The Iconic India Club: లండన్‌లో ఇండియా క్లబ్‌ ఇక గత చరిత్రే

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో లండన్‌లో ఎందరో జాతీయవాదులకు సమావేశ మందిరంగా, ఇటీవలి దశాబ్దాలలో పరాయిగడ్డపై మాతృభూమి వాతావరణాన్ని అనుభవానికి తెచ్చే భవనంగా వెలిగిన ‘ఇండియా క్లబ్‌’ ఆదివారం నుంచి శాశ్వతంగా మూతపడనున్నది.

Updated : 17 Sep 2023 08:55 IST

నేటి నుంచి కనుమరుగు

లండన్‌: భారత స్వాతంత్య్ర ఉద్యమంలో లండన్‌లో ఎందరో జాతీయవాదులకు సమావేశ మందిరంగా, ఇటీవలి దశాబ్దాలలో పరాయిగడ్డపై మాతృభూమి వాతావరణాన్ని అనుభవానికి తెచ్చే భవనంగా వెలిగిన ‘ఇండియా క్లబ్‌’ ఆదివారం నుంచి శాశ్వతంగా మూతపడనున్నది. బ్రిటన్‌లో మొట్టమొదటి భారతీయ రెస్టారెంట్లలో ఒకటి ఈ క్లబ్‌లోనే 1946లో ప్రారంభమైంది. ప్రవాసులకు దోశలు, పకోడీల వంటి భారతీయ వంటకాలను అందించింది. క్లబ్‌ గోడలపై భారతదేశ మాజీ ప్రధానమంత్రుల చిత్రపటాలు అలంకరించి ఉంటాయి. స్వతంత్ర భారతదేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌, చివరి వైస్రాయ్‌ లార్డ్‌ మౌంట్‌ బాటెన్‌లు కూడా ఇండియా క్లబ్‌ను సందర్శించారు. లండన్‌లోని భారతీయ వృత్తి నిపుణులకు ఇక్కడి హోటల్‌ సరసమైన ధరలకు ఆహార పదార్థాలు అందించేది. వారు ఇక్కడ సమావేశమై రాజకీయాలు, ఇతర అంశాల గురించి చర్చించుకోవడం, తమ భవిష్యత్తుకు పథకాలు వేసుకోవడం వంటివి చేసేవారు. ఈ క్లబ్‌ను స్థాపించిన వీకే కృష్ణమీనన్‌ స్వతంత్ర భారతానికి బ్రిటన్‌లో తొలి హైకమిషనర్‌ అయ్యారు. 26 గదుల శ్ట్రాండ్‌ కాంటినెంటల్‌ హోటల్‌ మొదటి అంతస్తులో ఇండియా క్లబ్‌ ఉంది. హోటల్‌ శిథిలం కాకుండా నిరోధించి, విజయవంతంగా నడుపుతున్న పార్సీ దంపతులు యాద్‌ గార్‌ మార్కర్‌, ఫ్రెనీలకు ప్రస్తుత యజమానులు 1997లో నోటీసు ఇచ్చారు. భవనాన్ని ఖాళీ చేయాలని, అక్కడ కొత్తగా ఆధునిక హోటల్‌ నిర్మించాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. ఇండియా క్లబ్‌ను వేరే చోటుకు మార్చాలని ప్రయత్నిస్తున్నట్లు యాద్‌ గార్‌ కుమార్తె, హోటల్‌ నిర్వాహకురాలు ఫిరోజా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని