Ukraine Crisis: సుదీర్ఘ యుద్ధానికి పుతిన్‌ ఏర్పాట్లు..!

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇది సుదీర్ఘకాలంపాటు కొనసాగనుంది. క్రెమ్లిన్‌ కూడా దీనికి తగ్గట్లే ఏర్పాట్లు చేసుకొంటున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి.

Published : 12 May 2022 01:44 IST

 అమెరికా నిఘావర్గాల నివేదిక

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇది సుదీర్ఘకాలంపాటు కొనసాగనుంది. క్రెమ్లిన్‌ కూడా దీనికి తగ్గట్లే ఏర్పాట్లు చేసుకొంటున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ యుద్ధంలో రష్యా లక్ష్యాలు అత్యంత ఖరీదైనవని పేర్కొన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌లోని నల్లసముద్ర తీరం వరకు రష్యా ల్యాండ్‌ బ్రిడ్జ్‌ ఏర్పాటు కూడా దీనిలో ఓ భాగమని పేర్కొంది. ఇప్పటి వరకు ఈ యుద్ధం విషయంలో అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాల అంచనాలు చాలా వరకు నిజమవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘సుదీర్ఘ యుద్ధం’ అంచనాలు నిజమైతే ప్రపంచంపై ప్రతికూల ప్రభావం తప్పదు. 

అమెరికా ఇంటెలిజెన్స్‌ ఏమి చెబుతోంది..?

అమెరికా ఆర్మర్డ్‌ సర్వీస్‌ కమిటీ ఎదుట ఇటీవల ఆ దేశ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ అవ్రిల్‌ డి హైనస్‌ వాంగ్మూలం ఇచ్చారు. రానున్న ఒకటి లేదా రెండు నెలల్లో జరగబోయే యుద్ధం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు చాలా కీలకం. ఒక వేళ రష్యా డాన్‌బాస్‌ ప్రాంతాన్ని విజయవంతంగా ఆక్రమించుకొన్నా యుద్ధం ఏమాత్రం ఆగదని అంచనావేశారు.  పుతిన్‌ తర్వాతి ఎత్తుగడను అంచనావేయడం చాలా కష్టమని పేర్కొన్నారు. దీంతోపాటు పుతిన్‌కు సంప్రదాయ ఆయుధాల వెలితి ఈ యుద్ధంలో తెలిసి వస్తోందని వెల్లడించారు. పుతిన్‌ మరిన్ని తీవ్రమైన మార్పులపై కూడా దృష్టి సారించే ప్రమాదం ఉందన్నారు. మార్షల్‌ లా, ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌లో మార్పులు, సైనిక చర్యను తీవ్ర తరం చేయడం వంటివి వీటిల్లో ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. 

అణ్వాయుధాలు వాడకపోవచ్చేమో..!

పుతిన్‌ అణ్వాయుధాలను వినియోగించే అవకాశాలు లేకపోవచ్చని తాము భావిస్తున్నట్లు హైనస్‌ వెల్లడించారు. రష్యాకు తీవ్రమైన ముప్పు ఉంటే మాత్రమే వాడే అవకాశం ఉందని అన్నారు. దాదాపు ఇలాంటి అభిప్రాయాన్నే విషయాన్ని అమెరికా డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ అధ్యక్షుడు లెఫ్టినెంట్‌ జనరల్‌ స్కాట్‌ బెర్రియర్‌ వెల్లడించారు. మాస్కో వ్యూహాత్మక అణ్వాయుధాలను వినియోగిస్తుందని తాము అనుకోవడంలేదని అన్నారు. 

ఖెర్సాన్‌ను రష్యాలో విలీనం చేసుకోండి..!

మరోవైపు ఉక్రెయిన్‌ నగరమైన ఖెర్సాన్‌ను రష్యాలో విలీనం చేసుకోవాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ఉక్రెయిన్‌ నుంచి  ఈ నగరాన్ని స్వాధీనం చేసుకొన్నాక రష్యా ఇక్కడ ఓ సరికొత్త పాలక మండలిని ఏర్పాటు చేసింది. ఈ నగరానికి డిప్యూటీ హెడ్‌గా నియమితులైన కిరిల్‌ స్ట్రీమౌసౌ పేరిట టెలిగ్రామ్‌ ఛానెల్‌లో ఓ ప్రకటన వెలువడింది. ‘‘ఖెర్సాన్‌ను విలీనం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను స్థానిక ప్రతినిధులుగా కోరుతున్నాము. ఖెర్సాన్‌లోని ప్రజలకు రష్యా పౌరసత్వం పొందే హక్కు ఉంది. మేము ప్రజాభిప్రాయ సేకరణ లేదా రిపబ్లిక్‌ల ఏర్పాటుకు ప్రయత్నించడంలేదు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌కు 40 బిలియన్‌ డాలర్ల సాయానికి గ్రీన్‌సిగ్నల్‌..

యుద్ధంతో కుంగిపోయిన ఉక్రెయిన్‌కు 40 బిలియన్‌ డాలర్లు విలువైన సాయం అందించే ప్రతిపాదనలపై అమెరికా ప్రతినిధుల సభ ఆమోదముద్ర వేసింది. 368-57 తేడాతో ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. ఈ బిల్లును వ్యతిరేకించిన ప్రతినిధులు మొత్తం రిపబ్లికన్లు కావడం గమానర్హం. దీంతో ఈ ప్రతిపాదనలు సెనెట్‌కు వెళ్లాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ వీలైనంత త్వరగా ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయాలని కాంగ్రెస్‌ను కోరారు. అమెరికా ప్రతినిధుల సభకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ధన్యవాదాలు తెలిపారు. ‘నాన్సీపెలోసీ, ఇతర మిత్రులకు ధన్యవాదాలు’ అని వెల్లడించారు.

ఉక్రెయిన్‌ తొలి అధ్యక్షుడి కన్నుమూత..

సోవియట్‌ యూనియన్‌ నుంచి ఉక్రెయిన్‌ విడిపోయన తర్వాత తొలిసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన లియోనిడ్‌ క్రావ్చుక్‌ మంగళవారం కన్నుమూశారు. దేశ తొలి అధ్యక్షుడి మరణంపై ప్రస్తుత అధ్యక్షుడు జెలెన్‌స్కీ విచారం వ్యక్తం చేశారు. దేశం మొత్తాన్ని సమష్టిగా నడిపించిన నేతగా ఆయన్ను అభివర్ణించారు. 1991 నుంచి 1994 వరకు లియోనిడ్‌ ఉక్రెయిన్‌ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలోనే ఉక్రెయిన్‌ అణ్వాయుధాలను వదులుకొంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని