Volvo Cars: 1000 కార్లకు ఆర్డర్‌.. 49 ఏళ్లుగా బకాయి పెండింగ్‌!

49 ఏళ్ల క్రితం ఆర్డర్‌ చేసిన వెయ్యి వోల్వో కార్లకు సంబంధించిన బకాయిలను ఉత్తరకొరియా పెండింగ్‌లో ఉంచింది. దాదాపు 330 మిలియన్‌ డాలర్ల బకాయిని చెల్లించలేదు. 

Published : 10 Nov 2023 02:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర కొరియాతో (North Korea) ప్రపంచ దేశాల సంబంధాలు తరచూ వివాదాస్పదమవుతుంటాయి. ఆ దేశంతో సంబంధాలు నెలకొల్పాలంటే ఏ దేశమైనా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంది. ఎందుకో చెప్పాలంటే ఈ ఒక్క ఉదాహరణ చాలు. 49 ఏళ్ల క్రితం స్వీడన్‌ (Sweden) నుంచి ఆర్డర్‌ చేసిన 1000 కార్లకు ఉత్తర కొరియా ఇప్పటి వరకు అణాపైసా కూడా చెల్లించలేదట. ఈ మేరకు అంతర్జాతీయ వార్తాపత్రిక ‘న్యూస్‌వీక్‌’ కథనం వెలువరించింది. ఉత్తర కొరియా 1974లో వెయ్యి వోల్వో 144 మోడల్‌ కార్లతోపాటు ఇతర యంత్ర పరికరాలను స్వీడన్‌ నుంచి ఆర్డర్‌ చేసింది. దీని విలువ 73 మిలియన్‌ డాలర్లు. ఐదు దశాబ్దాలు గడుస్తున్నా ఉత్తరకొరియా ఒక్క పైసా కూడా చెల్లించలేదు. అప్పటి నుంచి వడ్డీతో కలిపితే ఆ మొత్తం 330 మిలియన్‌ డాలర్లకి చేరుకుంది.

దేశంలో సాంకేతికతను విస్తరించేందుకు గానూ ఉత్తర కొరియా పాశ్చాత్య దేశాల నుంచి వివిధ పారిశ్రామిక ముడి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. దీనికి సంబంధించిన బిల్లులను అభివృద్ధి చేసిన ఉత్పత్తుల ద్వారాగానీ, లేదంటే మైనింగ్‌ ద్వారా ఆర్జించిన డబ్బుతోగానీ చెల్లించేందుకు ఆయా దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఈ క్రమంలోనే ఉత్తర కొరియాకు స్వీడన్‌ కార్లను ఎగుమతి చేసింది. అయితే, ఆ బకాయిలు చెల్లించే ఉద్దేశం ఉత్తరకొరియాకు లేదని స్వీడన్‌కు కొన్నాళ్లకే అర్థమైంది. తాజాగా అంతర్జాతీయ పత్రిక వెలురించిన కథనంలో ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. ఉత్తరకొరియాతో చేసుకున్న ఈ ఒప్పందంపై 2016లోనే స్వీడన్‌ ఎంబసీ ట్విటర్‌లో పోస్టు చేసింది. 1974లో తీసుకున్న కార్లకు ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదని రాసుకొచ్చింది. అప్పుడు దిగుమతి చేసుకున్న ఈ కార్లను నార్త్‌ కొరియా ఇప్పటికీ వినియోగిస్తున్నట్లు న్యూస్‌వీక్‌ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని