Bangladesh: మా సమస్య భారత్‌ పరిష్కరించగలదు: బంగ్లాదేశ్‌ ప్రధాని

లక్షల మంది రోహింగ్యా శరణార్థులు తమ దేశానికి సమస్యాత్మకంగా మారారని బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా పేర్కొన్నారు.

Published : 05 Sep 2022 01:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లక్షల మంది రోహింగ్యా శరణార్థులు తమ దేశానికి సమస్యాత్మకంగా మారారని బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా అన్నారు. ఆమె శనివారం ఓ ఆంగ్ల వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సమస్యను భారత్‌ పరిష్కరించగలదన్నారు. శరణార్థులు లక్షల్లో ఉండటంతో దేశంలో అంతర్గతంగా సవాళ్లు తలెత్తుతున్నాయన్నారు. కొవిడ్‌, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో భారత్‌ చాలా సాయం చేసిందన్నారు.

‘‘అది భారమని మాకు తెలుసు. భారత్‌ పెద్ద దేశం. కొంత మంది శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొచ్చు. కానీ, పెద్దగా ఏమీ చేయలేదు. మా దేశంలో 1.1మిలియన్ల మంది రోహింగ్యాలు ఉన్నారు. అందుకే వారు తిరిగి సొంత ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం, పొరుగు దేశాలతో  చర్చలు జరుపుతున్నాం. మానవీయ కోణంలోనే మేము వారికి ఆశ్రయం ఇచ్చాం. కొవిడ్‌ సమయంలో మొత్తం రోహింగ్యాలకు టీకాలు వేయించాం. కానీ, వారు ఏన్నాళ్లుంటారు. అందుకే వారిని క్యాంపులో ఉంచాం. అక్కడ పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరు మాదకద్రవ్యాల, మహిళల అక్రమ రవాణలకు పాల్పడుతున్నారు. వారు ఎంత త్వరగా స్వస్థలాలకు వెళితే మాకు, మయన్మార్‌కు అంత మంచిది. ఈ క్రమంలో వారిని స్వస్థలాలకు పంపే విషయమై ఏషియాన్‌, యూఎన్‌వో, ఇతర దేశాలతో చర్చిస్తున్నాం. కానీ, భారత్‌ పొరుగు దేశం. వారు దీనిలో కీలక పాత్ర పోషించగలరు. నేను అదే అనుకొంటున్నాను’’ అని షేక్‌ హసీనా పేర్కొన్నారు.  

తీస్తా నది జలాల పంపకాల విషయంలో భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య సమన్వయంపై కూడా హసీనా మాట్లాడారు. తీస్తా నది విషయంలో ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. భారత ప్రధాని కూడా ఇందుకు చాలా సానుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో తమ విద్యార్థులు పలువురిని భారత్‌ స్వస్థలాలకు చేర్చిందన్నారు. కొవిడ్‌ సమయంలో వ్యాక్సిన్‌ మైత్రి రూపంలో సహాయపడిందని గుర్తు చేసుకొన్నారు. హసీనా సోమవారం నుంచి నాలుగు రోజులపాటు భారత్‌లో అధికారిక పర్యటన జరపనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని