Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడికి కొత్త ప్రధాని ఝులక్‌.. రాజీనామా డిమాండ్‌కు మద్దతు!

శ్రీలంక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రణిల్​ విక్రమ్​ సింఘే అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు దిమ్మతిరిగే ఝలక్​ ఇచ్చారు. ఆందోళనకారులకు మద్దతు పలికారు......

Published : 16 May 2022 01:55 IST

కొలంబో: శ్రీలంక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రణిల్​ విక్రమ్​ సింఘే అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు దిమ్మతిరిగే ఝలక్​ ఇచ్చారు. గొటబాయ రాజీనామా చేయాలని నెలరోజులుగా ఆందోళనలు చేస్తున్న వారికి మద్దతు పలికారు. ‘గొట గో హోమ్’​ నిరసనకారుల డిమాండ్లను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఓ టీవీ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశంలోని రాజకీయ వ్యవస్థను మార్చేందుకు ‘గొట గో హోమ్’​ నిరసనలు కొనసాగాలి. అందుకు దేశంలోని యువత బాధ్యత తీసుకోవాలి. గ్రామాల్లో నిరసనలు చేస్తున్న యువతకు రక్షణ కల్పిస్తాం. భవిష్యత్తు విధాన రూపకల్పన కోసం వారి అభిప్రాయాలు తెలుసుకుంటాం’’ అని రణిల్​ విక్రమ్​ సింఘే పేర్కొన్నారు.

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఏప్రిల్​ 9 నుంచి కొలంబోలోని గాలే ఫేస్​ గ్రీన్​లో గొటబాయకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే మహింద రాజపక్సను ప్రధాని పదవి నుంచి తొలగించిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. యునైటెడ్​ నేషనల్​ పార్టీ నేత రణిల్​ విక్రమ్​ సింఘే(73)ను 26వ ప్రధానిగా నియమించారు. అందుకు పార్లమెంట్​లోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. దేశ భద్రతను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని