 నుంచి 1953) అధిగమిస్తారు. దాంతో 200 ఏళ్లలో సుదీర్ఘకాలం రష్యాను పాలించిన నేతగా పుతిన్‌ రికార్డు సృష్టించనున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని