Dominic Raab : బ్రిటన్‌ ఉప ప్రధాని డొమినిక్‌ రాబ్‌ రాజీనామా

UK Deputy Prime Minister: బ్రిటన్‌ ఉప ప్రధాని డొమినిక్‌ రాబ్‌ తన పదవికి రాజీనామా చేశారు. 

Updated : 21 Apr 2023 15:25 IST

లండన్‌: బ్రిటన్‌ ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రి డొమినిక్‌ రాబ్‌(Dominic Raab) తన పదవికి రాజీనామా చేశారు. తన మంత్రిత్వశాఖలోని సిబ్బంది పట్ల బెదిరింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు పూర్తయింది. తాజాగా ఈ నివేదిక ప్రధాని రిషి సునాక్‌ చేతికి అందిన కొన్ని గంటల్లోనే రాబ్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని రిషి సునాక్‌కు రాసిన లేఖను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ దర్యాప్తును ఓ ప్రమాదకర దృష్టాంతంగా పేర్కొన్న రాబ్‌.. ప్రభుత్వానికి తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. దర్యాప్తులో ఏం తేలినా సరే.. మాటకు కట్టుబడి ఉండటమే ముఖ్యమని భావిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రవర్తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఇలా కీలక పదవులకు రాజీనామా చేసిన వారిలో డొమినిక్‌ రాబ్‌ మూడో వ్యక్తి కావడం గమనార్హం. 

రాబ్‌తో కలిసి పనిచేసే సివిల్‌ సర్వెంట్స్‌ నుంచి ఆయన ప్రవర్తనపై ఆరోపణలు వచ్చినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. దీనిపై స్పందించిన ప్రధాని రిషి సునాక్‌.. సీనియర్‌ న్యాయవాది ఆడమ్‌ టోలీతో దర్యాప్తునకు ఆదేశించారు. మంత్రిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సూచించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు పూర్తి చేసిన టోలీ.. గురువారం ఉదయమే సునాక్‌కు నివేదిక పంపించినట్టు ప్రధాని అధికార ప్రతినిధి నిర్థారించారు. మరోవైపు ఇదే అంశంపై మాట్లాడిన సునాక్‌.. రాబ్‌పై తనకు పూర్తి విశ్వాసం ఉందని..  దర్యాప్తు నివేదికలోని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అయితే, ఆ నివేదికను ఎప్పుడు బహిర్గతం చేస్తారనే అంశాన్ని మాత్రం ఆయన వెల్లడించేందుకు నిరాకరించారు. రాబ్‌పై వచ్చిన ఆరోపణలు ఈ నివేదికలో నిజమని రుజువైతే.. ఆయనపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రధానికి లేఖ రాయడం గమనార్హం. గతంలో యూకే విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన రాబ్‌ను గతేడాది అక్టోబర్‌లో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బ్రిటన్‌ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉప ప్రధానిగా రాబ్‌ను తన బృందంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని