Israel-Hamas Conflict: ‘వెంటనే ఆ దేశాన్ని వీడండి’: తమ పౌరులకు ప్రపంచ దేశాల హెచ్చరికలు

Israel-Hamas Conflict: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం లెబనాన్‌కు విస్తరిస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాంతో అక్కడ ఉన్న తమ పౌరులకు వివిధ దేశాలు హెచ్చరికలు జారీచేశాయి. 

Updated : 04 Jan 2024 13:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హమాస్‌ అగ్రనేత సలేహ్‌ అరౌరీని ఇజ్రాయెల్‌(Israel) డ్రోన్‌ మట్టుపెట్టడంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం విస్తరిస్తుందనే ఆందోళనలు పెరగడంతో  లెబనాన్‌(Lebanon)లో ఉన్న తమ పౌరులకు పలు దేశాలు అడ్వైజరీలను జారీ చేశాయి. తక్షణమే లెబనాన్‌ను వీడాలని కోరాయి. (Israel-Hamas Conflict)

‘ఇప్పటికీ లెబనాన్‌లో ఉన్న మా పౌరులు ‘ఎలిఫాండ్‌’ జాబితాలో రిజిస్టర్‌ చేసుకోవాలి. సాధ్యమైనంత తర్వగా ఆ దేశాన్ని విడిచిపెట్టాలి’ అని జర్మనీ విదేశాంగ శాఖ హెచ్చరించింది. అక్టోబర్‌లో యుద్ధం మొదలైనప్పుడు కూడా ఈ తరహా అడ్వైజరీని జారీ చేసింది. కెనడా, స్వీడన్‌ సహా పలు అమెరికా మిత్రదేశాలు ఇదే తరహాలో తమ పౌరులకు జాగ్రత్తలు చెప్పాయి. అరౌరీ మృతి అనంతరం ఇజ్రాయెల్‌ జరిపిన క్షిపణి దాడుల్లో తొమ్మిది మంది హెజ్‌బొల్లా మిలిటెంట్లు చనిపోయినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

‘ఇరాన్‌ పేలుళ్ల వేళ.. అమెరికాలో క్యాపిటల్‌ భవనాలకు బాంబు బెదిరింపులు’

సలేహ్‌ అరౌరీ హమాస్‌ అల్‌-కస్సం బ్రిగేడ్‌ వ్యవస్థాపకుల్లో ఒకడు. 2010 నుంచి హమాస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు. ముఖ్యంగా ఇరాన్‌, హమాస్‌ మధ్య సంబంధాల బలోపేతంలో ఇతడి పాత్రే కీలకం. హమాస్‌ సంస్థను మట్టుపెట్టడమే తమ లక్ష్యమని ప్రకటించిన ఇజ్రాయెల్‌.. లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో డ్రోన్‌ దాడి ద్వారా అరౌరీని హతమార్చింది. ఈ దాడి గురించి మిత్రదేశమైన అమెరికాతోనూ ముందుగా పంచుకోలేదు. 

తమ దాడుల్లోనే అరౌరీ మృతి చెందాడని ఇంతవరకు ఇజ్రాయెల్ ప్రకటించుకోలేదు. కానీ హమాస్‌, హెజ్‌బొల్లా, లెబనాన్‌ భద్రతా దళాలు మాత్రం ఈ ఘటన వెనక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఆరోపిస్తున్నాయి. అరౌరీ మృతికి బదులు తీర్చుకుంటామని హెజ్‌బొల్లా ప్రకటించింది. మరోపక్క.. మిగిలిన బందీలు, కాల్పుల విరమణ  కోసం జరుగుతోన్న చర్చలను హమాస్‌ నిలిపివేసింది. ఇప్పటికీ హమాస్‌ చెరలో 129 మంది బందీలుగా ఉన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని