Microsoft: యూరప్‌ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై చైనా హ్యాకర్ల పంజా!

గూఢచర్యంలో భాగంగా పశ్చిమ యూరప్‌ (Europe)లోని కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఈ-మెయిల్‌ ఖాతాలపై చైనా (China) హ్యాకర్ల బృందం సైబర్‌ దాడి (Cyber Attack) చేసిందని మైక్రోసాఫ్ట్ (Microsoft) ఆరోపించింది. 

Published : 13 Jul 2023 02:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమ యూరప్‌ (Europe)లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు లక్ష్యంగా చైనా (China) హ్యాకర్లు సైబర్ దాడి (Cyber Attack)కి పాల్పడినట్లు మైక్రోసాఫ్ట్ (Microsoft) తన బ్లాగ్‌లో ఆరోపించింది. సుమారు 25కి పైగా సంస్థల వెబ్‌సైట్లు, ఈ-మెయిల్‌ ఖాతాలపై చైనాకు చెందిన స్ట్రోమ్-0558 అనే హ్యాకర్ల ముఠా సైబర్‌ దాడి చేసినట్లు వెల్లడించింది. గత వారం కొంతమంది యూజర్లు తమ ఈ-మెయిల్‌ ఖాతాలు అసాధారణ రీతిలో పనిచేస్తున్నాయని ఫిర్యాదు చేయడంతో మైక్రోసాఫ్ట్ విచారణ జరపగా.. హ్యాకింగ్ జరిగినట్లు నిర్ధారణ అయింది. 

‘‘ముఖ్యమైన సమాచార సేకరణ, గూఢచర్యంలో భాగంగా పశ్చిమ యూరప్‌లోని కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఈ-మెయిల్‌ ఖాతాలను చైనాకు చెందిన హ్యాకర్ల బృందం యాక్సెస్ చేసినట్లు గుర్తించాం’’ అని మైక్రోసాఫ్ట్ భద్రతా విభాగం ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్ చార్లీ బెల్‌ తెలిపారు. మరోవైపు అమెరికా అధికారులు సైతం సైబర్‌ దాడిని ధ్రువీకరించినట్లు వాషింగ్టన్‌ పోస్ట్ కథనంలో పేర్కొంది. అమెరికా ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం ఉన్న కొన్ని యూరోపియన్‌ ఈ-మెయిల్‌ ఖాతాలపై చైనా సైబర్‌ ముఠా దాడి చేసిందని చెప్పినట్లు తెలిపింది. 

‘‘సైబర్‌ దాడి జరిగిన ఈ-మెయిల్‌ ఖాతాల భద్రతను మెరుగుపరిచాం. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీతోపాటు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ ఏజెన్సీతో కలిసి పనిచేస్తున్నాం’’ అని మైక్రోసాఫ్ట్ తెలిపింది. మరోవైపు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవాన్ సైతం ఈ దాడిని ధ్రువీకరించారు. అయితే, దీనిపై విచారణ జరుగుతోందని, మరింత సమాచారం కోసం మైక్రోసాఫ్ట్‌ను సంప్రదించినట్లు తెలిపారు.

అమెరికానే పెద్ద హ్యాకర్‌: చైనా

మైక్రోసాఫ్ట్ ఆరోపణలను చైనా ఖండించింది. అమెరికా సైబర్‌ కార్యకలాపాలు బయటపడకుండా ఉండేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని విమర్శించింది. ‘‘అది పూర్తిగా తప్పుడు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద హ్యాకర్‌ అమెరికానే. గత ఏడాది కాలంగా చైనా సహా మరెన్నో దేశాలు అమెరికా ప్రభుత్వం సైబర్‌ గూఢచర్యం గురించి ఎన్నో నివేదికలను బయపెట్టాయి. వాటిపై ఇప్పటివరకు అమెరికా స్పందించలేదు’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ అన్నారు. 

చైనా హ్యాకర్లు ఇలాంటి చర్యలకు పాల్పడం ఇదేం తొలిసారి కాదు. గత నెలలో కూడా  చైనా హ్యాకర్లు ఆ దేశ ప్రభుత్వ అండతో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని వందల కొద్దీ సంస్థలపై సైబర్‌ దాడికి పాల్పడినట్లు గూగుల్‌కు చెందిన సైబర్‌ భద్రత సంస్థ మాండియంట్‌ తెలిపింది. అంతకముందు అమెరికా మిలిటరీ స్థావరాలకు చెందిన వెబ్‌సైట్‌ సహా పలు కీలక సైట్‌లను చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ ఆరోపించింది. అప్పట్లో దీనిపై అమెరికా జాతీయ భద్రతా ఏజెన్సీ, ఎఫ్‌బీఐ, సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కెనడా, బ్రిటన్‌లోని సంబంధిత సంస్థలు సైతం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని