Taiwan: చైనా మనసు మారలేదు.. తైవాన్‌ను వదిలేది లేదు..!

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం చైనాపై ఏమాత్రం ప్రభావం చూపలేదని ఐఐఎస్‌ఎస్‌ సంస్థ నివేదిక పేర్కొంది. తైవాన్‌ ఆక్రమణ విషయంలో చైనా మనసు మారలేదని దీనిలో వెల్లడించింది. 

Published : 02 Jun 2023 15:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా యుద్ధం తర్వాత పరిణామాలను చూసి తైవాన్‌(Taiwan)పై ఆక్రమణ విషయంలో చైనా(china) పునరాలోచనలో పడిందనే ప్రచారం ఏమాత్రం నిజం కాదని బ్రిటన్‌కు చెందిన ది ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌(ఐఐఎస్‌ఎస్‌) సంస్థ నివేదిక తేల్చిచెప్పింది. తైవాన్‌పై దాడి విషయంలో బీజింగ్‌ వైఖరిలో లేదా వ్యూహంలో ఏమాత్రం మార్పులేదని పేర్కొంది. ఈ వారాంతంలో ఐఐఎస్‌ఎస్‌  ప్రతిష్ఠాత్మక షంగ్రి-లా డైలాగ్స్‌ను సింగపుర్‌లో నిర్వహించనుంది. ఈ సమయంలో నివేదికను విడుదల చేయడం గమనార్హం. యుద్ధం.. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో దాని ప్రకంపనలు, అమెరికా-చైనా మధ్య పెరుగుతున్న పోటీ అన్న అంశాలపై ప్రధానంగా ఈ సదస్సులో చర్చ జరగనుంది. అమెరికా విదేశాంగ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌, చైనా రక్షణమంత్రి లీ షాంగ్‌ఫూ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బాన్సెస్‌, ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్‌ తదితరులు దీనికి హాజరుకానున్నారు.

బీజింగ్‌ దృష్టిలో తైవాన్‌ అనేది అంతర్గత సమస్య అని శుక్రవారం ఐఐఎస్‌ఎస్‌ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దీంతో తైవాన్‌ స్వాధీనానికి బలగాలను ఉపయోగించడం.. ఉక్రెయిన్‌ యుద్ధానికి భిన్నంగా ఉంటుందని బీజింగ్‌ అభిప్రాయపడుతోందని వెల్లడించింది. ఇప్పటికే చైనా సైనిక నిపుణులు.. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల మద్దతును, రష్యా సైన్యం పేలవమైన పనితీరును విశ్లేషించారని తెలిపింది. చైనా భవిష్యత్తులో తైవాన్‌ విలీనానికి బలప్రయోగం చేస్తుందని కచ్చితంగా చెప్పలేమని నివేదిక పేర్కొంది. బీజింగ్‌ సైనిక వ్యూహకర్తలు కేవలం సైనిక బలం ఆధారంగా నిర్ణయాలు తీసుకోరని.. వారు అమెరికా దాని మిత్రదేశాలు సైనికేతర స్పందనలను కూడా పరిగణనలోకి తీసుకొంటారని వెల్లడించింది. తైవాన్‌ ఆక్రమణకు కచ్చితమైన టైంటేబులు లేదని నివేదిక పేర్కొంది.   

షంగ్రి-లా సదస్సు సందర్భంగా అమెరికా, చైనా రక్షణ మంత్రులు భేటీ అయ్యే అవకాశాలు పెద్దగా కనిపించడంలేదు. గురువారం అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్‌ మాట్లాడుతూ.. ఈ సదస్సులో ఇరు దేశాల మంత్రుల సమావేశానికి చైనా తిరస్కరించిందని వెల్లడించారు. ఇలాంటి సమన్వయ లోపం.. చిన్న పరిణామాలు కూడా పూర్తిగా అదుపు తప్పేలా చేస్తుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని