Pak PM: మనీలాండరింగ్‌ కేసు.. పాకిస్థాన్‌ ప్రధానికి ఊరట..!

మనీలాండరింగ్‌ కేసులో పాకిస్థాన్‌ ప్రధానితో పాటు ఆయన కుమారుడిని నిర్దోషిగా తేలుస్తూ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ)కి చెందిన ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

Published : 12 Oct 2022 22:00 IST

లాహోర్‌: పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి (Pakistan PM) షెహబాజ్‌ షరీఫ్‌కు భారీ ఊరట లభించింది. మనీలాండరింగ్‌ కేసులో ప్రధానితో పాటు ఆయన కుమారుడిని నిర్దోషిగా తేలుస్తూ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ)కి చెందిన ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధానమంత్రి షెహబాజ్‌ (Shehbaz Sharif), ఆయన కుమారుడు, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి హమ్జా షెహబాజ్‌లకు వ్యతిరేకంగా (Money laundering) ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొంటూ న్యాయమూర్తి ఇజాజ్‌ హసన్‌ తీర్పు వెల్లడించారు. అయితే, ఈ కేసులో ప్రధానమంత్రి చిన్న కుమారుడు సులేమాన్‌ను మాత్రం కోర్టు ఇప్పటికే నేరస్థుడిగా ప్రకటించింది. 2019 నుంచి పరారీలో ఉన్న అతడు యూకేలో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం.

రూ.1600 కోట్ల (పాకిస్థాన్‌ కరెన్సీ)కు సంబంధించి షెహబాజ్‌తోపాటు ఆయన కుమారులపై అవినీతి నిరోధక చట్టం, యాంటీ మనీలాండరింగ్‌ చట్టంలోని పలు సెక్షన్ల కింద 2020 నవంబర్‌లో కేసులు నమోదయ్యాయి. వీటిలో ఇప్పటికే షెహబాజ్‌ చిన్న కుమారుడు నేరస్థుడిగా నిర్ధారణ కాగా.. ప్రధానిపై విచారణ కొనసాగింది. ఇందులో భాగంగా తుది వాదనలు అక్టోబర్‌ రెండో వారంలో మొదలయ్యాయి. ప్రధాని తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది అమ్జద్‌ పర్వేజ్‌.. ఎఫ్‌ఐఏ చేసిన ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఎఫ్‌ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి.. ప్రధానితోపాటు ఆయన కుమారుడికి ఇందులో పాత్ర ఉన్నట్లు ఆధారాలు లేవని తెలుపుతూ వారిని నిర్దోషిగా ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని