Ukraine Crisis: రష్యా యుద్ధ వ్యూహం మారిందా? వెనక్కి తగ్గడంపై అగ్రరాజ్యం అనుమానం!

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా వ్యూహం మార్చిందా? రాజధాని కీవ్‌ను వదిలి వెళ్తున్నట్టు ప్రకటించిన రష్యా బలగాలు.. ఇక కొత్త ప్రాంతాలపై దృష్టిసారించనున్నాయా?రష్యాను నమ్మలేమంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన ప్రకటన వెనుక ఆంతర్యం......

Published : 31 Mar 2022 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా వ్యూహం మార్చిందా? రాజధాని కీవ్‌ను వదిలి వెళ్తున్నట్టు ప్రకటించిన రష్యా బలగాలు.. ఇక కొత్త ప్రాంతాలపై దృష్టిసారించనున్నాయా?రష్యాను నమ్మలేమంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన ప్రకటన వెనుక ఆంతర్యం ఇదేనా? ఉక్రెయిన్‌లో వేర్పాటువాద ప్రాంతాలపై రష్యా గురిపెట్టనుందా? రష్యా వ్యూహంపై అమెరికా, బ్రిటన్‌ పలు విశ్లేషణలు చేస్తున్నాయి. 

ఉక్రెయిన్‌పై సైనిక చర్యతో ఆర్థికంగా, సైనికపరంగా భారీ నష్టాన్ని చవిచూస్తోన్న రష్యా యుద్ధ వ్యూహాన్ని మార్చినట్టు తెలుస్తోంది. నిన్న టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఇరుదేశాల మధ్య జరిగిన శాంతి చర్చల దృష్ట్యా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై దాడుల్ని గణనీయంగా తగ్గించనున్నట్టు క్రెమ్లిన్‌ చేసిన ప్రకటన వెనుక మరో వ్యూహం ఉందని అమెరికా, బ్రిటన్‌ ఉక్రెయిన్‌ను హెచ్చరిస్తున్నాయి. కీవ్‌ను వదిలి ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాలపై రష్యా దృష్టిపెట్టనున్నట్టు సమాచారం. ఇప్పటివరకు దాడి చేయని ల్వీవ్‌ నగరంపై మాస్కో సేనలు క్షిపణిదాడులు చేయడం ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయి. నిన్న జరిగిన శాంతి చర్చల్లోనూ కేవలం కీవ్‌, చెర్నిహివ్‌ నగరాల నుంచి మాత్రమే బలగాల్ని ఉపసంహరించేందుకు రష్యా అంగీకరించింది. ఇతర ప్రధాన నగరాలైన మేరియుపోల్‌, సుమీ, ఖార్కివ్‌, ఖేర్సన్‌, మైకోలివ్‌ ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. అటు, కీవ్‌, చెర్న్‌హివ్‌ నుంచి రష్యా తమ బలగాల్ని ఉపసంహరించుకొని వాటిని వేర్పాటువాద ఉద్యమాలు జరుగుతున్న డొనెట్స్క్‌, లుహాన్స్క్‌కు తరలించే అవకాశం ఉందని బ్రిటన్‌ రక్షణ మంత్రిత్వశాఖ అంచనా వేస్తోంది. దీంతో ఆ ప్రాంతాల్లో విస్తరణ వాదం ఊపందుకోనుందని ఆందోళన వ్యక్తంచేస్తోంది. 

కీవ్‌లో రష్యా వెనక్కి తగ్గడంపై అగ్రరాజ్యం అమెరికా కూడా అనుమానం వ్యక్తంచేస్తోంది. రష్యా తమ బలగాల్ని ఉపసంహరించింది అనడం కంటే దారిమళ్లించింది అనడం సబబుగా ఉంటుందని అమెరికా రక్షణశాఖ కార్యాలయం అధికారప్రతినిధి జాన్‌ కిర్బీ వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాలపై భారీగా దాడులు జరిగే అవకాశం కనబడుతోందని తెలిపారు. కీవ్‌కు కూడా పూర్తిగా ముప్పు తొలగిపోలేదన్నారు. అటు, కీవ్‌ సరిహద్దుల నుంచి రష్యా చాలా తక్కువ సంఖ్యలో బలగాల్ని కదిలిస్తోందని అమెరికా పేర్కొంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం రష్యాను పూర్తిగా నమ్మలేమన్నారు. ఉక్రెయిన్‌ సైనికుల సాహసోపేత చర్యల వల్లే రష్యా వెనక్కి తగ్గిందన్నారు. పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదన్న జెలెన్‌స్కీ.. సవాళ్లు తొలగిపోలేదన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని