Imran Khan: భారత్‌లో పెట్రో ధరల తగ్గింపుపై స్పందించిన ఇమ్రాన్‌ఖాన్‌

అధికారంలో ఉండగా భారత్‌పై అర్థరహిత ఆరోపణలు చేసిన పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. పదవీచ్యుతుడయ్యాక ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.....

Updated : 22 May 2022 11:20 IST

ఇస్లామాబాద్‌: అధికారంలో ఉండగా భారత్‌పై అర్థరహిత ఆరోపణలు చేసిన పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. పదవీచ్యుతుడయ్యాక ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై సుంకాన్ని తగ్గించడంపై ఆయన స్పందించారు. అమెరికా ఒత్తిడిని సైతం సమర్థంగా ఎదుర్కొని భారత్‌ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసిందన్నారు. క్వాడ్‌ కూటమిలో ఉన్నప్పటికీ.. భారత్‌ తమ ప్రజలకు ఉపశమనం కల్పించడం కోసమే అలా చేసిందని వివరించారు. భారత్‌కు స్వతంత్ర విదేశాంగ విధానం ఉండడం వల్లే అది సాధ్యమైందన్నారు. భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపునకు సంబంధించిన మీడియా కథనాన్ని ఆయన తన ట్వీట్‌కు జత చేశారు.

తాను అధికారంలో ఉండగా.. తమ ప్రభుత్వం కూడా ప్రత్యేక విదేశాంగ విధానం కోసం కృషి చేసిందన్నారు. కానీ, స్థానిక మీర్‌ జాఫర్లు, మీర్‌ సాదిక్‌లు విదేశీ శక్తులకు తలొగ్గి అధికార మార్పిడికి కారణమయ్యారని పరోక్షంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫలితంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో తలాతోక లేని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు.

అధిక ధరల భారంతో అల్లాడిపోతున్న ప్రజలపై కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. నిత్యావసరాల పెంపునకు, తద్వారా ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్న పెట్రో ఉత్పత్తుల ధరల పరుగులకు కళ్లెం వేసింది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ శనివారం సాయంత్రం ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. దీంతో ఆ రెండు ఇంధనాల ధర లీటర్‌కు వరుసగా రూ.9.50, రూ.7 వరకు దిగి వస్తుందని తెలిపారు. ప్రధాన మంత్రి ఉజ్వల్‌ యోజన లబ్ధిదారులకు ఒక్కో గ్యాస్‌ సిలిండర్‌పై రూ.200 (12 సిలిండర్ల వరకు) రాయితీ కూడా ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని