US visa: అమెరికా వీసా నిబంధనల్లో మరో మార్పు.. భారత టెకీలకు ప్రయోజనం!

US visa revalidation: వీసా నిబంధనల్లో బైడెన్‌ సర్కారు మరో మార్పు చేపట్టబోతోంది. వీసా రెన్యువల్‌ కోసం స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా డొమెస్టిక్‌ వీసా రీవ్యాలిడేషన్‌ ప్రక్రియను పునరుద్ధరించబోతోంది.

Published : 10 Feb 2023 17:32 IST

వాషింగ్టన్‌: అమెరికాలో నివసిస్తున్న భారత టెక్‌ వర్కర్లకు ఉపయోగపడేలా అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. హెచ్‌-1బీ (H-1B visa), ఎల్‌1 (L1 visa) వంటి వీసాల పునరుద్ధరణ ప్రక్రియకు సంబంధించి పాత విధానమైన ‘డొమెస్టిక్‌ వీసా రీవ్యాలిడేషన్‌’ను (Domestic visa revalidation) పునరుద్ధరించబోతోంది. ఈ ఏడాది చివరికల్లా ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించనుంది. దీనివల్ల వేలాదిమంది హెచ్‌-1బీ, ఎల్‌1 వీసాదారులకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా భారత టెకీలకు (India tech workers) దీనివల్ల ప్రయోజనం చేకూరనుంది.

ఒకప్పుడు హెచ్‌-1బీ వీసా కలిగిన వారు తమ వీసా పునరుద్ధరణ లేదా స్టాంపింగ్‌ కోసం అమెరికాను విడిచి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. 2004 వరకు ఇదే విధానం అమలయ్యేది. ఆ తర్వాత ఈ విధానంలో మార్పు చేశారు. హెచ్‌-1బీ వీసా కలిగిన వారు రెన్యువల్‌ కోసం తమ సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి యూఎస్‌ కాన్సులేట్‌ కార్యాలయాల్లో వీసా పొడిగింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అమెరికా నుంచి సొంత దేశానికి వెళ్లి మళ్లీ అమెరికాలోకి అడుగు పెట్టాలి. కొన్నిసార్లు స్టాంపింగ్‌కు నెలలు సైతం సమయం పడుతోంది. అదే అమెరికాను వీడి వెళ్లాల్సిన అవసరం లేకండా దేశీయంగానే వీసా పునరుద్ధరణకు అవకాశం ఇస్తే వేలాది మందికి ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతానికి అమెరికాలో రీస్టాంపింగ్‌ను అనుమతించడం లేదు.

ఈ నేపథ్యంలో పాత విధానాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఏడాది చివరినాటికి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనివల్ల వీసాల పునరుద్ధరణకు సొంత దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. అయితే, ప్రారంభంలో ఎంతమందిని అనుమతించాలనే దానిపై ఇప్పుడే మాట్లాడాలనుకోవడం లేదని తెలిపారు. స్వల్ప సంఖ్యలో ప్రారంభించి.. ఒకటి రెండేళ్లలో ఈ సంఖ్యను పెంచుకుంటూ వెళతామని చెప్పారు. మరోవైపు అమెరికా వీసాల కోసం భారత్‌లో కొండలా పెరిగిపోయిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించే మరో విధానాన్ని విదేశాంగ శాఖ అమలు చేస్తోంది. ఇతర దేశాల్లోని దౌత్య కార్యాలయాల్లోనూ వీసాల పరిశీలన ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడికి ఒక సలహా సంఘం చేసిన సిఫార్సు మేరకు చర్యలు చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని