South Korea: భూగర్భంలో చిక్కుకుని.. కాఫీ పొడితో ప్రాణాలు దక్కించుకుని!

దక్షిణ కొరియాలో ఓ గని కూలిపోయిన ఘటనలో భూగర్భంలో చిక్కుకుపోయిన ఇద్దరు కార్మికులు.. తొమ్మిది రోజుల తర్వాత సురక్షితంగా బయటపడ్డారు. అన్ని రోజులు వారు కేవలం కాఫీ పొడి తింటూ, తాము చిక్కుకుపోయిన షాఫ్ట్‌ లోపల కారిన నీళ్లను తాగుతూ ప్రాణాలను నిలబెట్టుకోవడం గమనార్హం.

Published : 07 Nov 2022 01:54 IST

సియోల్‌: ఓ గని కూలిపోయిన ప్రమాదంలో భూగర్భంలో చిక్కుకుపోయిన ఇద్దరు కార్మికులు.. తొమ్మిది రోజుల తర్వాత సురక్షితంగా బయటపడ్డారు. దక్షిణ కొరియా(South Korea)లోని బోంగ్వా పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అన్ని రోజులు వారు కేవలం కాఫీ పొడి(Coffee Powder) తింటూ, తాము చిక్కుకుపోయిన షాఫ్ట్‌(పొడవైన నిర్మాణం) లోపల కారిన నీళ్లను తాగుతూ ప్రాణాలను నిలబెట్టుకోవడం గమనార్హం. దేశ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను ఓ అద్భుతంగా అభివర్ణించారు.

అక్టోబరు 26న ఇక్కడి ఓ జింక్‌ గని కూలిపోవడంతో.. 62, 56 ఏళ్ల వయసు కలిగిన ఇద్దరు కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. భూగర్భంలో నిలువుగా ఉన్న షాఫ్ట్‌లో దాదాపు 190 మీటర్ల లోతులో వారి ఆచూకీ లభ్యమైంది. ఈ క్రమంలో సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. తొమ్మిది రోజుల అనంతరం శుక్రవారం రాత్రి ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసింది. వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. మరికొద్ది రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేస్తామని చెప్పారు.

ఇద్దరు కార్మికులు తమ వెంట తీసుకెళ్లిన ఇన్‌స్టాంట్ కాఫీ పొడి తింటూ, షాఫ్ట్‌ పైభాగంనుంచి పడిన నీటిని తాగుతూ నిలదొక్కుకున్నారని స్థానిక అధికారులు తెలిపారు. ఇద్దరు సురక్షితంగా బయటపడటంపై  దేశ అధ్యక్షుడు యోల్‌ భావోద్వేగులయ్యారు. ‘ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు ధన్యవాదాలు. శోకంలో మునిగి ఉన్న దేశానికి.. ఈ ఆపరేషన్‌ కొత్త ఆశను ఇచ్చింది’ అంటూ వారికి లేఖలు పంపించారు. ఇటీవల హాలోవీన్‌ సందర్భంగా సియోల్‌లో జరిగిన తొక్కిసలాటలో 156 మంది మృతి ఘటనను ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని