రణ క్షేత్రాల్లో శ్వేత కుసుమాలు

ప్రపంచంలో సాయుధ సంఘర్షణలను, హింసనూ నిరోధించడానికి ఐక్యరాజ్యసమితి శాంతి రక్షణ సేన గడచిన 75 ఏళ్ల నుంచి నిర్విరామంగా కృషిచేస్తోంది.

Updated : 26 May 2023 06:07 IST

శాంతి పరిరక్షణలో 75 ఏళ్లు
ఐరాస సైనికుల నిరుపమాన సేవలు

ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలో సాయుధ సంఘర్షణలను, హింసనూ నిరోధించడానికి ఐక్యరాజ్యసమితి శాంతి రక్షణ సేన గడచిన 75 ఏళ్ల నుంచి నిర్విరామంగా కృషిచేస్తోంది. అనేక దేశాల్లో అంతర్యుద్ధాలనూ, రక్తపాతాన్నీ ఆపడానికి 20 లక్షల మంది శాంతి సైనికులను పంపింది. లైబీరియా, కంబోడియాలలో విజయవంతంగా శాంతిని నెలకొల్పినా బోస్నియా, రువాండాలలో మాత్రం రక్తపాతాన్ని నివారించడంలో విఫలమైంది. నేడు ప్రపంచంలో దాదాపు 12 చోట్ల సాయుధ సంఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.

విజయాలు...వైఫల్యాలు...

ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, పశ్చిమాసియాలలోని కల్లోల ప్రాంతాల్లో ప్రస్తుతం 85,000 మంది సమితి శాంతిసైనికులు విధులు నిర్వహిస్తున్నారు. లైబీరియా, సియేరా లియోన్‌, అంగోలా, ఐవరీ కోస్ట్‌, మొజాంబిక్‌, కంబోడియా, దక్షిణ లెబనాన్‌, సైప్రస్‌లలో సాధారణ పరిస్థితులను నెలకొల్పగలిగామని శాంతి రక్షక సేన అధిపతి జాన్‌ పియెర్‌ లెక్వా చెప్పారు. 1994లో రువాండాలో 8 లక్షల మంది, బోస్నియాలో 8,000 మంది ముస్లిం పురుషులు, బాలుర ఊచకోతను మాత్రం ఆపలేకపోయామని ఒప్పుకున్నారు. అలాగే అఫ్గానిస్థాన్‌లో పాశ్చాత్య సైనిక దళాలు శాంతిని నెలకొల్పలేకపోయాయనీ ఒప్పుకున్నారు.

భారతీయ సైనికుల త్యాగాలకు గుర్తింపు

పలు సవాళ్ల మధ్య ఐక్యరాజ్యసమితి 75వ అంతర్జాతీయ శాంతిరక్షకుల  దినోత్సవం గురువారం జరిగింది. 1948 నుంచి సమితి తరఫున శాంతి స్థాపన కృషిలో బలిదానం చేసిన 4,500 మంది సైనికులు, అధికారులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. గత ఏడాది కాంగో(డీఆర్‌సీ)లో శాంతిపరిరక్షణ విధుల్లో నిమగ్నమైన ముగ్గురు భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారి విశిష్ఠ సేవలకు గుర్తింపుగా గురువారం ప్రదానం చేసిన డ్యాగ్‌ హమ్మర్‌స్క్జోల్డ్‌ పతకాన్ని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు