సంక్షిప్త వార్తలు(11)

సాధారణ వ్యక్తులతో పోలిస్తే.. గుండెపోటు బారిన పడ్డవారిలో మేధో సామర్థ్యాలు వేగంగా క్షీణిస్తాయని అమెరికాలోని జాన్స్‌ హాప్‌కిన్స్‌ మెడిసిన్‌ పరిశోధకులు తాజాగా గుర్తించారు.

Updated : 02 Jun 2023 05:36 IST

గుండెపోటుతో మేధో సామర్థ్యాల క్షీణత

దిల్లీ: సాధారణ వ్యక్తులతో పోలిస్తే.. గుండెపోటు బారిన పడ్డవారిలో మేధో సామర్థ్యాలు వేగంగా క్షీణిస్తాయని అమెరికాలోని జాన్స్‌ హాప్‌కిన్స్‌ మెడిసిన్‌ పరిశోధకులు తాజాగా గుర్తించారు. 1971 నుంచి 2019 వరకు జరిపిన ఆరు వేర్వేరు అధ్యయనాల ఫలితాలను సంయుక్తంగా విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని వారు నిర్ధారించారు. గుండెపోటుకు గురయ్యాక కొన్నాళ్ల వరకు పరిస్థితులు బాగానే ఉన్నా.. దీర్ఘకాలంలో వారి జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటివాటిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. మెదడు ఆరోగ్యాన్ని గుండె ఆరోగ్యం ఎలా ప్రభావితం చేస్తోందో క్షుణ్నంగా అర్థం చేసుకునేందుకు తాము మరిన్ని పరిశోధనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.


కేలరీలను కరిగించే ప్రొటీన్‌ గుట్టు తెలిసిందోచ్‌!

దిల్లీ: ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులకు మెరుగైన చికిత్సలను ఆవిష్కరించే దిశగా కీలక ముందడుగు పడింది. మానవ శరీరంలో కేలరీలను కరిగించేలా ‘మంచి కొవ్వు’ను అనుమతించే ‘అన్‌కప్లింగ్‌ ప్రొటీన్‌ 1 (యూసీపీ1)’ అనే కీలక ప్రొటీన్‌కు సంబంధించిన అణుస్థాయి నిర్మాణాన్ని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం పరిశోధకులతో కూడిన అంతర్జాతీయ బృందం తొలిసారిగా గుర్తించింది. ఇన్నాళ్లూ ఈ ప్రొటీన్‌ నిర్మాణంపై అంతగా అవగాహన లేకపోవడంతో దాన్ని కృత్రిమంగా క్రియాశీలం చేసే విధానాలను కనుగొనడం సాధ్యం కాలేదని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం సంబంధిత వివరాలు అందుబాటులోకి రావడంతో- ఊబకాయం, దాని ఫలితంగా వచ్చే మధుమేహం వంటి వ్యాధులకు మెరుగైన చికిత్సా మార్గాల ఆవిష్కరణ సులువు కానుందని పేర్కొన్నారు.


కొవిడ్‌ వేళ.. ఉద్గారాలు తగ్గినా వేడి పెరిగింది!

దిల్లీ: కొవిడ్‌ మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపించిన సమయంలో లాక్‌డౌన్‌ల వల్ల దక్షిణాసియాలో ఉద్గారాలు గణనీయంగా తగ్గాయని స్వీడన్‌లోని స్టాక్‌హోం విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు. దానివల్ల గాలిలో స్వల్పకాలిక కూలింగ్‌ పార్టికల్స్‌ తగ్గాయని, గ్రీన్‌హౌజ్‌ వాయువుల స్థాయి మాత్రం అంతగా ప్రభావితం కాలేదని వెల్లడించారు. దిగువన ఉండే ఏరోసోల్‌ల స్థాయి పడిపోవడంతో కూలింగ్‌ ప్రక్రియ క్షీణించిందని.. ఫలితంగా వాతావరణం మరింత వేడెక్కిందని వివరించారు. ఉద్గారాలు తగ్గడంతో గాలి మాత్రం స్వచ్ఛంగా మారిందని పేర్కొన్నారు. మాల్దీవుల్లోని హనిమధూ అనే ప్రాంతంలో ఏర్పాటుచేసిన వాతావరణ కేంద్రం నుంచి 2020 వసంత రుతువులో సేకరించిన వివరాలను విశ్లేషించడం ద్వారా పరిశోధకులు ఈ విషయాలను నిర్ధారించారు.


పాక్‌లో పేలుడు..  ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి

లాహోర్‌: పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో గురువారం ఓ ఇంట్లో పేలుడు జరిగి, ఒకే కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. లాహోర్‌కు 400 కి.మీ.ల దూరంలోని కోట్‌ అడ్డు జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తుక్కు సామాను వ్యాపారం చేసే మహమ్మద్‌ ఇక్బాల్‌ అనే వ్యక్తి ఇంట్లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇక్బాల్‌ దంపతులు, మైనర్లయిన ఇద్దరు పిల్లలు, బంధువులైన మరో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన మరో ముగ్గురు వ్యక్తులను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.


ఇరాన్‌ సరిహద్దులో ఇద్దరు పాక్‌ సైనికుల మృతి

కరాచీ: ఇరాన్‌ సరిహద్దులోని తమ భద్రతా కేంద్రంపై ఉగ్రవాదులు దాడి జరపగా.. ఇరువర్గాల మధ్య సాగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతిచెందినట్లు పాకిస్థాన్‌ సైనికాధికారులు గురువారం వెల్లడించారు. బలూచిస్థాన్‌లోని కెచ్‌ జిల్లా పరిధిలో ఉన్న సింగ్వాన్‌ పోస్టుపై ఉగ్రదళాలు దాడులకు దిగాయని, సైనికులు వారిని వెనక్కు తరిమికొట్టినట్లు తెలిపారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఉగ్ర దళాల నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.


22 ఏళ్లుగా కోమాలో ఉన్న మహిళ మృతి

జెరూసలెం: ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలో 22 ఏళ్ల క్రితం జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన ఓ మహిళ బుధవారం మరణించారు. 2001 ఆగస్టు 9న ఓ రెస్టారెంటులో హనా నచెన్‌బర్గ్‌ అనే మహిళ భోజనం చేస్తుండగా, పాలస్తీనాకు చెందిన ఆత్మాహుతి దళ సభ్యుడు ఒకరు అక్కడ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో హనాకు తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లింది.


ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్షుడిగా డెన్నిస్‌ ఫ్రాన్సిస్‌

ఐరాస: ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ తదుపరి అధ్యక్షుడిగా ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో దౌత్యవేత్త డెన్నిస్‌ ఫ్రాన్సిస్‌ గురువారం ఎన్నికయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరులో జనరల్‌ అసెంబ్లీ 78వ సదస్సు సందర్భంగా ఆ బాధ్యతలను ఆయన లాంఛనంగా స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్షుడిగా హంగేరీకి చెందిన కసాబా కొరోసీ ఉన్నారు.


బిట్‌ కాయిన్‌ లాండరింగ్‌లో ఇండో కెనడియన్‌ అరెస్టు

వాషింగ్టన్‌: 24 మిలియన్‌ డాలర్ల బిట్‌ కాయిన్‌ లాండరింగ్‌ కేసులో ఇండో కెనడియన్‌ ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఫిరోజ్‌ పటేల్‌ అమెరికాలో అరెస్టయ్యారు. పేజా డాట్‌ కాం మాజీ యజమాని అయిన ఆయన నగదు లావాదేవీల్లో, స్థిరాస్తి వ్యవహారాల్లో చట్ట విరుద్ధ పనులకు పాల్పడ్డారనే ఆరోపణలొచ్చాయి. దీంతో పటేల్‌ను అదుపులోకి తీసుకుని విచారించాలని కొలంబియా జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.


ఎర్డోగాన్‌కు 52.18శాతం ఓట్లు

అంకారా: తుర్కియే అధ్యక్షుడిగా ఎన్నికైన తయ్యిప్‌ ఎర్డోగాన్‌కు 52.18శాతం ఓట్లు వచ్చాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆయన ఎన్నికను ధ్రువీకరించింది. ఈ మేరకు అధికారిక గెజిట్‌ను జారీ చేసింది. రెండు దశాబ్దాలుగా ప్రధానిగా, అధ్యక్షుడిగా వేర్వేరు పదవులను నిర్వహించిన 69 ఏళ్ల ఎర్డోగాన్‌ తాజా ఎన్నికతో 2028 వరకూ తుర్కియే అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.


సింగపూర్‌ ప్రధానికి రెండు వారాల్లో రెండోసారి కొవిడ్‌

సింగపూర్‌: సింగపూర్‌ ప్రధానమంత్రి లీ హొసీన్‌ లూంగ్‌ రెండు వారాల కంటే తక్కువ వ్యవధిలో రెండోసారి కొవిడ్‌ బారిన పడటం తాజాగా చర్చనీయాంశమైంది. 71 ఏళ్ల లీ గత నెల 22న తొలిసారి కరోనా పాజిటివ్‌గా తేలారు. ఆరు రోజుల అనంతరం కోలుకున్నారు. కొవిడ్‌ ‘నెగిటివ్‌’గా నిర్ధారణ అయ్యారు. అయితే తాజాగా మరోసారి ఆయన మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని లీ గురువారం స్వయంగా వెల్లడించారు. ఇంత స్వల్ప వ్యవధిలో కొవిడ్‌ తిరగబెట్టడం అరుదని వైద్యులు తెలిపినట్లు ఆయన చెప్పారు.


చైనాలో మస్క్‌ పర్యటన ఆందోళనకరమే: వివేక్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాలో పర్యటిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ అక్కడి అధికారులు, కీలక నేతలతో మంతనాలు జరుపుతున్నారు. మస్క్‌ పర్యటనపట్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న వివేక్‌ రామస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికాలోని ప్రముఖ వ్యాపారవేత్తలను చైనా పావుగా వాడుకుంటోందని ఆరోపించారు. అమెరికాకు కావాల్సింది.. చైనా జేబుల్లో ఉండే నేతలు కాదని, బైడెన్‌తోనూ ఇదే తరహా సమస్యని ఆయన విమర్శలు గుప్పించారు.
Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు