Amazon : ఏమీ ఆర్డర్‌ చేయకున్నా అమెజాన్‌ నుంచి వందకు పైగా పార్శిళ్లు

అమెరికాలో (America) ఓ మహిళకు వందకు పైగా అమెజాన్‌ (Amazon) పార్శిళ్లు వచ్చాయి. తాను ఏమీ ఆర్డర్‌ చేయకుండానే అవి తనకు అందాయని ఆమె వెల్లడించారు. 

Published : 01 Aug 2023 01:27 IST

వాషింగ్టన్‌ డీసీ: అమెరికాలోని (America) వర్జీనియా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఏమీ ఆర్డర్‌ చేయకపోయినా ఆమెకు అమెజాన్‌ (Amazon) నుంచి వందకు పైగా పార్శిళ్లు అందాయి. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయి? వాటిని ఏం చేయాలో తెలియక ఆ మహిళ సతమతమైంది. చివరకు వాటిని తెలిసిన వారికి, తెలియని వారికి పంచేసింది. వివరాల్లోకి వెళితే ‘లిక్సియావో జాంగ్‌’ పేరిట ఉన్న పెట్టెలు ప్రిన్స్‌ విలియం కౌంటీలోని సిండీ స్మిత్‌ ఇంటికి రావడం మొదలైంది. ఆ అమెజాన్‌ బాక్సుల్లో సుమారు వెయ్యి హెడ్‌ల్యాంప్స్‌, 800 గ్లూ గన్స్‌, డజన్ల కొద్దీ బైనాక్యులర్స్‌ వచ్చాయి. ఇలా సుమారు వందకు పైగా పార్శిళ్లు ఆమె ఇంటి తలుపుతట్టాయి. 

రూ.20 లక్షలు పెట్టి.. తోడేలులా మారిపోయి!

కేవలం అమెజాన్‌ మాత్రమే కాదు ఫెడ్‌ఎక్స్‌ నుంచి కూడా కొన్ని పార్శిళ్లు అందాయని సిండీ పేర్కొన్నారు. ఏమీ ఆర్డర్‌ చేయకపోయినా వివిధ ఈ-కామర్స్‌ సంస్థల నుంచి తన ఇంటికి పెట్టెలు వచ్చాయని పేర్కొన్నారు. వాటి కారణంగా కొన్నిసార్లు తలుపు తెరవడం కూడా కుదర్లేదని చెప్పుకొచ్చారు. ఇబ్బడిముబ్బడిగా వస్తున్న వస్తువులను ఏం చేయాలో పాలుపోక చివరకు వాటిని పంచేయాలని నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు. 

‘భారీగా వచ్చిన హెడ్‌ ల్యాంప్స్‌, గ్లూ గన్‌లు తీసుకొని నా కారులో బయలుదేరాను. నాకు కలిసిన ప్రతి ఒక్కరికీ అవి పంచాను. నా చుట్టుపక్కల వారందరికీ హెడ్‌ ల్యాంప్స్‌, గ్లూ గన్స్‌ అందాయి. డాగ్‌ షెల్టర్లు, వెటర్నరీ క్లినిక్‌లకు వాటిని ఇచ్చాను. ఓ రోజు బర్గర్‌ కింగ్‌ రెస్టారంట్‌కు వెళ్లాను. నేను మీకో బహుమతి తీసుకొచ్చానని చెబుతూ అక్కడ వాటిని పంచేశానని’ సిండీ వెల్లడించారు. 

అధిక మొత్తంలో తనకు పార్శిళ్లు రావడం గమనించి ఆమె తొలుత ‘బ్రషింగ్‌ స్కామ్‌’లో ఇరుక్కున్నానేమోనని అనుమానించింది. నకిలీ రేటింగ్‌లు, రివ్యూల కోసం విక్రేతలు ఇలా పంపిస్తుంటారు. కానీ, ఆమె ‘వెండర్న్‌ రిటర్న్‌’ అనే పథకంలో బాధితురాలని కొందరు పేర్కొంటున్నారు. అమెజాన్‌ కేంద్రాల్లో పోగుపడిన వస్తువులను వదిలించుకోవడానికి విక్రేతలు ఇలా చేస్తుంటారు. అయితే ఇలా అధిక మొత్తంలో ఒకే కస్టమర్‌కు పార్శిళ్లు వెళ్లడంపై అమెజాన్‌ స్పందించింది. విక్రేత ఖాతా దుర్వినియోగమైనట్లు గుర్తించామంది. అందుకే ఆ ఖాతాను మూసివేస్తున్నామని ఒక ప్రకటనలో వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని