లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రుల అక్కసు

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించి సాహసాలు చేయాలనుకునేవారు ఇక్కడికి రావాలని పిలుపునివ్వడంపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు.

Updated : 08 Jan 2024 05:30 IST

అంత పరిశుభ్రంగా ఉంచలేరని వ్యాఖ్యలు
మోదీ వీడియోను ట్యాగ్‌ చేస్తూ విమర్శలు
భారత్‌ తీవ్రంగా స్పందించడంతో వెంటనే మంత్రుల సస్పెన్షన్‌

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించి సాహసాలు చేయాలనుకునేవారు ఇక్కడికి రావాలని పిలుపునివ్వడంపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. భారత్‌లో పర్యాటక ప్రాంతాలను అంత పరిశుభ్రంగా ఉంచలేరని విమర్శించారు. దీనిపై భారతీయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. అటు కేంద్ర ప్రభుత్వమూ తీవ్రంగా స్పందించింది. దీంతో మాల్దీవుల ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అవి వ్యక్తిగత వ్యాఖ్యలని స్పష్టం చేసింది. భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండు చేసింది.

లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు మరియం షివునా, మల్షా షరీఫ్‌, అబ్దుల్లా మజూం మాజిద్‌ సామాజిక మాధ్యమాల్లో విద్వేష వ్యాఖ్యలు చేశారు. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్‌ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని విమర్శించారు. ‘పర్యాటకంలో మాతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమే (ప్రధాని మోదీ పర్యటన వీడియోను ట్యాగ్‌ చేస్తూ). మా దేశం అందించే సేవలను ఎలా అందించగలరు? పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు? అక్కడి గదుల్లో వచ్చే వాసన అతి పెద్ద సమస్య’ అని మంత్రి మాజిద్‌ ట్వీట్‌ చేశారు. ఆయన ట్వీట్‌పై భారతీయ నెటిజన్లు మండిపడ్డారు. పర్యాటకంగా ఆ దేశాన్ని బహిష్కరించాలని డిమాండు చేశారు. మంత్రుల వ్యాఖ్యలను మాలెలోని భారత హైకమిషన్‌ వర్గాలు మాల్దీవుల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ప్రధానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టాయి.

ప్రభుత్వానికి సంబంధం లేదు: మాల్దీవులు

భారత్‌ను ఉద్దేశించి మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మాల్దీవుల విదేశాంగశాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఒక దగ్గరి నేతను ఉద్దేశించి మా దేశానికి చెందిన కొందరు నాయకులు సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వాటితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు’’ అని ప్రకటనలో పేర్కొంది. ఆ తర్వాత వారిపై ప్రభుత్వం వేటు వేసింది.

ట్రెండింగ్‌లో బాయ్‌కాట్‌ మాల్దీవులు

భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. మాల్దీవులకు ప్రత్యామ్నాయ పర్యాటక గమ్య స్థానం లక్షద్వీప్‌ అంటూ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూ బాయ్‌కాట్‌ మాల్దీవులు హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. భారత్‌లోని లక్షద్వీప్‌, సింధు దుర్గ్‌ లాంటి ద్వీపాలను సందర్శించాలని సెలబ్రిటీలు కూడా విజ్ఞప్తి చేశారు. బాలీవుడ్‌ హీరోలు అక్షయ్‌ కుమార్‌, జాన్‌ అబ్రహాం, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ దీనికి మద్దతు తెలుపుతూ ఎక్స్‌లో పోస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని