Secret murder: ‘15 ఏళ్లుగా కవర్‌ చేసుకుంటున్నా.. ఇక నా వల్ల కాదు’.. అతడిని నేనే చంపేశా!

కొన్నేళ్ల క్రితం హత్యకు (Mexico Murder) పాల్పడిన వ్యక్తి.. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎన్నో అబద్ధాలు ఆడుతూనే ఉన్నాడు. ఇలా 15 ఏళ్లపాటు నెట్టుకొచ్చిన అతడు.. దాన్ని కవర్‌ చేసుకుంటూ చాలా అలసిపోయాడట.

Updated : 05 Jun 2023 19:36 IST

మెక్సికో సిటీ: మెక్సికోకు చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం ఓ హత్య (Mexico Murder) చేశాడు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పూడ్చివేశాడు. చనిపోయిన వ్యక్తి ఆచూకీ లభించకపోవడంతో కొన్నేళ్లపాటు దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు ఆ కేసును మూసివేశారు. కానీ, హత్య చేసిన వ్యక్తి మాత్రం తాను చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎన్నో అబద్ధాలు ఆడుతూనే ఉన్నాడు. ఇలా 15 ఏళ్లపాటు నెట్టుకొచ్చిన అతడు.. దాన్ని కవర్‌ చేసుకుంటూ చాలా అలసిపోయాడట. చివరకు తన వల్ల కావడం లేదంటూ పోలీసులకు తానే ఫోన్‌ చేసి నిజం చెప్పడంతో (Confess) హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

మెక్సికోకు చెందిన విలియం బిల్‌ బ్లడ్‌గెట్‌ అనే వ్యక్తి ఇంట్లో టోనీ పెరాల్టా (Tony Peralta) అనే యువకుడు అద్దెకు ఉండేవాడు. 2008 డిసెంబర్‌లో విలియం బిల్‌ అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. పది రోజులైనా ఆచూకీ లభించలేదు. బ్లడ్‌గెట్‌ కుమారుడి ఫిర్యాదుతో 2009 జనవరి 3న పోలీసులు కేసు నమోదు చేశారు. అద్దెకు ఉండే వ్యక్తితో విభేదాలు ఉన్నాయని గుర్తించి అతడిని విచారించారు. ఇంటిని, చుట్టపక్కల ప్రాంతాలను డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో వెతకడంతోపాటు పొరుగువారినీ ఆరా తీశారు. సరైన ఆధారాలు లభించకపోవడంతో ఎవరినీ అరెస్టు చేయలేదు. అన్ని దారులు మూసుకుపోవడంతో.. తదుపరి ఆధారాలు లభించేవరకు కేసును మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

ఇలా సుమారు 15ఏళ్లు గడిచింది. కానీ, పెరాల్టాను మాత్రం అపరాధ భావన వెంటాడింది. దీంతో ఓ వ్యక్తి వద్ద ఫోన్‌ తీసుకున్న అతడు.. తన వద్ద ఓ రహస్యం ఉందని పోలీసులకు చెప్పాడు. వెంటనే పోలీసులు అతడి స్టేట్‌మెంట్‌ను వీడియో రికార్డు చేశారు. ‘ఎంతోమందికి క్షమాభిక్ష ఉంటుంది. కానీ, నాకు మాత్రం లేదు. నేనో వ్యక్తిని చంపాను. స్క్రూడ్రైవర్‌తో హత్యచేశాను. ఏ కారణం లేకుండానే ఇంటి ఓనర్‌ను చంపేశాను. ఏళ్లుగా దాన్ని కప్పిపుచ్చుకుంటూ అలసిపోయా. నా జీవితంతో విసిగిపోయా. నేను చేసిన అపరాధమే ఇక్కడికి వచ్చేలా చేసింది. దీన్ని అంగీకరించకుండా జీవించలేను’ అంటూ పోలీసుల ముందు విలపించాడు. హత్యకు ఉపయోగించిన పరికరంతోపాటు మృతదేహాన్ని ఖననం చేసిన ప్రాంతాన్ని చూపించాడు. అక్కడ షూతోపాటు కొన్ని ఎముకలను గుర్తించిన పోలీసులు.. తదుపరి విచారణ ఆగస్టులో ఉంటుందని చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని