జాహ్నవి మృతిపై నవ్వలేదు.. సియాటెల్‌ పోలీసు వివరణ

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి మృతి చెందడంపై అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడటంతో తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

Published : 17 Sep 2023 05:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి మృతి చెందడంపై అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడటంతో తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అగ్ర రాజ్యాన్ని భారత్‌ డిమాండ్‌ చేసింది. అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ వ్యాఖ్యలు జాహ్నవిని ఉద్దేశించి చేసినవి కావని పోలీసు అధికారి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (23) ఈ ఏడాది జనవరిలో సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు గురించి పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌.. చులకనగా మాట్లాడుతూ.. పగలబడి నవ్విన వీడియో ఒకటి ఇటీవల వైరలైంది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి.. ఈ మరణానికి విలువ లేదు’ అన్నట్లుగా ఆయన మాట్లాడటం దుమారం రేపింది. దీంతో ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే  డేనియల్‌పై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఈ వివాదంపై సియాటెల్‌ పోలీసు అధికారుల గిల్డ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘వైరల్‌ అయిన దృశ్యాలు బాడీ కెమెరా వీడియో రికార్డు చేసినవి. ఆ సంభాషణల్లో ఒకవైపే బయటికొచ్చింది. అందులో చాలా వివరాలున్నాయి. అవి ప్రజలకు తెలియవు. పూర్తి వివరాలు తెలియకపోవడంతో అక్కడ అసలేం జరిగిందో చెప్పడంలో మీడియా విఫలమైంది’ అంటూ డేనియల్‌కు మద్దతుగా గిల్డ్‌ వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు డేనియల్‌ రాసిన లేఖను గిల్డ్‌ విడుదల చేసింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు న్యాయస్థానంలో వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి తాను నవ్వానని.. బాధితురాలిని అవమానించేలా తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని