Pakistan: ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్థాన్‌ గట్టెక్కడం కష్టమే!

3 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం చేసేందుకు ఐఎంఎఫ్‌ ముందుకొచ్చినా.. పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని గ్లోబల్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ అభిప్రాయపడింది.

Updated : 04 Jul 2023 20:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ (Pakistan) ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కడం కష్టమేనని గ్లోబల్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ (Moody's) తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నుంచి 3 బిలియన్‌ డాలర్ల రుణం ఇచ్చేందుకు స్టాండ్‌బై అగ్రిమెంట్‌ (SBA) జరిగినప్పటికీ పాకిస్థాన్‌ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోక తప్పదని పేర్కొంది. రోజురోజుకూ నగదు నిల్వలు తరిగిపోవడంతోపాటు, ఆర్థిక అవసరాలు పెరిగిపోతున్న క్రమంలో దీని నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్‌తో పాకిస్థాన్‌ ఎస్‌బీఏ కుదుర్చుకుంది.అయితే, దీనిపై ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యులు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. జులై మధ్య నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని పాకిస్థాన్‌ భావిస్తోంది.

మూడీస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్‌ మధ్య నాటికి పాకిస్థాన్‌ దగ్గర 3.5 బిలియన్‌ డాలర్ల మేర విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఇది కనీసం నెల రోజుల దిగుమతులకు కూడా సరిపోదు. పాక్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక నిల్వల కొరత ప్రభావం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపైనే కాకుండా.. భవిష్యత్‌లో దేశ అవసరాలను తీర్చుకునేందుకు భయంకరమైన సవాల్‌ విసురుతుందని మూడీస్‌ అభిప్రాయపడింది. తాజా ఆర్థిక సంవత్సరంలో అసలు, వడ్డీ కలిపి పాకిస్థాన్‌ 25 బిలియన్‌ డాలర్లమేర చెల్లించాల్సి ఉంది. కానీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో చెల్లింపు ప్రక్రియ వాయిదా పడింది. రానున్న రోజుల్లో పాక్‌కు ఇది మరింత భారంగా తయారవుతుందని మూడీస్‌ వెల్లడించింది. తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా దీర్ఘకాలిక ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాకిస్థాన్‌ నడుచుకోవాలని మూడీస్‌ నొక్కి చెప్పింది. దీర్ఘకాలం కొనసాగేలా..ఐఎంఎఫ్‌తో ఆచరణీయ యోగ్యమైన మరో ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అయితే, పాకిస్థాన్‌లో రాబోయే ఎన్నికలు ముగిసిన తర్వాతనే ఆ దిశగా స్పష్టత వచ్చే అవకాశముందని పేర్కొంది.

మరోవైపు ఐఎంఎఫ్‌ సూచించిన నిబంధనలు పాకిస్థాన్‌ పాటించినప్పుడే 3 బిలియన్ల డాలర్లను విడుదల చేస్తుంది. 2019లో ఐఎంఎఫ్‌ అంగీకరించిన 6.5 బిలియన్‌ డాలర్ల సహాయ ప్యాకేజీ నుంచి విడుదల కావాల్సిన 2.5 బిలియన్‌ డాలర్ల కోసం పాక్‌ ఎదురు చూస్తోంది. తాజాగా ఆశించిన దాని కంటే 0.5 బిలియన్‌ డాలర్లు అదనంగా ఇచ్చేందుకు ఈ ఒప్పందం కుదిరింది. గతేడాది పాకిస్థాన్‌లో తీవ్రమైన వరదలు రావడంతో ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతింది. దీనికి తోడు చాలా కుటుంబాలు రోడ్డునపడ్డాయి. మరోవైపు ఇమ్రాన్‌ ప్రభుత్వ పతనం వంటి రాజకీయ అస్థిర ఘటనలు కూడా చోటు చేసుకొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని