ప్రశ్నించారు.. పరిహారం రాబట్టారు!

పొద్దున్నే వచ్చే పాలు కల్తీ కాలేదని నమ్ముతాం. సరకులమ్మిన వ్యాపారి సరిగ్గానే తూకం వేశాడని నమ్ముతాం. వేలు పోసి కొన్న వస్తువు దుకాణదారు చెప్పినట్లు పదికాలాలపాటు భేషుగ్గా పనిచేస్తుందని నమ్ముతాం. వేసుకునే మందులు అనారోగ్యాన్ని ఆమడదూరం తరిమేస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతాం. కానీ కొందరు స్వార్థపరులు మన ఈ నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ మన ప్రాణాలతో, ఆస్తులతో, హక్కులతో చెలగాటమాడతారు.

Updated : 20 Oct 2022 17:00 IST

ప్రశ్నించారు.. పరిహారం రాబట్టారు!

పొద్దున్నే వచ్చే పాలు కల్తీ కాలేదని నమ్ముతాం. సరకులమ్మిన వ్యాపారి సరిగ్గానే తూకం వేశాడని నమ్ముతాం. వేలు పోసి కొన్న వస్తువు దుకాణదారు చెప్పినట్లు పదికాలాలపాటు భేషుగ్గా పనిచేస్తుందని నమ్ముతాం. వేసుకునే మందులు అనారోగ్యాన్ని ఆమడదూరం తరిమేస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతాం. కానీ కొందరు స్వార్థపరులు మన ఈ నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ మన ప్రాణాలతో, ఆస్తులతో, హక్కులతో చెలగాటమాడతారు. అలాంటి వ్యాపార సంస్థల బండారాన్ని బయటపెట్టారు కొందరు పౌరులు. అంతటితో ఊరుకోలేదు, న్యాయంకోసం కోర్టుకెళ్లారు, విజయం సాధించారు. ఆయా కంపెనీల చేత కోట్లరూపాయల్లో పరిహారం కట్టించారు. ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన ఈ నష్టపరిహారాల కథలు పరోక్షంగా మనకి పాఠాలూ చెబుతున్నాయి..!

దురలవాటూ లేకుండా చక్కటి క్రమశిక్షణతో ఉండేవారికి ఉన్నట్టుండి క్యాన్సర్‌ ఎందుకొచ్చిందో అర్థం కాదు.

ప్రకటన చూసి నిజమే కాబోలని నమ్మి కొన్న వస్తువు నాలుగు రోజులకే ఎందుకూ పనికిరాకుండా పోతుంది.

ఫలానా మందులు చాలా గొప్పగా పనిచేస్తాయన్న నివేదికలు చూసి వేసుకుంటే ఏమీ ఫలితముండదు.

ఒక మంచి పనికి విరాళం ఇస్తే వాళ్లు దాన్ని మరెందుకో వాడేస్తారు.

ముచ్చటపడి ఫేస్‌బుక్‌లో పెట్టుకున్న ఫొటో ఏ అశ్లీల వెబ్‌సైట్‌లోనో కన్పిస్తుంది...

ఒకటీ రెండూ కాదు, వినియోగదారుడి స్థానంలో ఉన్న మనం అందుకునే వస్తువులూ సేవల విషయంలో ఎదుర్కొంటున్న అన్యాయాలూ మోసాలూ ఇన్నీ అన్నీ కావు. అయితే కొందరు వాటిని మౌనంగా భరించలేదు. మన కర్మ అని సర్దుకుపోలేదు. పెద్ద కంపెనీలు, వాటిని మనమేం చేయగలం అని నిస్సహాయంగా ఊరుకోలేదు. ఎదురు తిరిగారు... ప్రశ్నించారు... సాక్ష్యాలు సేకరించి న్యాయస్థానం ముంగిట నిలబెట్టారు. ఒక్కరితో సాధ్యం కాదనుకున్నప్పుడు పదిమందీ కలిశారు. ఏళ్ల తరబడి పోరాడి గెలిచారు. ఫలితంగా మహా మహా దిగ్గజ కంపెనీలూ తల వంచుకుని తప్పు ఒప్పుకున్నాయి. బాధితులకు పరిహారంగా కోట్లు సమర్పించుకున్నాయి.

అయితే ఇదంతా అంత తేలిగ్గా ఏమీ అయిపోలేదు. డబ్బు పుష్కలంగా ఉన్న ఆ కంపెనీలన్నీ పేరున్న న్యాయవాదుల్ని పెట్టుకుని కాలికేస్తే వేలికీ, వేలికేస్తే కాలికీ అన్నట్లుగా లిటిగేషన్లు పెట్టి కేసుల విచారణని సుదీర్ఘకాలం కొనసాగించాయి. అవి ఎన్ని మాయమాటలు చెప్పినా... ఎన్ని సంవత్సరాలు కేసును తేలనీయకుండా పట్టుకు వేళ్లాడినా చివరికి న్యాయమే గెలిచింది. తమ వల్ల జరిగిన నష్టానికి ఏళ్ల తరబడి వేల కోట్లను పరిహారంగా చెల్లిస్తున్న సంస్థలూ ఉన్నాయి తెలుసా..!

పాతికేళ్లు... 15 లక్షల కోట్లు!

ఇప్పుడంటే పొగాకు ఆరోగ్యానికి మంచిది కాదనీ, సిగరెట్లు తాగితే క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందనీ మనకి తెలుసు కానీ ఒకప్పుడు ఇవేమీ తెలియదు. తెలిశాక మొదలైన వివాదం ప్రపంచంలోనే అతి పెద్ద నష్టపరిహారం ఒప్పందానికి దారితీసింది. పాతికేళ్లుగా పొగాకు కంపెనీలు ఈ పరిహారాన్ని ఏటా చెల్లిస్తూనే ఉన్నాయి.

పొగకీ ఊపిరితిత్తుల క్యాన్సర్‌కీ గుండె జబ్బులకీ సంబంధం ఉండే అవకాశం ఉందని 1950లో మొట్ట మొదటిసారి బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ ఒక వ్యాసాన్ని ప్రచురించింది. మరో నాలుగేళ్లకి బ్రిటిష్‌ వైద్యుల అధ్యయనం అది నిజమేనని తేల్చింది. ఈ వార్త అన్ని దేశాలవారికీ తెలిసిపోవడంతో అమెరికాలో క్యాన్సర్‌ బాధితులు సిగరెట్‌ కంపెనీల మీద కేసులు వేయడం మొదలెట్టారు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను ఆకర్షిస్తూ సిగరెట్లను అమ్మడం ప్రజారోగ్యం పట్ల బాధ్యతారహిత ప్రవర్తనేననీ, ఆ ప్రకటనలు నమ్మి సిగరెట్లు తాగినందుకు తమకు క్యాన్సర్‌ వచ్చిందనీ ఆరోపించారు. నలభై ఏళ్లలో 800లకు పైగా కేసులు నమోదయ్యాయి. సిగరెట్ల వల్లే ఇలాంటి అనారోగ్యాలు సంభవించినట్లు గతంలో ఆధారాలేమీ లేవనీ ఇప్పుడు చూపుతున్న ఒకే ఒక్క అధ్యయనం ఆధారంగా ఆ బాధితులందరికీ క్యాన్సర్‌ రావడానికి తమ ఉత్పత్తులే కారణమని ఎలా చెబుతారనీ వాదించి ఆ కేసుల్ని గెలిచాయి కంపెనీలు. బాధితుల ఒంటరి పోరాటం వల్ల ఫలితం లేకపోవడమూ, నానాటికీ క్యాన్సర్‌ కేసులు పెరిగిపోవడమూ గమనించిన రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. 1990వ దశకంలో అమెరికాలోని 40 రాష్ట్రాలు పొగాకు కంపెనీలకు వ్యతిరేకంగా కేసులు పెట్టాయి. ప్రజల అనారోగ్యాలకు అవే కారణం కాబట్టి వారి చికిత్సకు కంపెనీలే డబ్బు చెల్లించాలన్నది వాటి డిమాండు. పొగాకు ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి కంపెనీలు అనుసరిస్తున్న పలు మోసపూరిత విధానాలను అవి న్యాయస్థానం ముందు వెల్లడించాయి. వారు చూపించిన సాక్ష్యాల ముందు కంపెనీలు నిలవలేక రాజీకి వచ్చాయి. దాంతో 1998లో అమెరికాలోని రాష్ట్ర ప్రభుత్వాలకీ నాలుగు పెద్ద పొగాకు కంపెనీలకీ మధ్య ‘టొబాకో మాస్టర్‌ సెటిల్‌మెంట్‌’ జరిగింది. దీని ప్రకారం 25 ఏళ్లపాటు 15 లక్షల కోట్ల రూపాయలను ఏటా కొంత మొత్తం చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాలి. అది కాకుండా కేసులు పెట్టిన బాధితులందరికీ కలిపి ఏటా మరో 75 వేల కోట్ల చొప్పున నిరవధికంగా చెల్లిస్తూనే ఉండాలి. ప్రపంచంలో అత్యధిక మొత్తం నష్టపరిహారానికి కారణమైన ఈ ఒప్పందం ఇప్పటికీ అమలవుతూనే ఉంది.

కలుపు మందు తెచ్చిన కష్టం

గతేడాది తెలంగాణలో ఒక కలుపు నివారణ మందుని ప్రభుత్వం నిషేధించింది. కూలీల ఖర్చు తగ్గించుకోవడానికి పత్తి రైతులు ఎక్కువగా వాడే ఈ మందుని పంజాబ్‌, కేరళ ప్రభుత్వాలూ నిషేధించాయి. మోన్‌శాంటో కంపెనీ తయారుచేసిన ‘రౌండప్‌’ అనే ఈ మందు మీద ఉన్నన్ని కేసులు మరే రసాయనిక మందు మీదా లేవు.

ఈ మందుకి సంబంధించే- నాలుగేళ్ల క్రితం డ్వేన్‌ జాన్సన్‌కి కాలిఫోర్నియా న్యాయస్థానం 2200 కోట్ల రూపాయల పరిహారం ఇప్పించింది. జాన్సన్‌ ఒక స్కూల్లో తోటపని చేసేవాడు. అతడికి తెల్లరక్త కణాలకు సోకే క్యాన్సర్‌ వ్యాధి రావడంతో చాలాకాలం బాధపడ్డాడు. తోటల నిర్వహణలో అతడు రౌండప్‌ని ఎక్కువగా వినియోగించేవాడనీ దాని కారణంగానే అతడికి క్యాన్సర్‌ వచ్చిందనీ వైద్య నివేదికలు వెల్లడించడంతో న్యాయస్థానం కంపెనీని తప్పుబట్టింది. ఆ తర్వాత ఏడాది ఎడ్వర్డ్‌ హార్డ్‌మన్‌ అనే రైతుకి 600 కోట్లు పరిహారంగా లభించాయి. పాతికేళ్లుగా అతడు తన పొలంలో ఆ మందుని వాడుతూనే ఉన్నాడట. అతడే కాదు, అమెరికాలో మొక్కజొన్న, సోయా, పత్తి పంటల సాగులో; పెరటితోటల్లో, లానుల్లో, ఉద్యానవనాల్లో రౌండప్‌ని విపరీతంగా ఉపయోగిస్తారు. 1970వ దశకం నుంచీ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఈ మందులోని గ్లైఫోసేట్‌ క్యాన్సర్‌ కారకమని ‘ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌’ 2015లో ప్రకటించింది. మరెన్నో ఆరోగ్య సమస్యలూ దీనివల్ల తలెత్తుతున్నట్లు గుర్తించారు. దాంతో ఆ మందుని ఉపయోగించినవాళ్లు ఎవరైనా ఏ రకమైన క్యాన్సర్‌ సోకినా తమని సంప్రదించాలనీ వారి తరఫున కేసు వేసి ఉచితంగా వాదించడానికి తాము సిద్ధమనీ పలువురు న్యాయవాదులు ముందుకొచ్చారు. లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. అసలా మందుకి అనుమతులు ఇచ్చినందుకు ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీని అక్కడి ఆహారభద్రతా కేంద్రం తప్పు పట్టింది. కోర్టుకీ వెళ్లింది. అలా వినియోగదారులూ న్యాయవాదులూ పర్యావరణవేత్తలూ ప్రభుత్వ సంస్థలూ... అంతా కలిసి చేసిన పోరు ఎట్టకేలకు ఫలించింది.

గతేడాది బేయర్‌(మోన్‌శాంటో ఇందులో విలీనమైంది) లక్ష మంది బాధితులకి నష్టపరిహారం కింద దాదాపు 82వేల కోట్ల రూపాయల్ని చెల్లించింది. రౌండప్‌తో సహా గ్లైఫోసేట్‌ కలిసిన కలుపునివారిణి మందులను అమ్మడం 2023 నాటికి పూర్తిగా మానేస్తామని బేయర్‌ ప్రకటించింది. తమ ఉత్పత్తుల గురించి తప్పుడు పరిశోధనా నివేదికలు రాయించి ప్రచురించిన ఆరోపణలు కూడా ఈ కంపెనీ ఎదుర్కొంటోంది. రౌండప్‌ మీద ఇప్పటికీ ఇంకా పాతికవేల కేసులు విచారణలో ఉన్నాయి. చాలా చోట్ల నిషేధించినా ఏటా 15 వేలకోట్ల అమ్మకాలు జరుగుతున్నాయంటే సమస్య ఎంత తీవ్రమవుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ మందువల్ల మొత్తంగా పర్యావరణానికే హాని కలుగుతోందనీ ఆహార పదార్థాల్లోనూ దీని ఆనవాళ్లు కన్పిస్తున్నాయనీ అంటున్నారు నిపుణులు.

పేటెంట్లూ... పరిహారాలూ!

టెక్‌ సంస్థల విషయానికి వస్తే వివాదాలను ఎదుర్కొనడంలో ఆపిల్‌, శాంసంగ్‌, ఫేస్‌బుక్‌ కంపెనీలు ముందువరసలో నిలుస్తాయి. కొత్తలో శాంసంగ్‌ ఆపిల్‌కి ఎలక్ట్రానిక్‌ పరికరాల విడిభాగాలనూ ఐఫోన్లకు ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, మెమొరీ చిప్‌ లాంటివీ సరఫరా చేసేది. రెండు సంస్థల మధ్యా మంచి స్నేహసంబంధాలు ఉండేవి. మొబైల్‌ ఫోన్ల మార్కెట్లో పోటీ ఎక్కువయ్యేసరికి ఆధిపత్యం కోసం మొదలైన పోరు రెండిటి మధ్యా వివాదాలను పెంచింది. ఐఫోన్‌ వచ్చిన రెండేళ్ల తర్వాత శాంసంగ్‌ ఆండ్రాయిడ్‌ టచ్‌స్క్రీన్‌ ఫోన్‌ని తేవడంతో స్టీవ్‌జాబ్‌ ఆ కంపెనీని పబ్లిగ్గా ‘కాపీక్యాట్‌’ అన్నాడు. అని ఊరుకోలేదు, ఆపిల్‌ పేటెంట్లనీ ప్రాపర్టీ రైట్స్‌నీ శాంసంగ్‌ ఉల్లంఘిస్తోందని కేసు కూడా పెట్టాడు. దానికి ప్రతిగా ఆపిల్‌ కంపెనీనే తమ పేటెంట్లను కాపీ కొట్టిందని శాంసంగ్‌ కేసు పెట్టింది. అలా ఈ రెండు సంస్థలూ కలిసి ఒకదాని మీద ఒకటి పలు కేసులు పెట్టుకున్నాయి. చివరికి శాంసంగ్‌ వేర్వేరు కేసుల కింద దాదాపు మూడు లక్షల కోట్లను ఆపిల్‌కి పరిహారంగా చెల్లించాల్సి వచ్చింది. ఇంకా రెండిటి మధ్యా సెటిల్‌ కాని కేసులు చాలానే ఉన్నాయట.  మరోపక్క సాఫ్ట్‌వేర్‌, చిప్‌సెట్స్‌, డిస్‌ప్లే లాంటి ఎన్నో విషయాల్లో తమ పేటెంట్లను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ నోకియా కంపెనీ ఆపిల్‌ మీద కేసు పెట్టింది. ఆ కేసులో ఆపిల్‌ నోకియాకి 15వేల కోట్లు చెల్లించినట్లు సమాచారం.

ఇక ఫేస్‌బుక్‌ విషయానికి వస్తే ఈ సంస్థ వినియోగదారుల సమాచార భద్రత విషయంలో కేసులు ఎదుర్కొనని దేశం లేదేమో. తాజాగా ఇంగ్లండ్‌లో వేసిన కేసులో 24వేల కోట్లు పరిహారంగా చెల్లించమని న్యాయస్థానం ఆదేశించింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని వ్యాపారానికి ఉపయోగించుకున్నందుకు ఈ జరిమానా పడింది. 2016లోనే ఫేస్‌బుక్‌ వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేసినందుకు జర్మనీలో 86 లక్షలు కట్టాల్సి వచ్చింది. యూజర్‌ అనుమతి లేకుండా ఫొటో ట్యాగ్‌ చేసే అవకాశం కల్పించినందుకు అమెరికాలో కొంతమంది కలిసి కేసు పెడితే అక్కడో ఐదువేల కోట్లు చెల్లించింది. ఇలాంటి పలు కేసులకు తోడు మరో పెద్ద కేసునీ ఎదుర్కొంటోంది ఫేస్‌బుక్‌. తనకు పోటీగా ఇంకో సంస్థ ఏదీ లేకుండా, వచ్చిన వాటిని అన్నిటినీ కొనేసి గుత్తాధిపత్యాన్ని కొనసాగించడం వ్యాపారరంగంలో ఆరోగ్యకరమైన పరిణామం కాదనీ, ఇలాంటి ఆధిపత్యం వల్ల ఫేస్‌బుక్‌ విపరీతంగా లాభాలార్జిస్తోందనీ పేర్కొంటూ అమెరికాలోని ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ కేసు పెట్టింది.

ప్రాణదాతలే...

మందుల కంపెనీలు ఏళ్ల తరబడి పరిశోధన చేసి కొత్త మందులు కనిపెడతాయి. వాటిని వివిధ దశల్లో ప్రయోగించి చూసి అన్ని అనుమతులూ పొంది మార్కెట్లోకి తెస్తాయి. ప్రాణాలను నిలబెట్టే ఆ మందుల్ని అమ్ముకోవడానికి ఆ కంపెనీలు కూడా అక్రమాలకు పాల్పడితే... ఇక ఎవరిని నమ్మాలి? ఒక్క అమెరికాలోనే గ్లాక్సోస్మిత్‌క్లైన్‌, ఫైజర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, ఆస్ట్రాజెనెకా లాంటి పెద్ద పెద్ద మందుల కంపెనీలు లక్షా 50వేల కోట్లకు పైగా సొమ్మును కేవలం పరిహారంగా చెల్లించాయి. కోర్టు ఖర్చులూ ఇతర జరిమానాలూ అదనం. ఫార్మసీలకూ వైద్యులకూ లంచాలిచ్చి తప్పుడు నివేదికలు రాయించడం, మందు ప్రయోజనాల గురించి అబద్ధపు హామీలివ్వడం... లాంటి చర్యలతో మందుల కంపెనీలు న్యాయస్థానం ముందు దోషిగా నిలబడ్డాయి.

ఒక మందుని అనుమతి పొందిన విభాగంలో కాక ఇతర విభాగాల కిందా అమ్మినందుకూ, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వినియోగదారులకు చెప్పనందుకూ, లంచమిచ్చి వైద్యుల చేత తప్పుడు ప్రకటనలిప్పించినందుకూ, ఇతర కంపెనీల కన్నా తక్కువ ధరకే ఇస్తున్నామని తప్పుగా ప్రకటించినందుకూ... సివిల్‌, క్రిమినల్‌ కేసుల్ని ఎదుర్కొన్న గ్లాక్సో కంపెనీ 22వేల కోట్లు పరిహారంగా చెల్లించింది. లంచాలు ఇచ్చి తమ ఉత్పత్తుల్ని ప్రమోట్‌ చేసుకున్నందుకు ఫైజర్‌ కూడా ఈ మధ్యే 26 వేల కోట్లు కట్టింది. డయాబెటిస్‌ రోగులకోసం తయారుచేసి విక్రయిస్తున్న ఒక మందు కిడ్నీ క్యాన్సర్‌కి కారణం కాగలదన్న విషయాన్ని దాచినందుకు జపాను కంపెనీ టకెడా 18 వేల కోట్లు పరిహారంగా చెల్లించింది.

కంచే చేను మేస్తే...

బ్యాంకుల్ని మోసం చేసి తీసుకున్న అప్పులు చెల్లించకుండా ఎగ్గొట్టేవాళ్ల గురించి విన్నాం. కానీ వినియోగదారులకు భరోసా ఇవ్వాల్సిన బ్యాంకులే మోసం చేస్తే... బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అలాంటి పలు ఆరోపణలు ఎదుర్కొంది. చేసిన తప్పులకు పరిహారమూ చెల్లించింది. ఖాతాల్లో కనీస మొత్తం లేదన్న సాకు చూపి, ఆన్‌లైన్‌లో క్రెడిట్‌ కార్డు బిల్లు కడితే రిజెక్ట్‌ చేయడమే కాక మళ్లీ మళ్లీ ప్రయత్నించినందుకు అదనపు ఛార్జీల రూపంలో, ఓవర్‌డ్రాఫ్ట్‌ ఫీజుల పేరుతోనూ వినియోగదారుల నుంచి అన్యాయంగా డబ్బు వసూలు చేసినట్లు రుజువవడంతో 560 కోట్లు పరిహారంగా చెల్లించింది. అమెరికాలో ఆర్థిక సంక్షోభం సమయంలో ఈ బ్యాంకు తాకట్టులకు సంబంధించి తప్పుడు లావాదేవీలు నిర్వహించినందుకూ, వాటి గురించి భాగస్వాములకు తెలియకుండా దాచినందుకూ రెండు వేరు వేరు కేసుల్లో ఒకసారి 70వేల కోట్లు, మరోసారి లక్షా 25 వేల కోట్లనూ చెల్లించింది. జాతి వివక్షను పాటిస్తూ సిబ్బంది కొంతమందికి తక్కువ జీతం ఇచ్చి అవమానించిన కేసులో 1200 కోట్లు పరిహారంగా ఇచ్చింది. మనీ లాండరింగ్‌కి సంబంధించిన మరికొన్ని కేసుల్నీ ఈ బ్యాంకు ఎదుర్కొంటోంది.

ఇలా చెబుతూ పోతే ఎన్నో కేసులు... సొంతలాభం కోసం ప్రజల క్షేమాన్ని పణంగా పెట్టిన, పెడుతున్న సంస్థలు... ఇంకా ఎన్నో ఉన్నాయి. అవీ విచారణల్ని ఎదుర్కొంటున్నాయి.

మనకెందుకూ అని ఊరుకోకుండా కొందరైనా ధైర్యం చేసి పోరాడినందువల్లే ఈ అన్యాయాలూ అక్రమాలూ వెలుగు చూస్తున్నాయి. మరికొందరు వాటివల్ల నష్టపోకుండా జాగ్రత్త పడేందుకు దోహదం చేస్తున్నాయి.

మన దృష్టికి వచ్చిన అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండిపోకుండా ప్రశ్నించేందుకు ఇవన్నీ ప్రేరణనివ్వడం లేదూ..?


ఇలాంటివీ ఉన్నాయి..!

సేవల్లో లోపం, తప్పుడు ప్రకటన, అసంబద్ధమైన హామీ... ఏవైనా ప్రశ్నించదగ్గవే. న్యాయపోరాటానికి అర్హత కలిగినవే. అందుకు ఉదాహరణలివి...

వేడి కాఫీ: మెక్‌డోనాల్డ్స్‌లో కాఫీ తాగుతుండగా పొరపాటున అది ఒలికి ఒక మహిళకి ఒళ్లు కాలింది. దాంతో పరిహారం కోరుతూ ఆమె కోర్టుకెళ్లింది. విచారణలో మెక్‌డోనాల్డ్స్‌ నిజంగానే ప్రమాదకరమైన ఉష్ణోగ్రతల(180-190డిగ్రీల) వద్ద కాఫీ సర్వ్‌ చేస్తోందనీ అదే ఇతర రెస్టరెంట్లు 135-140 డిగ్రీల వేడితో సర్వ్‌ చేస్తున్నాయనీ తేలింది. దాంతో న్యాయస్థానం ఆమెకు కోటిన్నర రూపాయలు చెల్లించమని సంస్థను ఆదేశించింది.

పాదరక్షలు: న్యూబాలన్స్‌ అనే కంపెనీ తమ పాదరక్షలు వేసుకుని నడిస్తే చక్కని ఆకృతి సొంతమవడమే కాక, నడక వల్ల ఎక్కువ కెలొరీలు ఖర్చవుతాయని ప్రకటనల్లో పేర్కొంది. అది తప్పనీ పైగా ఆ బూట్లు వేసుకుంటే సరిగా నడవలేక గాయపడే అవకాశం ఉందనీ కొందరు మహిళలు కోర్టుకి వెళ్లారు. కోర్టు ఆ మహిళలు ఒక్కొక్కరికీ నాలుగు లక్షల చొప్పున, బూట్లు కొన్నవాళ్లందరికీ ఏడున్నర వేల చొప్పున పరిహారం ఇప్పించింది.

దుర్వినియోగం: ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీకి ఒక సంపన్న కుటుంబం పెద్ద మొత్తం డబ్బుని విరాళంగా ఇస్తూ దాన్ని ఏవిధంగా ఖర్చుపెట్టాలో సూచించింది. యూనివర్సిటీ తమ ఆశయానికి భిన్నంగా ఆ డబ్బుని వినియోగించడం చూసిన ఆ కుటుంబం న్యాయస్థానానికి వెళ్లడంతో కోర్టు ఫీజు కిందే యూనివర్సిటీ 52 కోట్లు చెల్లించాల్సివచ్చింది. ఆ తర్వాత దాతల అభిమతానికి తగినట్లుగా నిధులను వినియోగించడానికి అంగీకరించింది.

వేధింపులు: రాల్ఫ్‌ సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్న ఆరుగురు యువతులు పై అధికారి తమని లైంగికంగా వేధిస్తున్నాడని యాజమాన్యానికి ఫిర్యాదుచేశారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఒళ్లు మండిన ఆ అమ్మాయిలు రుజువులు సేకరించి నేరుగా కోర్టుకెళ్లారు. ఏడాదిపాటు వారిని వేదనకు గురిచేసినందుకు బాధ్యత వహిస్తూ సంస్థ 225 కోట్ల రూపాయలను వారికి పరిహారంగా చెల్లించాల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది.

చమురు: సముద్రంలో చమురు రవాణా చేసేటప్పుడు ప్రమాదం జరిగితే, ఆ చమురంతా నీళ్లలో కలిసి లక్షలాది మూగజీవాల ఉసురు తీస్తే... చూస్తూ ఊరుకోలేదు న్యాయస్థానాలు. గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో జరిగిన ఒక ప్రమాదంవల్ల 50లక్షల బ్యారెల్స్‌ చమురు సముద్రంలో ఒలికిపోవడంతో దానివల్ల పర్యావరణానికీ సముద్ర జీవులకీ జరిగిన నష్టాన్ని అంచనా వేసి సదరు రవాణా కంపెనీకి మూడు లక్షల కోట్లకు పైగా జరిమానా విధించింది న్యాయస్థానం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు