Mental fatigue: మానసిక అలసటకు తీవ్ర ఆలోచనలే కారణమా!

రాత్రయ్యేసరికి మానసికంగా అలసిపోయినట్లు(Mental fatigue) అనిపిస్తోందా? అయితే ఆ రోజంతా మీరు ఎక్కువగా ఆలోచించి ఉండొచ్చు. తీవ్రంగా ఆలోచించడం మానసిక అలసటకు దారి తీస్తుందని ఫ్రాన్స్‌(France)...

Published : 13 Aug 2022 01:25 IST

ఫ్రాన్స్‌ పరిశోధకులు ఏమంటున్నారంటే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాత్రయ్యేసరికి మానసికంగా అలసిపోయినట్లు(Mental fatigue) అనిపిస్తోందా? అయితే ఆ రోజంతా మీరు ఎక్కువగా ఆలోచించి ఉండొచ్చు. తీవ్రంగా ఆలోచించడం మానసిక అలసటకు దారి తీస్తుందని ఫ్రాన్స్‌(France) పరిశోధకులు కనుగొన్నారు. ఫలితంగా.. ఆ సమయంలో నిర్ణయాలు తీసుకోవడం(Decision Making) కూడా కష్టంగా మారుతుందని తెలిపారు. పారిస్‌లోని పీటీ- సల్పెట్రీయర్ యూనివర్సిటీ హాస్పిటల్ పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా.. రెండు వేర్వేరు బృందాల వ్యక్తుల మెదళ్లలో రసాయన చర్యలను విశ్లేషించారు. ఓ పని దినంలో ఒక బృందానికి సులభమైన పనులు, మరో బృందానికి అవే పనులు.. కానీ, ఎక్కువ ఆలోచనాత్మకంగా నిర్వహించాలంటూ అప్పగించారు. ఈ క్రమంలో రోజు ముగిసేసరికి రెండో బృందంలోని వ్యక్తుల్లో మానసిక అలసట(Mental fatigue) లక్షణాలు వెలుగుచూశాయి.

‘మాగ్నెటిక్‌ రెసొనెన్స్‌ స్పెక్ట్రోస్కోపీ’ సాయంతో.. అధిక ఆలోచనాత్మక పనులు నిర్వహించేవారి మెదడు ముందు భాగం(ప్రీఫ్రంటల్ కార్టెక్స్)లో.. గ్లూటామెట్‌(Glutamate) అధికంగా ఉత్పన్నం అవుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. నాడీ కణాలు పరస్పరం సంకేతాలను ప్రసారం చేసేందుకు ఉపయోగించే రసాయనమే(న్యూరోట్రాన్స్‌మీటర్‌) ‘గ్లూటామెట్‌’. దీని అధిక ఉత్పత్తి మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా దాన్ని నియంత్రించే క్రమంలో.. ప్రీఫ్రంటల్‌ కార్టెక్స్‌ చేపట్టాల్సిన ఇతర కార్యకలాపాలు(నిర్ణయాలు తీసుకోవడం, ప్రణాళికలు రూపొందించడం వంటివి) కష్టతరంగా మారుతున్నాయి. అప్పటికే మానసిక అలసట ఆవరించడంతో.. సంబంధిత వ్యక్తులు తక్కువ ప్రదర్శనతో ఎక్కువ ఫలితాలు రాబట్టేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడైంది.

‘‘మనం చేస్తున్న పనిని ఆపాలని సూచించేందుకు, మరింత ఆనందాన్ని కలిగించే వాటివైపు మళ్లించేందుకు మెదడు సృష్టించే ఓ భ్రమే ‘మానసిక అలసట’ అని ఇదివరకటి సిద్ధాంతాలు సూచిస్తున్నాయి. మా అధ్యయనం మాత్రం అధిక ఆలోచనాత్మక పనులు.. మెదడులో గ్లూటామెట్‌ అధిక ఉత్పత్తి వంటి మార్పులకు దారితీస్తాయని చూపిస్తోంది. కాబట్టి.. అలసట అనేది మనం పని చేయడం ఆపేయాలని సూచించే సంకేతమే. కానీ.. అది వేరే ప్రయోజనం కోసం. అదే ‘మెదడు పనితీరును కాపాడటం’’ అని అధ్యయనకర్తల్లో ఒకరైన మాథియాస్ పెసిగ్లియోన్ వివరించారు. ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌లో రసాయన మార్పులను విశ్లేషించడం ద్వారా.. ఉద్యోగుల్లో మానసిక అలసటను గుర్తించి, తద్వారా ఆఫీస్‌లో అధిక ఒత్తిడి పని వాతావరణాన్ని నివారించేందుకు అవకాశం లభిస్తుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని