ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకుల సరఫరాపై ఒత్తిడిలో జర్మనీ

రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు సరఫరా అంశంపై జర్మనీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

Published : 20 Jan 2023 04:54 IST

బెర్లిన్‌: రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు సరఫరా అంశంపై జర్మనీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పశ్చిమ మిత్రదేశాలు ఇచ్చిన హామీ మేరకు తమకు తగినని ఆయుధాలు అందడంలేదంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గురువారం బహిరంగంగా నిరాశ వ్యక్తం చేశారు. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌కు జర్మనీ నూతన రక్షణమంత్రి బోరిస్‌ పిస్టోరియస్‌ బెర్లిన్‌లో స్వాగతం పలికిన సమయంలో ఓ ప్రకటన చేశారు. అందులో..‘‘ఇప్పటికే సరఫరా చేసిన జర్మనీకి చెందిన ఆయుధ వ్యవస్థలు తమ సామర్థ్యాన్ని చాటుకున్నాయి. దేశ సార్వభౌమత్వం, ప్రాంత విముక్తి, స్వతంత్రం కోసం పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మా మిత్రులతో కలిసి భవిష్యత్తులోనూ చేయూతను కొనసాగిస్తాం’’ అని పేర్కొన్నారు. అయితే ఉక్రెయిన్‌ ఎంతో కాలంగా కోరుతున్న లెపార్డ్‌-2 రకానికి చెందిన యుద్ధ ట్యాంకులపై నోరు మెదపలేదు. ఇదిలా ఉండగా తమ దేశానికి చెందిన చాలెంజెర్‌-2 రకం ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపుతున్నట్లు బ్రిటన్‌ గతవారం ప్రకటించింది. ఈ తరుణంలో కీవ్‌కు తమ ట్యాంకులను అందజేయడం లేదా ఇతర దేశాలకు ఆ అవకాశం కల్పించే విషయంలో జర్మనీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. జర్మనీ తయారీ లెపార్డ్‌ ట్యాంకులను తమ సొంత నిల్వల నుంచి ఉక్రెయిన్‌కు అందించడానికి పోలండ్‌ సంసిద్ధంగా ఉంది. దీనికి జర్మనీ అనుమతించాల్సి ఉంది.

మందుపాతరల వెలికితీతపై కంబోడియా శిక్షణ

ప్రపంచంలో అత్యధిక మందుపాతరలతో సతమతమైన కంబోడియా వాటి వెలికితీతపై ఉక్రెయిన్‌ సైనికులకు శిక్షణ ఇస్తోంది. ఈ కార్యక్రమంలో శరీర రక్షణ కవచాలు, హెల్మెట్లు ధరించిన 15 మందితో కూడిన ఉక్రెయిన్‌ సైనిక బృందం పాల్గొంటోంది.

* ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ నేరాలను విచారించేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు అవసరమని యూరోపియన్‌ యూనియన్‌ అసెంబ్లీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని