Pfizer: ఐదేళ్లలోపు చిన్నారులకు కొవిడ్‌ టీకా.. వినియోగానికి ఫైజర్‌ దరఖాస్తు

చిన్నారులకు కొవిడ్​ టీకా అందించే అంశంలో కీలక ముందడుగు పడింది. ఆరు నెలల పసికందు నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు కొవిడ్​ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ......

Published : 02 Feb 2022 17:09 IST

వాషింగ్టన్‌: చిన్నారులకు కొవిడ్​ టీకా అందించే అంశంలో కీలక ముందడుగు పడింది. అమెరికాలో ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా టీకా వేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఆరు నెలల పసికందు నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు కొవిడ్​ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్​డీఏ)కు ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంస్థలు దరఖాస్తు చేశాయి.

తమ టీకాకు ఇచ్చిన అత్యవసర వినియోగ అనుమతిని సవరించి 6నెలల పసికందు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులను కూడా చేర్చాలని ఎఫ్​డీఏను కోరినట్లు ఫైజర్‌ తెలిపింది. ఎఫ్​డీఏ అనుమతి లభిస్తే చిన్నారులకు అందుబాటులోకి వచ్చిన తొలి టీకాగా ఫైజర్‌ నిలవనుంది. కరోనా కారణంగా అమెరికాలో ఆస్పత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరిగిందని ఫైజర్‌ వెల్లడించింది. భవిష్యత్‌ వేరియంట్లను ఎదుర్కోవడంతో పాటు వైరస్‌ నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను కాపాడుకునేందుకు ఎఫ్​డీఏతో కలిసి పని చేస్తున్నట్లు ఫైజర్‌ పేర్కొంది.

ఆరు నెలల చిన్నారులకు ఇచ్చే టీకా.. పెద్దలకు ఇచ్చే దానిలో పదో వంతు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. ఇది దేశంలో పాఠశాలలకు వెళ్లని సుమారు 1.90 కోట్ల చిన్నారుల కోసం రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. ఎఫ్‌డీఏ అభ్యర్థన మేరకు తమ అధికారిక దరఖాస్తును సమర్పించడం ప్రారంభించినట్లు వెల్లడించింది. ఫైజర్‌ ప్రకటన అనంతరం ట్విటర్‌ వేదికగా స్పందించిన ఎఫ్‌డీఏ.. ఫిబ్రవరి 15న సమావేశం ఏర్పాటుచేసి ఈ దరఖాస్తుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని