Israel Hamas: పౌర మరణాలను తగ్గించడంలో విఫలమయ్యాం: నెతన్యాహు

గాజాలో ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో విఫలమయ్యామని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తెలిపారు.

Published : 17 Nov 2023 16:42 IST

టెల్‌అవీవ్: హమాస్‌ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దళాలు గాజాపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే యుద్ధం (Israel Hamas Conflict)లో పెద్దఎత్తున పౌర మరణాలు (Civilian Casualties) చోటుచేసుకుంటున్నాయి. సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలపై ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు (Netanyahu) మాట్లాడుతూ.. తమ సైన్యం గాజాలో పౌరులను రక్షించేందుకు చేయగలిగినదంతా చేస్తోందని తెలిపారు. అయితే.. ప్రాణనష్టాన్ని తగ్గించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు. అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడికి ప్రతీకారంగా వేల మంది పాలస్తీనీయన్లను చంపడం.. కొత్త తరంలో ద్వేషాన్ని పెంచుతుందా? అని ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు నెతన్యాహూ ఈ మేరకు స్పందించారు.

‘పౌర మరణాలు విషాదకరం. వాస్తవానికి.. ఇలాంటి ఘటనలు సంభవించకూడదు. ఎందుకంటే.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పౌరులకు ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకుగానూ చేయగలిగినదంతా చేస్తున్నాం. అయితే హమాస్ ఉగ్రవాదులే వారిని ముప్పు ముంగిట ఉంచుతున్నారు’ అని నెతన్యాహు ఆరోపించారు. ‘పౌర మరణాలను నివారించేందుకు.. ముందస్తు హెచ్చరికగా కరపత్రాలు చేరవేస్తున్నాం. యుద్ధక్షేత్రం నుంచి తరలివెళ్లాలని సెల్‌ఫోన్‌ల ద్వారా సమాచారం అందిస్తున్నాం. దీంతో చాలా మంది వెళ్లిపోయారు’ అని తెలిపారు. ఇటీవల దక్షిణ గాజాలోని పౌరులను కూడా స్వీయ భద్రత కోసం ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్‌ కరపత్రాలను జారవిడిచిన విషయం తెలిసిందే. అయితే.. వారిని ఎక్కడికి తరలివెళ్లాలని సూచించిందో స్పష్టంగా తెలియలేదు.

‘అల్‌-షిఫా’ కింద బయటపడ్డ సొరంగం..!

యుద్ధం ప్రారంభంలోనూ.. ఉత్తర గాజాలోని పౌరులను దక్షిణం వైపు వెళ్లమని ఇజ్రాయెల్‌ సూచించింది. దీంతో లక్షల మంది పాలస్తీనీయన్లు తరలివెళ్లారు. అప్పటికే గాజాను దిగ్బంధం చేయడంతో స్థానికంగా మానవతా సంక్షోభం తలెత్తింది. ఆహారం, నిత్యావసరాలు, ఔషధాలు, ఇంధనం తదితరాల కొరతతో గాజావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల్లో పరిస్థితి దిగజారింది. మరోవైపు ఇజ్రాయెల్‌ బలగాలు గాజాలో దాడులు, తనిఖీలు కొనసాగిస్తున్నాయి. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్‌-షిఫా కింద సొరంగాన్ని కనుగొన్నట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ప్రకటించింది. ఇదిలా ఉండగా.. గాజాపై ఇజ్రాయెల్‌ జరుపుతోన్న భీకర దాడుల్లో ఇప్పటివరకు 11,500 మందికిపైగా పౌరులు మృతి చెందినట్లు నివేదికలు వస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని