Gupta brothers: గుప్తా బ్రదర్స్‌కు షాక్‌.. దుబాయిలో అరెస్టు

గుప్తా బద్రర్స్‌గా ప్రాచుర్యం పొంది, దక్షిణాఫ్రికాలో భారీస్థాయి అవినీతికి పాల్పడిన భారతదేశానికి చెందిన ముగ్గురు సంపన్న సోదరుల్లో ఇద్దరు యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో అరెస్టయ్యారు. అక్రమాలు బయటపడగానే

Updated : 07 Jun 2022 15:21 IST

జొహన్నెస్‌బర్గ్‌: గుప్తా బద్రర్స్‌గా ప్రాచుర్యం పొంది, దక్షిణాఫ్రికాలో భారీస్థాయి అవినీతికి పాల్పడిన భారతదేశానికి చెందిన ముగ్గురు సంపన్న సోదరుల్లో ఇద్దరు యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో అరెస్టయ్యారు. అక్రమాలు బయటపడగానే దుబాయి పారిపోయిన ఈ ముగ్గురు సోదరుల్లో రాజేశ్‌ గుప్తా, అతుల్‌ గుప్తాను సోమవారం అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం వెల్లడించింది. అయితే, మూడో సోదరుడు అజయ్‌ గుప్తాను అరెస్టు చేశారా లేదా అనే విషయంపై స్పష్టత లేదని తెలిపింది.

అవినీతి వ్యవహారంలో గుప్తా సోదరులపై ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేసిన దాదాపు ఏడాది తర్వాత వీరు అరెస్టవ్వడం గమనార్హం. దక్షిణాఫ్రికా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల నుంచి బిలియన్ల కొద్దీ ర్యాండ్లను (దక్షిణాఫ్రికా కరెన్సీ) దోచుకున్నారని గుప్తా సోదరులపై ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలపై విచారణలు సాగుతుండగానే ఈ సోదరులు దక్షిణాఫ్రికా నుంచి తమ కుటుంబాలతో సహా దుబాయికి ఉడాయించారు. దీంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించగా.. వీరిపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి.

ఇదిలా ఉండగా.. దుబాయి నుంచి గుప్తా సోదరులను రప్పించి శిక్ష వేసేందుకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేసింది. రెండు దేశాల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం లేకపోవడంతో గుప్తా సోదరులను వెనక్కి తీసుకొచ్చేందుకు దక్షిణాఫ్రికా.. ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించింది. అయితే ఆ తర్వాత 2021లో యూఏఈతో నేరస్థుల అప్పగింతపై ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే యూఏఈ ప్రభుత్వం రాజేశ్, అతుల్‌ గుప్తాలను దక్షిణాఫ్రికాకు అప్పగించే అవకాశాలున్నాయి. 

ఎవరీ గుప్తా సోదరులు..

ముగ్గురు సోదరులైన అజయ్, అతుల్, రాజేశ్‌ గుప్తాల స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని షహరాన్‌పుర్‌. 1990ల్లోనే వీరు దక్షిణాఫ్రికా వెళ్లి షూ వ్యాపారం మొదలుపెట్టారు. ఆ తర్వాత అక్కడే స్థిరపడ్డారు. ఐటీ, మీడియా, మైనింగ్‌ కంపెనీలు ఇలా అనేక రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించి అనతికాలంలోనే దక్షిణాఫ్రికాలో అత్యంత సంపన్నులుగా పేరొందారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమాతో వీరికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ అనుబంధాన్ని వాడుకున్న గుప్తా సోదరులు.. నేషనల్‌ ఎలక్ట్రిసిటీ సప్లయర్‌ ‘ఎస్కాం’ వంటి పలు ప్రభుత్వరంగ సంస్థలను కొల్లగొట్టినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక, జుమా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కేబినెట్‌ మంత్రుల దగ్గర్నుంచి అనేక ప్రభుత్వ నియామకాలను వీరు ప్రభావితం చేశారని ఆరోపణలు వచ్చాయి.

గుప్తా సోదరుల అవినీతి నేపథ్యంలో జుమాపై ఒత్తిడి పెరిగింది. దీంతో 2018లో జుమా అధ్యక్ష పదవి నుంచి బలవంతంగా దిగిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో గుప్తా సోదరులు కూడా దేశం విడిచి దుబాయి పారిపోయారు. ప్రభుత్వ సంస్థల నుంచి గుప్తా సోదరులు దాదాపు 15 బిలియన్‌ రాండ్లను కొల్లగొట్టినట్లు దర్యాప్తు సంస్థల సమాచారం. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.7,513కోట్లకు పైమాటే..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని