Healthy Diet: 71% భారతీయులకు ఆరోగ్యకరమైన ఆహారమే అందడం లేదా..?

దేశంలో 71శాతం ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారని తాజా నివేదిక వెల్లడించింది.

Published : 04 Jun 2022 01:34 IST

సీఎస్‌సీ తాజా నివేదిక

దిల్లీ: దేశంలో 71శాతం ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారని తాజా నివేదిక వెల్లడించింది. ఇలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కలిగే వ్యాధుల వల్ల ప్రతి ఏటా 17లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలిపింది. ‘భారత్‌లో పర్యావరణ పరిస్థితి-2022’ పేరుతో సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (CSE), డౌన్‌ టు ఎర్త్‌ మ్యాగజైన్‌ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో దేశంలో పొషకాహార వివరాలను వెల్లడించింది.

ఆహారానికి సంబంధించిన వ్యాధుల్లో శ్వాసకోశ జబ్బులు, మధుమేహం, క్యాన్సర్‌, హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నట్లు తాజా నివేదిక తెలిపింది. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు వంటివి చాలా తక్కువ మోతాదులో తీసుకుంటుండగా.. శుద్ధిచేసిన మాంసం, రెడ్‌ మాంసం, చక్కెర మోతాదు అధికంగా ఉండే శీతల పానీయాలు ఎక్కువగా తీసుకుంటున్నట్లు వెల్లడించింది. 71శాతం భారతీయులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోతుండగా ప్రపంచ సరాసరి 42శాతంగా ఉందని పేర్కొంది. సగటు భారతీయుడి ఆహారంలో పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాల వంటివి సరైన మోతాదులో ఉండడం లేదని.. చేపలు, పాల పదార్థాలు, మాంసం మాత్రం ఆశించిన స్థాయిలోనే ఉన్నాయని వెల్లడించింది.

ఆరోగ్యకరమైన ఆహారం అంటే..?

వరల్డ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (FAO) ప్రకారం, ఓ వ్యక్తి తన ఆదాయంలో 63శాతానికి మించి ఆహారానికి ఖర్చుచేయాల్సి వస్తే దాన్ని భరించలేనిదిగా పరిగణిస్తారు. భారత్‌లో 20ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి రోజుకు 200గ్రాముల పండ్లు తీసుకోవాల్సి ఉండగా.. కేవలం 35.8గ్రాములు మాత్రమే తీసుకుంటున్నాడు. అదే కూరగాయల విషయానికొస్తే రోజుకు 300గ్రాములు తినాల్సి ఉండగా.. 168.7గ్రాములు తీసుకోగలుగుతున్నాడు. ఇక పప్పుదినుసులు 100గ్రాములు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ 24.9గ్రాములు, గింజలు 13శాతం మాత్రమే తీసుకుంటున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. అయితే, వీటిలో కొంత పురోగతి ఉన్నప్పటికీ పూర్తిగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రం తీసుకోలేకపోతున్నారని తెలిపింది.

మరోవైపు ఆహార ధరలనూ తాజా నివేదిక విశ్లేషించింది. గడిచిన ఒక్క ఏడాదిలోనే వినియోగదారుల ఆహార ధరల సూచిక (CFPI)లో 327శాతం పెరుగుదల కనిపించినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో వినియోగదారుల ధరల సూచిక (CPI) మాత్రం 84శాతం పెరిగినట్లు తెలిపింది. ధరల పెరుగుదల్లో ఆహారానికి సంబంధించినవే అధికంగా ఎగబాకాయి. ఉత్పత్తి వ్యయం పెరుగుతుండడం, అంతర్జాతీయంగానూ పంటల ధరలు పెరగడం, వాతావరణ మార్పులతో ఏర్పడే పరిస్థితుల వల్ల ఆహార పదార్థాల ధరలకు రెక్కలు వచ్చాయని తెలిపింది. ఇక ఆహార ధరల పెరుగుదల రేటు పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా ఉందని డౌన్‌ టు ఎర్త్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ రిచర్డ్‌ మహాపాత్ర వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని