Ukraine Crisis: సైన్యంలో చేరడానికి క్యూ కడుతున్న ఉక్రెయిన్‌ యువత

ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తున్న సైనిక చర్య ఆదివారం 11వ రోజుకి చేరుకుంది. క్షిపణులు, రాకెట్లు, బాంబుల దాడితో ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది....

Published : 06 Mar 2022 11:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తోన్న సైనిక చర్య ఆదివారం 11వ రోజుకి చేరుకుంది. క్షిపణులు, రాకెట్లు, బాంబుల దాడితో ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. వరుస పేలుళ్లతో సామాన్యులు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. మరోవైపు ఉక్రెయిన్‌ గగనతలాన్ని ‘నో ఫ్లై జోన్‌’గా ప్రకటించాలన్న డిమాండ్లపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలా చేస్తే ఉక్రెయిన్‌ ఉనికే ప్రమాదంలో పడుతుందంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

సైన్యంలో చేరడానికి వరుస..

రష్యా దాడుల్ని తిప్పికొట్టేందుకు అనేక మంది ఉక్రెయిన్‌ యువకులు ముందుకు వస్తున్నారు. స్వచ్ఛందంగా సైన్యంలో చేరడానికి వరుస కడుతున్నారు. 16-60 ఏళ్ల మధ్య వయస్సువారు దేశాన్ని విడిచి వెళ్లకుండా ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. సైనిక శిక్షణకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఐరోపా సమాఖ్యలో ఇతర దేశాల నుంచి కూడా మాజీ సైనికులు ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్నారు.

మరింత ఆజ్యం పోయొద్దు: చైనా

చైనా, అమెరికా విదేశాంగ మంత్రులు శనివారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతలపై చర్చించారు. ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసే ఏ చర్యనూ తాము సమర్థించబోమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ తన సహచర అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో చెప్పారు. దీనికి ప్రతిస్పందనగా.. ఏ దేశాలు స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం అనే సిద్ధాంతాలవైపు నిలబడుతున్నాయో యావత్తు ప్రపంచం గమనిస్తోందని వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు సమస్యని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇటు బ్లింకెన్‌తో పాటు వాంగ్‌ ఆకాంక్షించారు. ఉక్రెయిన్‌పై దాడికి వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షల కొరడా ఝుళిపిస్తుంటే.. చైనా మాత్రం ఇప్పటి వరకు తమ వైఖరిని ప్రకటించలేదు.

జెలెన్‌స్కీతో మాట్లాడిన బైడెన్‌..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీతో మాట్లాడారు. రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షల అమలుపై ఇరువురు చర్చించారు. అలాగే ఉక్రెయిన్‌కు కావాల్సిన ఆర్థిక, సైనిక సాయంపైనా మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య చర్చల పురోగతినీ బైడెన్ అడిగి తెలుసుకున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు ఇరువురు తాజా పరిణామాలపై చర్చించినట్లు శ్వేతసౌధం ప్రకటించింది.

ఎలాన్‌ మస్క్‌కు జెలెన్‌స్కీ థ్యాంక్స్‌..

ఇంటర్నెట్‌ అంతరాయంతో సమస్య ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు స్టార్‌లింక్‌ సేవల్ని అందుబాటులోకి తెచ్చిన ఎలాన్‌ మస్క్‌కు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా దాడుల్లో ధ్వంసమైన నగరాల్లో వచ్చేవారం మరిన్ని టెర్మినళ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఇప్పటికీ ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌, ఫోన్‌లైన్ సేవలు అందుబాటులో లేవు.

చెర్నిహీవ్‌లో నివాస స్థలాలపై బాంబులు..

ఉక్రెయిన్‌లో మరో కీలక నగరం చెర్నిహీవ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు అక్కడి స్థానిక అధికారులు ట్విటర్‌ ద్వారా తెలిపారు. సైనిక స్థావరాలపై వాడే ఎఫ్‌ఏబీ 500 వంటి శక్తిమంతమైన బాంబులను నివాస స్థలాలపై వేస్తున్నారని ఆరోపించారు. రష్యా సేనలు విసిరనట్లుగా చెబుతున్న ఓ 500 కిలోల ఎఫ్‌ఏబీ 500 బాంబును ట్విటర్‌లో ఉంచారు. చెర్నిహీవ్‌ జనాభా 2,90,000. ఇప్పటి వరకు రష్యన్‌ సేనల దాడుల్లో 17 మంది మరణించినట్లు స్థానిక అధికార యంత్రాంగం ప్రకటించింది.

రష్యాలో మాస్టర్‌కార్డ్‌, వీసా సేవల నిలిపివేత..

ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణకు వ్యతిరేకంగా ఇప్పటికే అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను రష్యాలో నిలిపివేశాయి. తాజాగా ఈ జాబితాలో మాస్టర్‌కార్డ్‌, వీసా కూడా చేరాయి. రష్యన్‌ బ్యాంకులు జారీ చేసిన కార్డులు తమ వ్యవస్థల్లో ఇకపై పనిచేయబోవని మాస్టర్‌ కార్డ్‌ ప్రకటించింది. ఇతర దేశాల్లో జారీ చేసిన తమ కార్డులు రష్యన్‌ స్టోర్లు, ఏటీఎంలలో పనిచేయవని తెలిపింది. వీసా సైతం తమ కార్డుల సేవల్ని నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇవి పరిమిత చర్యలు మాత్రమేనని పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో మరింత కఠిన ఆంక్షలు ఉంటాయని ఇరు సంస్థలు హెచ్చరించాయి.

మేరియుపొల్‌పై పెరిగిన దాడుల తీవ్రత..

ఉక్రెయిన్‌కు సముద్రంతో సంబంధాలు తెగిపోయేలా మేరియుపొల్‌ను దిగ్బంధం చేయడానికి రష్యా మరిన్ని ఆయుధాలను ప్రయోగిస్తోంది. ఈ విషయాన్ని ఆ నగర మేయర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. నివాస స్థలాలపైనా బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. 4,30,000 జనాభా ఉన్న ఈ కీలక నగరంపై కాల్పులను విరమిస్తామని ప్రకటించిన రష్యా కొన్ని గంటల్లోనే దాన్ని ఉల్లంఘించిందన్నారు. ఈ నగరంపై రష్యన్‌ సేనలు దాదాపు ఆరు రోజులుగా దాడి చేస్తుండడం గమనార్హం.

రష్యా 10,000 మంది సైనికుల్ని కోల్పోయింది: ఉక్రెయిన్‌

ఈ సైనిక పోరులో ఇప్పటి వరకు 10,000 మంది రష్యన్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా చెప్పారు. అలాగే కొన్ని డజన్ల యుద్ధవిమానాలు, వందలాది ఆయుధ వాహనాలు సైతం రష్యా కోల్పోయిందన్నారు. ఉక్రెయిన్‌కు భారీ నష్టం జరుగుతున్నప్పటికీ.. పోరాటంలో మాత్రం వెనకడుగు వేయట్లేదని కులేబా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని