Modi-Putin: మోదీ - పుతిన్‌ భేటీ ఖాయమే.. అధికారిక ప్రకటన చేసిన క్రెమ్లిన్‌

ఉజ్బెకిస్థాన్‌ వేదికగా గురువారం(సెప్టెంబరు 15) నుంచి జరగబోయే షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో SCO Summit) సదస్సులో

Updated : 14 Sep 2022 12:25 IST

మాస్కో: ఉజ్బెకిస్థాన్‌ వేదికగా గురువారం (సెప్టెంబరు 15) నుంచి జరగబోయే షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో SCO Summit) సదస్సులో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Modi), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

‘‘22వ ఎస్‌సీవో సదస్సుకు పుతిన్‌, మోదీ హాజరుకానున్నారు. సదస్సులో భాగంగా ఈ దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వ్యూహాత్మక స్థిరత్వం, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులు, ఐక్యరాజ్యసమితి, జీ20లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం వంటి అంశాలు వీరి అజెండాలో ఉండే అవకాశం ఉంది. డిసెంబరులో ఐరాస భద్రతా మండలికి, 2023లో జీ20, ఎస్‌సీవోకు భారత్‌ అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో ఈ ద్వైపాక్షిక భేటీకి ప్రాముఖ్యత ఏర్పడనుంది’’ అని క్రెమ్లిన్‌ అధికారిక ప్రకటనలో తెలిపింది. అయితే మోదీ, పుతిన్‌ భేటీపై భారత విదేశాంగశాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం నేపథ్యంలో మోదీ - పుతిన్‌ భేటీకి ప్రాధాన్యం సంతరించుకొంది. ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 24న పుతిన్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని రష్యా అధ్యక్షుడిని కోరారు. ఆ తర్వాత ఈ ఏడాది జులైలో మరోసారి పుతిన్‌తో మోదీ ఫోన్‌లో సంభాషించారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు అంతర్జాతీయ వ్యవహారాలపైనా ఇద్దరు నేతలూ తమ ఆలోచనలు పంచుకొన్నారు. గతేడాది డిసెంబర్‌లో పుతిన్‌ భారత్‌లో పర్యటించిన సందర్భంగా తీసుకొన్న నిర్ణయాల అమలుపై సమీక్షించారు.

సెప్టెంబరు 15, 16 తేదీల్లో ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో ఎస్‌సీవో సదస్సు జరగనుంది. ఈ సదస్సులో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ వంటి కీలక నేతలు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ సందర్భంగా మోదీ.. రష్యా, చైనా, పాక్‌ అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశమున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటనలు మాత్రం రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని