Australia: గల్లంతైన రేడియోధార్మిక క్యాప్సూల్‌ దొరికింది.. ఊపిరి పీల్చుకున్న అధికారులు

ఆస్ట్రేలియాలో కొద్దిరోజుల కిందట గల్లంతైన రేడియోధార్మిక క్యాప్సూల్‌ దొరికింది. మైనింగ్‌ పట్టణం న్యూమాన్‌కు సమీపంలో గ్రేట్‌ నార్తర్న్‌ హైవేపై ఇది కనిపించింది.

Updated : 02 Feb 2023 10:43 IST

పెర్త్‌: ఆస్ట్రేలియాలో కొద్దిరోజుల కిందట గల్లంతైన రేడియోధార్మిక క్యాప్సూల్‌ దొరికింది. మైనింగ్‌ పట్టణం న్యూమాన్‌కు సమీపంలో గ్రేట్‌ నార్తర్న్‌ హైవేపై ఇది కనిపించింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్యాప్సూల్‌లో సీజియం-137 అనే రేడియోధార్మిక పదార్థం ఉంది. గత నెలలో ఎడారిలోని ఒక గని నుంచి పెర్త్‌ నగరానికి ట్రక్కులో రవాణా చేస్తున్న సమయంలో ఇది గల్లంతైంది. ఈ వాహనం బయల్దేరిన ప్రదేశం నుంచి గమ్యస్థానం మధ్య 1400 కిలోమీటర్ల దూరం ఉంది. దీంతో ఆ మార్గంలో గాలింపు మొదలైంది. ఇందుకోసం ప్రత్యేక గాలింపు వాహనాన్ని రప్పించారు. ఇది రహదారి వెంబడి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఆధునిక పరికరాలతో అన్వేషణ చేపట్టింది. బుధవారం ఇందులోని ఉపకరణాలు.. రేడియోధార్మికతను పసిగట్టాయి. దీంతో సంబంధిత ప్రాంతంలో అధికారులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఇందుకోసం చిన్నపాటి పరికరాలను ఉపయోగించారు. రోడ్డుపక్కన 2 మీటర్ల దూరంలో క్యాప్సూల్‌ను గుర్తించారు. దీని పొడవు 8 మిల్లీమీటర్లు కాగా వెడల్పు 6 మిల్లీమీటర్లు. ఈ సాధనం దగ్గర్లోకి ఎవరూ రాలేదని, అందువల్ల ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెప్పారు. సీజియం-137 నుంచి వెలువడే రేడియోధార్మికత ప్రమాదకరం. దీనివల్ల చర్మం కాలుతుంది. దీర్ఘకాలం దీని తాకిడికి గురైతే క్యాన్సర్‌ బారినపడే అవకాశం ఉంది. ఈ క్యాప్సూల్‌ గల్లంతుకావడంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని