Updated : 09 May 2022 22:02 IST

Srilanka crisis: శ్రీలంకలో టెన్షన్‌.. టెన్షన్‌.. ఓ ఎంపీ మృతి.. నిరసనలు హింసాత్మకం!

కొలంబో: శ్రీలంకలో గొటబాయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కొలంబోలో ప్రధాని మహీంద రాజపక్స నివాస భవనం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై  ప్రభుత్వ మద్దతుదారులు దాడి చేయడంతో శ్రీలంక ఒక్కసారిగా భగ్గుమంది. ఇరు వర్గాల ఘర్షణలతో కొలంబో నగరం అట్టుడికింది. ఈ ఘర్షణల్లో అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి అతుకొరాల ప్రాణాలు కోల్పోయారు. నిట్టాంబువ అనే ప్రాంతంలో ఎంపీ కారును ఆందోళనకారులు అడ్డుకోగా.. ఆయన ఎస్‌యూవీ కారు నుంచి తుపాకీ కాల్పులు జరిగినట్టు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు పేర్కొన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన నిరసనకారులు ఎంపీ కారును ధ్వంసం చేయడంతో అక్కడి నుంచి సమీపంలోని భవనంలోకి వెళ్లిపోయిన ఎంపీ అక్కడ ఆశ్రయం పొందారని.. అక్కడే తన రివాల్వర్‌తో కాల్చుకున్నట్టుగా చెబుతున్నారు. ఆయన రివాల్వర్‌తో కాల్చుకొనే సమయంలో ఆ భవనం చుట్టూ వేలాది మంది జనం ఉన్నారని స్థానికులు పేర్కొన్నారు. అయితే, అక్కడ ఎంపీతో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి (పీఎస్‌వో) కూడా విగతజీవిగా పడి ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ఇద్దరు మృతిచెందగా.. దాదాపు 100 మందికి పైగా గాయాలతో ఆస్పత్రిలో చేరినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. కొలంబోలో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. దీంతో పాటు తక్షణ కర్ఫ్యూ అమలుచేస్తున్నట్టు ప్రకటించారు. 

ప్రజాప్రతినిధుల ఆస్తులు ధ్వంసం!

మరోవైపు, శ్రీలంకలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాలపై ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. మాజీ మంత్రి జాన్‌స్టన్‌ ఫెర్నాండోకు చెందిన కార్యాలయాన్ని తగలబెట్టారు. ఆయనకు చెందిన హోటళ్లకు కూడా నిప్పంటించారు. మాజీ మంత్రి నిమల్‌ లాన్‌జా ఇంటిపైనా దాడి చేశారు. మొరటువా మేయర్‌ సమన్‌ లాల్‌ ఫెర్నాండో ఇంటికి నిప్పటించారు. కొలంబోలో అధికార పార్టీ కార్మిక నేత మహింద కహండగామగె ఇంటిపైనా దాడి చేశారు. అలాగే, వలాల్‌వటియా ప్రదేశీయ సభ ఛైర్మన్‌ ఉడెని అతుకొరాల ఇంటిపైనా నిరసనకారులు దాడి చేశారు. ఎల్‌పీపీ ఎంపీ సనత్‌ నిశాంత ఇంటికి నిప్పంటించారు. ఎస్‌ఎల్‌పీపీ ఎంపీ అనుప పాస్కుల్‌ ఇంటిపై మధ్యాహ్నం దాడి చేశారు. 

శ్రీలంకలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఆహార, ఇంధన, ఔషధాల కొరత నెలకొని ప్రజలు అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని వారాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారు. మరోవైపు, ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని శ్రీలంక రక్షణశాఖ కార్యదర్శి జనరల్‌ (రిటైర్డ్‌) కమల్‌ గుణరత్న విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా సైనిక బలగాలను రంగంలోకి దించారు. ఈ ఘర్షణలు జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ప్రధాని మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పంపారు. 

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts