Schengen Visa : మరింత వేగంగా జర్మనీ షెంజెన్‌ వీసా ప్రక్రియ.. వెల్లడించిన రాయబార కార్యాలయం

జర్మనీ (Germany) షెంజెన్‌ వీసా (Schengen Visa) జారీ ప్రక్రియ సమయం తగ్గించినట్లు ఆ దేశ రాయబార కార్యాలయం తెలిపింది. భారత్‌ నుంచి (Indians) యూరప్‌ (Europe) ప్రయాణాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.

Published : 09 Aug 2023 19:35 IST

దిల్లీ : భారతీయుల (Indians) కోసం జర్మనీ (Germany) జారీ చేస్తున్న షెంజెన్‌ వీసా (Schengen Visa) ప్రక్రియ సమయం ఎనిమిది వారాలకు తగ్గించినట్లు జర్మనీ రాయబార కార్యాలయం డిప్యూటీ హెడ్ ఆఫ్‌ మిషన్‌ జార్జ్‌ ఎన్జ్‌వైలర్‌ తెలిపారు. ఆ గడువును మరింత కుదించే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ‘వీసా ఒక ముఖ్యమైన అంశం. మేము దరఖాస్తులకు పట్టే సమయాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకు వివిధ మార్గాల ద్వారా కృషి చేస్తున్నాం. ముంబయిలో మా సిబ్బంది సంఖ్యను పెంచాం. దాంతో వీసా కోసం వేచి చూసే సమయం గణనీయంగా తగ్గనుందని’ జార్జ్‌ చెప్పారు.

భద్రతా ప్రమాణాలపై అధికారుల సంతృప్తి.. మళ్లీ పట్టాలెక్కిన హ్యారీ పోటర్‌ రైలు!

విదేశాల్లో భారతీయ పర్యాటకులు స్వల్పకాలం బస చేయడానికి షెంజెన్‌ వీసా ఇస్తారు. గరిష్ఠంగా 90 రోజుల వరకు అక్కడ ఉండవచ్చు. ఈ వీసా లభించినట్లయితే ఐరోపాలోని షెంజెన్‌ ప్రాంతానికి చెందిన 27 దేశాల్లో ఏ దేశానికైనా వెళ్లొచ్చు. పర్యాటకం, వ్యాపారం నిమిత్తం వెళ్లేవారికి ఈ తరహా వీసాలు జారీ చేస్తారు. ఈ ప్రక్రియ జారీ ఆలస్యం కారణంగా ఇటీవలి కాలంలో భారత్‌ నుంచి యూరప్‌ ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. జర్మన్‌ నేషనల్ టూరిస్టు బోర్డు గణాంకాల ప్రకారం.. 2022లో భారతీయ పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 209 శాతం అధికం. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య ఇంకా 65 శాతం వద్దే ఉంది. 

షెంజెన్‌ వీసాలకు అధిక డిమాండ్‌ ఏర్పడటంతో అపాయింట్‌మెంట్, ప్రాసెసింగ్‌ కోసం ఎక్కువ సమయం పడుతున్నట్లు గత ఏప్రిల్‌లో జర్మన్‌ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సమీప భవిష్యత్తులో జర్మనీ వెళ్లాలనుకునేవారు తమ ఎక్స్‌టర్నల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ వీఎఫ్‌ఎస్‌తో ముందుగానే రిజిస్టర్‌ చేసుకోవాలని అందులో పేర్కొంది. కాన్సులేట్‌ వద్దకు దరఖాస్తు వచ్చిన తరువాతనే వీసా జారీ ప్రక్రియ మొదలవుతుందని వెల్లడించింది. డెలివరీ సమయం, సెలవులను పరిగణనలోకి తీసుకొంటే అది కొన్నిసార్లు ఆరు రోజులు కూడా పట్టొచ్చని రాయబార కార్యాలయం వివరణ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని