Zelensky: ఆస్కార్‌ వేడుకల్లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ..?

రష్యా దాడులతో అల్లాడిపోతున్న తమకు అండగా ఉండాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రపంచ దేశాలను అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆయన అగ్రరాజ్యం

Published : 27 Mar 2022 02:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా దాడులతో అల్లాడిపోతున్న తమకు అండగా ఉండాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రపంచ దేశాలను అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆయన అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాల చట్టసభలను ఉద్దేశిస్తూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. తాజాగా ఆయన అంతర్జాతీయ సినీ వేడుక ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలోనూ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయమై అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ ప్రతినిధులతో జెలెన్‌స్కీ చర్చించినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆదివారం జరిగే ఆస్కార్ పురస్కార ప్రదానోత్సవంలో జెలెన్‌స్కీ ప్రసంగం చేయనున్నట్లు సమాచారం. అయితే ఆయన ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడుతారా..? లేదా ఆయన రికార్డెడ్‌ ప్రసంగాన్ని ప్రదర్శించనున్నారా..? అన్నదానిపై స్పష్టత లేదు. అయితే దీనిపై అకాడమీ అధికారికంగా ప్రకటించలేదు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ ఏంజెల్స్‌లో ఆదివారం జరగనుంది.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ సినీ రంగానికి చెందిన వ్యక్తి అన్న విషయం తెలిసిందే. పలు కామెడీ షోలు, సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన.. 2019లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా ఎన్నికై సంచలనం సృష్టించారు. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో జెలెన్‌స్కీ నటించిన ‘సర్వెంట్ ఆఫ్‌ ది పీపుల్‌’ సినిమాను ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో మళ్లీ ప్రసారం చేస్తున్నారు. 

ఈ సినిమాలో టీచర్‌ అయిన జెలెన్‌స్కీ అవినీతిపై ప్రశ్నిస్తారు. ఆ వీడియో వైరల్‌ కావడంతో ఓ సెన్సేషన్‌గా మారి ఏకంగా దేశాధ్యక్షుడిగా ఎన్నికవుతాడు. 2015లో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అయితే, సినిమాలో అధ్యక్షుడైన జెలెన్‌స్కీ ఆ తర్వాత అనూహ్యంగా నిజ జీవితంలోనూ రాజకీయాల్లోకి వచ్చి దేశాధ్యక్షుడిగా ఎన్నికవడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని