Joker: మాజీ ప్రేయసి పెళ్లి చేసుకుందని రైలుకు నిప్పు.. జపాన్‌ ‘జోకర్’కు 23 ఏళ్ల జైలు

రైల్లో ప్రయాణికులపై దాడి చేయడంతోపాటు బోగీకి నిప్పు పెట్టిన కేసులో జపాన్‌ ‘జోకర్‌’కు 23 ఏళ్ల జైలు శిక్షపడింది. తన మాజీ ప్రేయసి వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుందన్న ఆగ్రహంతో ఈ దుశ్చర్యకు ఒడిగట్టాడు.

Updated : 01 Aug 2023 13:36 IST

టోక్యో: బ్రేకప్‌ చెప్పిన ఆరు నెలల్లోనే తన ప్రేయసి వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుందన్న అక్కసుతో.. రైల్లో పలువురిపై దాడికి పాల్పడటంతోపాటు బోగీకి నిప్పు పెట్టిన కేసులో ఓ నిందితుడికి జైలు శిక్ష పడింది. దాడికి పాల్పడి, తద్వారా తనకు మరణ శిక్ష పడేలా చేసుకోవాలనుకున్నట్లు అతడు విచారణ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. అయితే, కోర్టు మాత్రం అతడికి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జపాన్‌ (Japan)లో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

తన నుంచి విడిపోయిన ఆరు నెలల్లోనే తన ప్రేయసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని తెలుసుకుని క్యోటా హతోరి (26) అనే యువకుడు మనస్తాపానికి గురయ్యాడు. ఏదైనా భారీ దాడికి పాల్పడి, తద్వారా మరణ శిక్షకు గురై జీవితాన్ని ముగిద్దామని భావించాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం హలోవీన్‌ రోజు కామిక్‌ విలన్‌ ‘జోకర్‌’లా తయారై.. టోక్యో ఎక్స్‌ప్రెస్‌ రైలులో బీభత్సం సృష్టించాడు. ఓ ప్రయాణికుడిని కత్తితో పొడవడంతోపాటు పలువురిపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా.. రైలు బోగీలో నిప్పుపెట్టి ఇతరులను హతమార్చేందుకు యత్నించాడు. ఈ క్రమంలో 12 మంది గాయపడ్డారు.

చైనీస్‌ రెస్టారంట్‌లో వికృత చేష్టలు.. నోట్లో నోరు పెట్టి తినిపిస్తారట!

ఈ కేసులో విచారణ చేపట్టిన స్థానిక కోర్టు.. క్యోటా హతోరిని దోషిగా తేల్చింది. రైల్లో ఉన్న అనేక మంది ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని.. స్వార్థపూరిత ఉద్దేశంతో నేరానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఈ క్రమంలోనే అతడికి 23 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని