Joe Biden: ‘అమెరికన్లకు హాని చేస్తే ఇలాగే ఉంటుంది’.. ప్రతీకార దాడులపై బైడెన్

Joe Biden: ఇరాక్‌, సిరియాలో ప్రతీకార దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. అమెరికన్లకు హాని కలిగిస్తే ప్రతిచర్య ఇలాగే ఉంటుంది అని హెచ్చరించారు.

Updated : 03 Feb 2024 10:37 IST

వాషింగ్టన్‌: ఇటీవల జోర్డాన్‌ (Jordan)లో అమెరికా (USA) సైనిక క్యాంప్‌పై జరిగిన డ్రోన్‌ దాడికి అగ్రరాజ్యం ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇరాక్‌ (Iraq), సిరియా (Syria)లోని ఇరాన్‌ మద్దతు గల మిలిటెంట్లు, ఇరాన్‌ (Iran) రివల్యూషనరీ గార్డుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఈ దాడులపై తాజాగా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) స్పందించారు. తాము ఘర్షణలను కోరుకోవడం లేదని, కానీ అమెరికన్లకు హాని కలిగిస్తే మాత్రం ప్రతిచర్య ఇలాగే ఉంటుందని స్పష్టం చేశారు.

‘‘మధ్య ప్రాచ్యం లేదా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఘర్షణలు జరగాలని మేం కోరుకోవట్లేదు. కానీ, మాకు నష్టం కలిగించాలని చూసే వారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. అమెరికన్లకు హాని చేస్తే మేం కచ్చితంగా ప్రతిస్పందిస్తాం’’ అని బైడెన్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. రానున్న రోజుల్లో తమ టార్గెట్లపై  మరిన్ని భీకర దాడులు ఉంటాయని హెచ్చరించారు.

ముగ్గురు సైనికుల మృతి.. ప్రతీకార దాడులు మొదలు పెట్టిన అమెరికా

ఈ దాడులను ఇరాక్‌ మిలిటరీ తీవ్రంగా ఖండించింది. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని దుయ్యబట్టింది. అయితే, దీనిపై పెంటగాన్‌ స్పందిస్తూ.. దాడుల గురించి తాము ముందే సమాచారమిచ్చినట్లు తెలిపింది. ‘‘ఇరాక్‌ ప్రభుత్వానికి సమాచారం అందించిన అనంతరమే వారి భూభాగంలో దాడులు చేపట్టాం’’ అని వైట్‌హౌస్‌ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ తెలిపారు.

దాడుల్లో 18 మంది మృతి..

జోర్డాన్‌లో ఇటీవల అమెరికా సైనిక క్యాంప్‌పై డ్రోన్‌ దాడి జరగడంతో ముగ్గురు సైనికులు మృతిచెందారు. దీన్ని అగ్రరాజ్యం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే ఇరాక్‌, సిరియాల్లోని 85 ప్రాంతాల్లో యూఎస్‌ దాడులు చేపట్టింది. దీర్ఘశ్రేణి బీ-1 బాంబర్లతో విరుచుకుపడింది. సిరియాలో జరిపిన దాడుల్లో 18 మంది ఇరాన్‌ మద్దతు గల మిలిటెంట్లు మరణించినట్లు యూకేలోని సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ సంస్థ వెల్లడించింది. ఇరాక్‌లోనూ పలు మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు