బుర్రా వేడెక్కుతుంది జాగ్రత్త!

‘ఆయన మండిపడుతున్నారు... వారిపై భగభగ  లాడుతున్నారు’... మానవ ఉద్వేగాల తీవ్రతను  తెలపటానికి తరచూ వినిపించేవే ఈ విశేషణాలు! కానీ ఇవి కేవలం విశేషణాలు కావనీ... సహజ    లక్షణాలేననీ, ముఖ్యంగా మండే ఎండల ప్రభావం మన బుర్రలపైనా, ఆలోచనలపైనా ఉంటుందంటున్నారు నిపుణులు.

Updated : 28 May 2023 06:11 IST

ఉద్వేగాలపైనా ఎండల ప్రభావం
నిస్పృహ, నేరాలు పెరగొచ్చంటున్న నిపుణులు

‘ఆయన మండిపడుతున్నారు... వారిపై భగభగ  లాడుతున్నారు’... మానవ ఉద్వేగాల తీవ్రతను  తెలపటానికి తరచూ వినిపించేవే ఈ విశేషణాలు! కానీ ఇవి కేవలం విశేషణాలు కావనీ... సహజ    లక్షణాలేననీ, ముఖ్యంగా మండే ఎండల ప్రభావం మన బుర్రలపైనా, ఆలోచనలపైనా ఉంటుందంటున్నారు నిపుణులు. ఉష్ణోగ్రతలు పెరిగితే ఉద్వేగాలూ  పెరిగి నిరాశ నిస్పృహలతో నేరాలకూ దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు.


ఒక్క డిగ్రీ సెంటీగ్రేడు పెరిగినా..

వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావం వివిధ రంగాలపై ఎలా ఉంటుందనే దానిపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. వీటిపైనే పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏటా అన్ని దేశాల్లోనూ పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల వల్ల మానవాళిపై పడే ప్రభావం అందరి దృష్టినీ   ఆకర్షిస్తోంది. ధ్రువాల్లో మంచు కరగటం, సముద్రమట్టాలు పెరగటం... భారీగా జంతుజాలం నశించటంలాంటి ఉపద్రవాల గురించి శాస్త్రవేత్తలు పదేపదే హెచ్చరిస్తునే ఉన్నారు. అయితే కేవలం ఈ భౌతికపరమైన మార్పులు, సవాళ్లే కాకుండా మానసికంగా కూడా ఎండలు మనకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు! అధిక ఉష్ణోగ్రతలకు, మానసిక ఆరోగ్యానికి ఉన్న బంధంపై నిశిత శోధన సాగుతోంది. వాతావరణంలో వేడి పెరిగితే... మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, నిరాశ నిస్పృహ, కుంగుబాటు లక్షణాలతోపాటు నేరప్రవృత్తీ పెరుగుతోందనేది వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల ప్రాథమిక భావన! మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా సగటున ఒక డిగ్రీ సెంటీగ్రేడు మించినా అది మానసిక కుంగుబాటుకు, ఉద్వేగాలకు కారణం కావొచ్చని అమెరికాలోని జార్జ్‌టౌన్‌ విశ్వవిద్యాలయం ఆరోగ్య విభాగం తేల్చింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఒక డిగ్రీ సెంటిగ్రేడ్‌ పెరిగితే... అమెరికా, మెక్సికోల్లో కుంగుబాటుతో కూడిన ఆత్మహత్యలు పెరుగుతున్నాయని స్టాన్‌ఫర్డ్‌ ఆర్థికవేత్త మార్షల్‌ బుర్కే అధ్యయనం పేర్కొంది. ‘‘పర్యావరణ మార్పులు సామాజిక బంధాల్లో మార్పులకు కారణమవుతున్నాయి. వాటి ప్రభావం మానసిక ఆరోగ్యంపై ఉంటోంది. కాబట్టి పర్యావరణ సమస్యలను కేవలం భౌతిక దృష్టితో కాకుండా ఈ కోణంలోనూ ఎక్కువగా చూడాలి’’ అని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా ఆచార్యుడు, క్లైమెట్‌సైకియాట్రీ అలయెన్స్‌ అధ్యక్షుడు రాబిన్‌ కూపర్‌ అంటున్నారు.


నిద్ర దెబ్బతిని.. దుష్ప్రభావాలు పెరిగి..

పరిశోధనల ప్రకారం... పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన బుర్రలపైనా ప్రభావం చూపుతున్నాయి. మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్లు, హార్మోన్లు ప్రభావితమై ఆరోగ్యానికి అత్యంత కీలకమైన నిద్ర దెబ్బతింటోందని నిపుణులు చెబుతున్నారు. ‘‘ఎండను తట్టుకునే ఎయిర్‌ కండిషనింగ్‌ సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండవు. పెరిగిన ఎండలతో నాణ్యమైన నిద్రకు ఆటంకం కలుగుతుంది. దాని దుష్ప్రభావాలు భావోద్వేగాల్లో మార్పు నుంచి మొదలెడితే అనేకరకాలుగా ఉంటాయి. వేడిమి కారణంగా న్యూరోట్రాన్స్‌మిటర్‌ సెరొటోనిన్‌ (మూడ్‌ నియంత్రణలో కీలకమైంది) ప్రభావితమవుతుంది. మన భావోద్వేగాలను నియంత్రించటంలో అదే కీలకం’’ అని బ్రౌన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుడు జోష్‌ వివరించారు. ఇప్పటికే మానసిక సమస్యలతో సతమతమవుతున్నవారికి ఇబ్బందులు ఎక్కువ కావొచ్చన్నది అంచనా. అందుకే కేవలం భౌతిక అనర్థాల గురించే కాకుండా పర్యావరణ మార్పులను ప్రతి ఒక్కరూ తమ మానసిక సమస్యగా కూడా పరిగణించి జాగ్రత్త పడాలన్నది శాస్త్రవేత్తల హెచ్చరిక!


ఈనాడు ప్రత్యేక విభాగం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు