Pakistan: తాత్కాలిక ప్రధానిగా మాజీ సీజేపీని నామినేట్‌ చేసిన ఇమ్రాన్‌..!

పాకిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల చట్టబద్ధతపై సహేతుక ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం పేర్కొంది.

Updated : 04 Apr 2022 21:34 IST

రాజకీయ సంక్షోభంపై విచారణ మొదలుపెట్టిన పాక్‌ సుప్రీంకోర్టు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అవిశ్వాస తీర్మానాన్ని ఇమ్రాన్‌ ఖాన్‌ ఎదుర్కోకుండా జాతీయ అసెంబ్లీని రద్దు చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అంటూ విపక్షాలు చేసిన వాదనపై సుప్రీం కోర్టు విచారణ మొదలుపెట్టింది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల చట్టబద్ధతపై సహేతుక ఉత్తర్వులు ఇస్తామని చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం పేర్కొంది. అనంతరం విచారణను మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మరోవైపు తాత్కాలిక ప్రధానమంత్రి నియామకం జరిగే వరకు ఇమ్రాన్‌ ఖాన్‌ ఆ బాధ్యతల్లో కొనసాగుతారన్న అధ్యక్ష భవనం.. అభ్యర్థులను నామినేట్‌ చేయాలని అధికార, ప్రతిపక్ష నాయకులకు సూచించింది. ఇందులో భాగంగా తమ అభ్యర్థులను సూచించే పనిలో ఇరువర్గాలు నిమగ్నమయ్యాయి.

అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే ముందే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఇమ్రాన్‌ ఖాన్‌.. ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దీంతో మూడు నెలల్లోపు ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పటివరకు తాత్కాలిక ప్రధానమంత్రిని ఎంపిక చేసే ప్రక్రియను అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా అభ్యర్థులను సిఫార్సు చేయాలని అధికార, ప్రతిపక్ష నాయకులకు లేఖ రాశారు. దీంతో మాజీ చీఫ్‌ జస్టిస్‌ గుల్జార్‌ అహ్మద్‌ను ఆపద్ధర్మ ప్రధానిగా నియమించాలని ఇమ్రాన్‌ ఖాన్‌ అధ్యక్షుడికి సిఫార్సు చేశారు. ప్రతిపక్ష నాయకుడి నుంచి స్పందన రావాల్సి ఉంది.

పాకిస్థాన్‌ రాజ్యాంగం ప్రకారం, సంక్షోభ సమయంలో తాత్కాలిక ప్రధానమంత్రిని నియమించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ఇందుకోసం ప్రధానమంత్రితోపాటు నేషనల్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతను సంప్రదించాలి. ఈ క్రమంలోనే ఇరువురు నాయకులకు లేఖలు రాసినట్లు పాకిస్థాన్‌ అధ్యక్ష భవనం వెల్లడించింది. ఇప్పటికే ఇమ్రాన్‌ ఖాన్‌ తమ తరపున పేరును ప్రతిపాదించగా.. మూడు రోజుల్లో ప్రతిపక్ష నేత తన మద్దతుదారుల పేర్లు తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు సిఫార్సు చేయకుంటే.. ఉన్నవారిలోనే ఒకరిని ఆపద్ధర్మ ప్రధానిగా అధ్యక్షుడు ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే, ప్రధాని ఇమ్రాన్‌, అధ్యక్షుడు ఆరిఫ్‌ చర్యలను ప్రతిపక్షనేత మహ్మద్‌ షెహబాజ్‌ తప్పుబడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని