Imran khan: ఇమ్రాన్‌కు ఇంటిదారి చూపింది ఈ నలుగురే..!

ఇంటిదారి పట్టించడంలో నలుగురు వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. వారెవరో చూద్దాం....

Updated : 10 Apr 2022 10:34 IST

ఇస్లామాబాద్‌: తాను చెప్పినట్లుగానే పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ చివరి బంతి వరకూ ఆడారు. కానీ.. విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయారు. తుదకు ప్రతిపక్షాల పటిష్ఠ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయి వెనుదిరిగారు. రాజీనామాకు ససేమిరా అన్న ఇమ్రాన్‌ చివరకు జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. ఆయన్ని ఇంటిదారి పట్టించడంలో నలుగురు వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. వారెవరో చూద్దాం...

షెహబాజ్‌ షరీఫ్‌..

షెహబాజ్‌ (70) ప్రస్తుతం పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌-నవాజ్ పార్టీ అధినేతగా ఉన్నారు. అవినీతి కుంభకోణాల్లో దోషిగా తేలి ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు ఈయన స్వయానా సోదరుడు. తర్వాత ప్రధానిగా ఈయనే బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో పంజాబ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అభ్యుదయ కవితా పంక్తులను విసురుతూ ప్రసంగాల్ని రక్తికట్టిస్తారన్న పేరుంది. పలు వివాహాలు, లండన్‌, దుబాయ్‌లో విలాసవంతమైన భవంతుల వంటి ఆరోపణలతో పలుసార్లు పతాకశీర్షికలకెక్కారు.

అసిఫ్‌ అలీ జర్దారీ..

ఈయన సంపన్న సింధ్‌ కుటుంబం నుంచి వచ్చారు. గతంలో ప్లేబాయ్‌ జీవితం గడిపేవారన్న పేరుండేది. తర్వాత కుటుంబ పెద్దల నిర్ణయంతో బెనజీర్‌ భుట్టోను వివాహమాడారు. సరిగ్గా ఆమె తొలిసారి ప్రధాని కావడానికి కొన్ని నెలల ముందే వీరి పెళ్లి జరిగింది. ఈయన సరదా కోసం రాజకీయాలకు వచ్చారన్న విమర్శ ఉంది. అలాగే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 10 శాతం కమీషన్‌ డిమాండ్‌ చేసేవారన్న ఆరోపణలూ ఎదుర్కొన్నారు. అందుకే ఈయనను ‘‘మిస్టర్‌ టెన్‌ పర్సెంట్‌’’గా వ్యవహరించేవారు. అవినీతి ఆరోపణలతో పలుసార్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు. 2007లో భుట్టో హత్య తర్వాత పాకిస్థాన్ పీపుల్స్‌ పార్టీ (PPP) సహ-ఛైర్మన్‌గా వ్యవహరించారరు. తర్వాత పీఎంఎల్‌-ఎన్‌తో అధికారాన్ని పంచుకొని అధ్యక్ష పదవిని చేపట్టారు.

బిలావల్‌ భుట్టో జర్దారీ..

అసిఫ్‌ అలీ జర్దారీ, బెనజీర్‌ భుట్టో కొడుకే ఈ బిలావల్‌ భుట్టో జర్దారీ. తల్లి హత్య తర్వాత కేవలం 19 ఏళ్ల వయసులోనే పీపీపీ ఛైర్మన్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆక్స్‌ఫర్డ్‌లో విద్యనభ్యసించిన ఈయనకు ప్రగతిశీల నాయకుడిగా పాక్‌లో పేరుంది. మహిళలు, మైనారిటీల హక్కులపై తరచూ మాట్లాడుతుంటారు. సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటారు. దీంతో ఈయనకు యువ ఓటర్లలో మంచి ఆదరణ ఉంది. అయితే, పాక్‌ జాతీయ భాష అయిన ఉర్దూపై పట్టులేకపోవడంతో పలుసార్లు విమర్శలు ఎదుర్కొన్నారు.

మౌలానా ఫజ్లుర్‌ రెహ్మాన్‌..

కఠినమైన ఇస్లామిక్‌ నేతగా మౌలానా ఫజ్లుర్‌ రెహ్మాన్‌ పాక్‌ రాజకీయాల్లోకి ప్రవేశించారు. కానీ, తర్వాత తన వైఖరిని మార్చుకున్నారు. సౌమ్యుడిగా ముద్ర వేయించుకునేందుకు తెగ ప్రయత్నించారు. అందుకోసం పలు లౌకిక పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. తరచూ మదర్సాల్లోని విద్యార్థులను మొబిలైజ్ చేయడం ద్వారా భారీ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించారు. కానీ, అధికారం చేపట్టే శక్తిని మాత్రం ఇప్పటి వరకు కూడగట్టుకోలేకపోయారు. కానీ, చాలా ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఇమ్రాన్‌ ఖాన్‌తో తీవ్ర వైరం ఉండేది. ఆయన్ని ఓ సందర్భంలో యూదుడిగా సంబోధించారు. ఖాన్‌ ప్రతిగా రెహ్మాన్‌ను ‘ముల్లా డీజిల్‌’ అని విమర్శించేవారు. లంచాలు తీసుకొని ఇంధన ఔట్‌లెట్ల లైసెన్సులను ఇప్పించారన్న ఆరోపణ రెహ్మాన్‌పై ఉండడమే అందుకు కారణం.

వీరంతా కలిసి ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహాలను రచించారు. ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, అవినీతి వంటి అంశాలను ఆసరాగా చేసుకొని భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను నింపే ప్రయత్నం చేశారు. మరోవైపు పాకిస్థాన్‌ ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ.. ఇప్పటికీ అక్కడ సైన్యం అండదండలు లేనిదే మనగలగడం కష్టం. ఆ దేశ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ జావెద్‌ బజ్వా సైతం ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ సందర్భంలో ఆయన ఇమ్రాన్‌ ప్రభుత్వ విదేశాంగ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడం అందుకు బలం చేకూర్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని