Mortgage Boycott: షీ జిన్‌పింగ్‌పై మధ్యతరగతి జీవి తిరుగుబాటు..!

కరోనా వైరస్‌ వూహాన్‌ నుంచి వ్యాపించి  ప్రపంచం మొత్తం కల్లోలం సృష్టించింది. ఆ సమయంలో షీజిన్‌ పింగ్‌ సర్కారు చైనాలో క్రూరంగా లాక్‌డౌన్‌లు విధించినా ప్రజలు కిమ్మనలేదు..

Published : 20 Jul 2022 15:38 IST

 చైనాలో జోరందుకొన్న మార్టగేజ్‌ బాయ్‌కాట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

కరోనా వైరస్‌ వూహాన్‌ నుంచి వ్యాపించి  ప్రపంచం మొత్తం కల్లోలం సృష్టించింది. ఆ సమయంలో షీ జిన్‌పింగ్‌ సర్కారు చైనాలో క్రూరంగా లాక్‌డౌన్‌లు విధించినా ప్రజలు కిమ్మనలేదు.. హాంకాంగ్‌లో ప్రజస్వామ్యం నడ్డివిరిచినా పెద్దగా ప్రతిఘటించలేదు. దేశీయంగా పెద్ద టెక్‌ కంపెనీలను నిర్దాక్షిణ్యంగా అణచివేసినా ఎవరూ అడ్డుచెప్పలేదు. కానీ, ఇప్పుడు చైనా ప్రభుత్వం అనూహ్యంగా మధ్య తరగతి వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. అక్కడ మెల్లగా కుప్పకూలుతున్న స్థిరాస్తి రంగంతోపాటు.. తమ జీవితకాల సంపాదన కొట్టుకుపోవడాన్ని చూస్తూ వారు సహించలేకపోతున్నారు.

చైనా ఆర్థిక కార్యకలాపాల్లో ఐదోవంతు స్థిరాస్తి రంగంలోనే జరుగుతుంది. అక్కడి 70శాతం మంది ప్రజల సంపద ఈ రంగంలోనే ఉంది. ఇది అమెరికా స్థిరాస్తి రంగంలో కంటే చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ రంగ సమస్య చైనా కమ్యూనిస్టు పార్టీ పాలిట కీలక సవాలుగా మారింది. కొన్ని నెలలుగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భారీ ప్రాపర్టీ కంపెనీలను నియంత్రించడంపై దృష్టిపెట్టారు. ఫలితంగా ఆ రంగంలో భారీగా రుణఎగవేతలు మొదలయ్యాయి. 24 కంపెనీలు ఏకంగా దివాలా అంచుకు చేరాయి. విదేశీ బాండ్‌మార్కెట్‌ సొమ్ము 80 బిలియన్‌ డాలర్ల మేరకు ఊడ్చిపెట్టుకుపోయింది. అయితే ఇప్పుడు ఆ సెగ మధ్యతరగతి వర్గాన్ని తాకింది. వారు ఇళ్ల కొనుగోళ్లకు చెల్లింపులు చేసిన ప్రాజెక్టులు నిర్మాణాలు ఆపేశాయి.  దీంతో అక్కడి ప్రజలు మార్టగేజ్‌ చెల్లింపులను నిలిపివేయడం మొదలుపెట్టారు. 

దావానలం వలే వ్యాప్తి..

ప్రస్తుతం ఇది వేగంగా వ్యాపించి చైనాలోని 91 నగరాల్లో గల 301 ప్రాజెక్టులకు సంబంధించిన చెల్లింపులు నిలిచిపోయాయి. హెనాన్‌ ప్రావిన్స్‌లో 61, హునాన్‌లో 32, హుబెలో 27, షాంక్సీలో 22, హెబెలో 21 ప్రాజెక్టులు ఉన్నాయి. డెవలపర్లకు ఇప్పటికే చెల్లింపులు జరిపినా.. ఇళ్లను పూర్తిచేసి అందించలేకపోతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తతం చైనాలో 297 బిలియన్‌ డాలర్ల విలువైన మార్టగేజ్‌లు ఉన్నాయి. ముఖ్యంగా నిధులు లేక నిలిపేసిన ప్రాజెక్టుల్లోనే ఈ బాయ్‌కాట్‌ ఎక్కువగా ఉంది. మొత్తం మార్టగేజ్‌ బాయ్‌కాట్‌ల్లో ఒక్క ఎవర్‌గ్రాండె వాటానే 35శాతం వరకు ఉంటుంది.

చైనాలో సగటు మధ్యతరగతి కుటుంబం ఇల్లు కొనుగోలుకు మొత్తం వనరులను వినియోగిస్తుందని సింగపూర్‌ నేషనల్‌ యూనివర్శిటీకి చెందిన ‘లీ కూవాన్‌ ఈ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ’ అసొసియేట్‌ ప్రొఫెసర్‌ ఆల్ఫ్రెడ్‌ వూ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆస్తి పూర్తిగా విలువ కోల్పోతే అది వారి పాలిట జీవన్మరణ సమస్యగా మారుతుందన్నారు.

వాస్తవానికి చెల్లింపులు బాయ్‌కాట్‌ అయిన ప్రాజెక్టులు మొత్తం దేశ మార్టగేజ్‌లో చాలా తక్కువ శాతం ఉంటాయి. కానీ, ఈ ఉద్యమం వ్యాప్తి మాత్రం చాలా వేగంగా ఉండటం ప్రభుత్వాన్ని భయపెడుతోంది. ఎందుకంటే ఇది తీవ్రమయ్యే కొద్దీ కంపెనీలు ధరలను తగ్గిస్తుంటాయి. ఫలితంగా ఇప్పటికే నిలిచిపోయిన ప్రాజెక్టుల్లోని ఆస్తుల విలువ మరింత పడిపోయేందుకు ఇది దోహదం చేస్తుంది. ఇదొక విషవలయం వలే మారుతుంది.

కొనుగోళ్లపై ఆసక్తి తగ్గి..

పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా త్రైమాసిక సర్వే ప్రకారం వచ్చే మూడు నెలల్లో కేవలం 16.9 శాతం మంది మాత్రమే ఇళ్ల కొనుగోళ్లకు సుముఖంగా ఉన్నారు. 2016లో నమోదైన 16.3శాతం తర్వాత ఇదే అతి స్వల్పం. విండ్‌ ఇన్ఫర్మేషన్‌ డేటా ప్రకారం ఏప్రిల్‌ నుంచి రియల్‌ఎస్టేట్‌ విక్రయాలు 25శాతం పతనం అయ్యాయి. సాధారణ నగరాల ఇళ్ల ధరల్లో వృద్ధి కనుమరుగైంది. చివరకు పుచ్చకాయలు, వెల్లుల్లి వంటి వాటికి కూడా ఇళ్లను విక్రయించే పరిస్థితి వచ్చింది.

మరికొన్ని నెలల్లో షీ జిన్‌పింగ్‌ రెండో విడత పాలన ముగించుకొని మూడోసారి అధికారం చేజిక్కించుకొనేందుకు యత్నిస్తున్నారు. సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో షీ జిన్‌పింగ్‌ జోక్యం చేసుకొనే అవకాశాలు ఉన్నాయి. నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో గృహ యజమానులు ఎటువంటి పెనాల్టీలు లేకుండా మార్టగేజ్‌ చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేసేందుకు చైనా ప్రభుత్వం అవకాశం ఇవ్వవచ్చని బ్లూమ్‌బెర్గ్‌ కథనంలో పేర్కొంది. దీంతోపాటు స్థానిక ప్రభుత్వాలు, బ్యాంకులు నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న డెవలపర్లను ఆదుకోవాలని సూచించవచ్చు. మరోవైపు చైనా పీపుల్స్‌ బ్యాంక్‌ మాజీ అధిపతి డాయ్‌ షింగ్‌లాంగ్‌ మాట్లాడుతూ 2007 సబ్‌ప్రైమ్‌ సంక్షోభం వంటి పరిస్థితి చైనా ఎదుర్కొనే అవకాశం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం కొనుగోలుదారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే చర్యలు తీసుకోవాలన్నారు. 

పలు అంశాల్లో సామాజిక అసంతృప్తి..

గృహ సంక్షోభానికితోడు పలు సామాజిక అంశాలు 69ఏళ్ల షీ జిన్‌పింగ్‌కు సవాళ్లుగా నిలిచాయి. వీటిల్లో కొవిడ్‌ నియంత్రణ సమయంలో దురుసు వైఖరి, 5.5శాతానికి తగ్గిన చైనా వృద్ధిరేటు, మహిళలపై దాడుల్లో పెరుగుదల వంటి అంశాలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని