Fiji: చైనా గురించి మాట్లాడటం ఎందుకు?: ఫిజీ ప్రధాని

భారత్‌ లాంటి గొప్ప ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంతో సంబంధాలు కొనసాగించడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు ఫిజీ ప్రధాని సితివేని రబుక తెలిపారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 17 Feb 2023 00:59 IST

సువా: భారత విదేశాంగ శాఖమంత్రి జైశంకర్‌ (Jaishankar)తో జరిగిన భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు (bilateral cooperation) మినహా ఇతర అంశాలేవీ చర్చించలేదని ఫిజీ (Fiji) ప్రధాని సితివేని రబుక (Sitiveni Rabuka) అన్నారు. ఫిజీ రాజధాని సువాలో ఆయన మీడియాతో మాట్లాడారు. జైశంకర్‌తో జరిగిన సమావేశంలో చైనా అంశం చర్చకు వచ్చిందా? అని విలేకరులు ప్రశ్నించగా.. సమావేశంలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం మంచిది కాదన్నారు. ‘‘సమావేశ మందిరంలో లేని వ్యక్తుల గురించి, దేశాల గురించి మాట్లాడం మంచి పద్దతి కాదని మేం భావిస్తున్నాం. కేవలం ఇరుదేశాల పరస్పర సహకారం గురించి మాత్రమే చర్చించుకున్నాం. భారత్‌ లాంటి గొప్ప శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంతో చర్చలు జరపడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం’’ అని రబుక అన్నారు.

భారత్‌ను ప్రత్యేకమైన, నమ్మకమైన స్నేహితుడిగా రబుక అభివర్ణించారు. దేశ నిర్మాణంలో భారత్‌, ఫిజీ బలమైన బహుముఖ భాగస్వామ్యాన్ని నిర్మించుకున్నాయన్నారు. ‘‘ అత్యవసర పరిస్థితుల్లో భారత్‌ మాకు అండగా నిలిచింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో వ్యాక్సిన్లతోపాటు, మానవతాసాయం చేసిన భారత ప్రభుత్వానికి రుణపడి ఉంటాం’’ అని లిగమామడ అన్నారు. దేశాభివృద్ధికి సహకరించిన భారత ప్రభుత్వానికి ఫిజీ ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్పారు. ఈ సహకారం మరింతగా పెరగాలని, ఇరుదేశాలు పరస్పర సహకారంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 12వ ప్రపంచ హిందీ సదస్సులో భాగంగా జైశంకర్‌ ప్రస్తుతం ఫిజీలో పర్యటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని