Mukul Arya: పాలస్తీనాలో భారత రాయబారి అనుమానాస్పద మృతి

పాలస్తీనాలో భారత రాయబారిగా ఉన్న ముకుల్‌ ఆర్య అనుమానాస్పదస్థితిలో మరణించారు...

Updated : 07 Mar 2022 05:49 IST

న్యూదిల్లీ: పాలస్తీనాలో భారత రాయబారిగా ఉన్న ముకుల్‌ ఆర్య అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. రమల్లాలోని భారత ఎంబసీలో ఆయన విగతజీవిగా కనిపించారు. ముకుల్‌ ఆర్య చనిపోయిన విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్‌.జయ్‌శంకర్‌ ధ్రువీకరించారు. ఆయన మృతిపై జయ్‌శంకర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘రమల్లాలోని భారత ప్రతినిధి ముకుల్‌ ఆర్య మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అతను ఎంతో తెలివైన, ప్రతిభావంతుడైన అధికారి. ముకుల్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి’’ అని జయ్‌శంకర్‌ ట్వీట్‌ చేశారు. 

భారత రాయబారి ముకుల్‌ మృతిపై పాలస్తీనా అగ్రశ్రేణి నాయకత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ముకుల్‌ మృతిచెందాడన్న వార్త తెలియగానే ఆ దేశ అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌, ప్రధాని మహమ్మద్‌ ష్టాయే భద్రత, పోలీసు, ఆరోగ్య, ఫోరెన్సిక్‌ అధికారులను అప్రమత్తం చేసినట్లు అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వెంటనే భారత రాయబార కార్యాలయానికి చేరుకొని ఆయన మరణానికి సంబంధించి నిశిత పరిశీలన చేయాలని ఆదేశించినట్లు పేర్కొంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అన్నిరకాలుగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముకుల్‌ భౌతికకాయాన్ని తరలించేందుకు భారత విదేశీమంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అక్కడి విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. ముకుల్‌ మరణం పట్ల పాలస్తీనా విదేశాంగశాఖ మంత్రి రియాద్‌ అల్‌ మాలికీ భారత విదేశాంగ మంత్రి జయ్‌శంకర్‌కు, భారత ప్రభుత్వానికి, ఆర్య కుటుంబ సభ్యులకు తన సానుభూతి వ్యక్తం చేశారు. 

ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌ 2008 బ్యాచ్‌కు చెందిన ముకుల్‌ ఆర్య దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రంలో విద్యనభ్యసించారు. అనంతరం ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికై కాబుల్‌, మాస్కోల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో, దిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయంలో విధులు నిర్వర్తించారు. పారిస్‌లోని యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధి బృందంలో సైతం పనిచేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని