Kim Jong Un: అదే ఉత్తర కొరియా అంతిమ లక్ష్యం!

ఇటీవలి కాలంలో వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా(North Korea) హడలెత్తిస్తోన్న విషయం తెలిసిందే. అయితే.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉండటమే ఉత్తర కొరియా అంతిమ లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌(Kim Jong Un) అన్నారు.

Published : 28 Nov 2022 01:48 IST

ప్యోంగ్యాంగ్‌: ఇటీవలి కాలంలో వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా(North Korea) హడలెత్తిస్తోన్న విషయం తెలిసిందే. అయితే.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉండటమే ఉత్తర కొరియా అంతిమ లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌(Kim Jong Un) అన్నారు. ఉత్తర కొరియా అతిపెద్ద బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షలో భాగమైన సైనిక అధికారులను ఆయన తాజాగా అభినందించారు. ఈ సందర్భంగా కిమ్‌ ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు అధికారిక మీడియా కేసీఎన్‌ఏ ఆదివారం తెలిపింది. ఈ అధికారిక కార్యక్రమంలో కిమ్‌ మరోసారి తన కుమార్తెతో కనిపించడం గమనార్హం.

‘దేశంతోపాటు పౌరుల గౌరవం, సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకే అణుశక్తిని నిర్మిస్తున్నాం. ప్రపంచంలోనే అత్యంత బలమైన అణ్వాయుధ శక్తిగా నిలవడమే మా దేశ అంతిమ లక్ష్యం’ అని కిమ్ పేర్కొన్నారు. హ్వాసాంగ్‌-17 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)ని ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధంగా అభివర్ణించారు. పటిష్ఠమైన సైన్యాన్ని నిర్మించగల ఉత్తర కొరియా సంకల్పం, సామర్థ్యాన్ని ఇది చాటుతుందన్నారు. బాలిస్టిక్ క్షిపణులపై అణు వార్‌హెడ్‌లను అమర్చే సాంకేతికత అభివృద్ధిలో ఉత్తర కొరియా శాస్త్రవేత్తలు అద్భుతమైన ముందడుగు వేశారనీ చెప్పారు. ఇదిలా ఉండగా.. ఉత్తర కొరియా ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎనిమిది ఖండాంతర క్షిపణులను పరీక్షించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని