Long Social Distancing: కొవిడ్‌ నేర్పిన పాఠాలు.. యువతలో మారిన అలవాట్లు

యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోని నెట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.

Published : 01 Jun 2022 02:10 IST

వైరస్‌ ఉద్ధృతి తగ్గినా నిబంధనలు పాటిస్తున్న పౌరులు

లండన్‌: యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఓ వైపు కొవిడ్‌ ఆంక్షలు, నిబంధనలు తొలగిపోవడం, కేసుల సంఖ్య తగ్గడం, వ్యాక్సిన్లు, బూస్టర్లు అందుబాటులోకి రావడంతో ప్రజలందరూ సాధారణ అలవాట్లవైపు తిరిగి చూస్తున్నారు. కేవలం ప్రజారవాణా, ప్రైవేటు కార్యాలయాలు మినహా మిగతా అన్ని కార్యక్రమాలను కొవిడ్‌ కంటే ముందున్న మాదిరిగా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మహమ్మారి నేర్పిన పాఠాలను గుర్తుంచుకొని తమ అలవాట్లను కొనసాగించే ప్రయత్నం కనిపిస్తోంది. దీన్నే ప్రస్తుతం లాంగ్‌ సోషల్‌ డిస్టాన్సింగ్‌గా పేర్కొంటున్నారు.

లాంగ్‌ సోషల్‌ డిస్టాన్సింగ్‌..

ఉదాహరణకు బ్రిటన్‌లో మూడో వంతు ప్రజలు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉంటున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరో మూడో వంతు మంది మాత్రం కుటుంబేతరులతో కలిసినప్పుడు భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటిస్తున్నామని చెబుతున్నారు. యాభై శాతానికి పైగా ప్రజలు పలు సందర్భాల్లో మాస్కులు ధరిస్తున్నారు. కొవిడ్‌ తగ్గినప్పటికీ నిబంధనలు పాటించే మార్పునే లాంగ్‌ సోషల్‌ డిస్టాన్సింగ్‌ (Long Social Distancing)గా అభివర్ణిస్తున్నారు. అయితే, ఇది కేవలం బ్రిటన్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఫ్రాన్స్‌, స్పెయిన్‌, ఇటలీ, జర్మనీ దేశాల్లో ప్రతి పది మందిలో నలుగురు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక మహమ్మారి ముగిసిన తర్వాత భౌతిక దూరాన్ని పాటిస్తామని 13శాతం అమెరికన్లు పేర్కొనగా.. 46శాతం మంది సాధారణ కార్యకలాపాలకు పాక్షికంగా వస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు లాంగ్‌ సోషల్‌ డిస్టాన్సింగ్‌ను ఎవరు పాటిస్తున్నారో ఓసారి లుక్కేద్దాం.

ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారితోపాటు శారీరక వైకల్యం ఉన్నవారు లాంగ్‌ సోషల్‌ డిస్టాన్సింగ్‌ను కచ్చితంగా పాటిస్తున్నారు. కొవిడ్‌తో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయనే కారణంగా తాము సాధారణ స్థితికి రాలేమని బలంగా విశ్వసిస్తున్నారు.

కొవిడ్‌ ముప్పు అధికంగా ఉన్న 70ఏళ్ల వయసు పైబడిన వారు మాస్కులు ధరిస్తున్నారు. అయితే, భౌతికదూరం, మాస్కులు ధరించడంలో వృద్ధులకంటే మధ్య వయస్కులు కాస్త వెనుకబడి పోయినట్లు బ్రిటన్‌ గణాంకాలు చెబుతున్నాయి.

వృద్ధులతో పోలిస్తే యువకులు త్వరగా సామాజిక కార్యకలాపాల్లో వేగంగా పాలుపంచుకుంటున్నారు.

ఒమిక్రాన్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టిన వెంటనే తమ స్నేహితులను కలుసుకున్నట్లు 80శాతం (18-29 మధ్య వయసున్న) యువత పేర్కొంది. కాగా పెద్దవాళ్లలో మాత్రం 60 నుంచి 70 మంది మాత్రమే తమ మిత్రులను కలుసుకున్నామని చెప్పారు.

16-29 ఏళ్ల యువతలో 16శాతం మంది ఇంకా భౌతిక దూరం కచ్చితంగా పాటిస్తున్నామని చెప్పగా.. 40శాతం మంది ఏదో ఒక సమయంలో మాస్కు ధరిస్తున్నట్లు వెల్లడించారు

యువతను వెంటాడిన సవాళ్లు..

* మహమ్మారి సమయంలో ఎక్కువ నిందలు యువతపైనే వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, మహమ్మారి వేళ నిబంధనలు అతిక్రమించిన వారిలో యువతే ఎక్కువగా ఉన్నట్లు మరిన్ని సర్వేలు పేర్కొన్నాయి.

గడిచిన రెండేళ్లలో సాధారణంగా జీవితంపై సంతృప్తి వ్యక్తం చేసిన వాళ్లలో వృద్ధులతో పోలిస్తే యువత శాతం తక్కువగా ఉంది

మహమ్మారి సమయంలో మానసిక సమస్యలు యువతలోనే అధికం. ముఖ్యంగా సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువ మద్యం సేవించడం, సరైన వ్యాయామం చేయకపోవడం వంటివి కారణాలతో సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది

ఆందోళన, తీవ్ర ఒత్తిడి వంటి సమస్యలు కూడా యువతోనే ఎక్కువగా కనిపించాయి. ఇలా కొవిడ్‌ మహమ్మారి ఉద్ధతి తగ్గుతోన్న సమయంలో సాధారణ కార్యకలాపాలకు రావడంతో యువత, వృద్ధుల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని