సిసింద్రీ

పూర్వం రామాపురంలో మాధవయ్య ఎరువుల వ్యాపారం చేస్తుండేవాడు. ఆ ఊరిలో చదువుకున్న వాళ్లు చాలా తక్కువ. దీంతో ఎరువులను అధిక ధరకు అమ్ముతూ బాగా లాభాలు గడించేవాడు.

Updated : 04 Feb 2024 06:52 IST

తేలు కుట్టిన దొంగ!

పూర్వం రామాపురంలో మాధవయ్య ఎరువుల వ్యాపారం చేస్తుండేవాడు. ఆ ఊరిలో చదువుకున్న వాళ్లు చాలా తక్కువ. దీంతో ఎరువులను అధిక ధరకు అమ్ముతూ బాగా లాభాలు గడించేవాడు. ఒకరోజు మాధవయ్య తన కొట్టు మూసే సమయంలో ఎల్లయ్య అనే రైతు వచ్చాడు. ‘అయ్యా... మొన్న పట్నం వెళ్లినప్పుడు ఈ లాటరీ టికెట్టు కొన్నాను. ఏదైనా బహుమతి వచ్చిందేమో కాస్త చూసి చెప్పండి’ అంటూ చేతికిచ్చాడు. అదృష్టం కొద్దీ ఎల్లయ్య టికెట్‌కే అయిదులక్షల రూపాయల లాటరీ తగిలింది. అయితే  ఆ విస్మయాన్ని తన ముఖంలో కనిపించకుండా మాధవయ్య జాగ్రత్త పడ్డాడు. మొత్తానికే లాటరీ తగలలేదు అంటే.. తనకు ఆ టికెట్‌ దక్కదు.. అందుకే... ‘ఎల్లయ్యా! నీకు ఇరవైఅయిదువేల రూపాయల లాటరీ తగిలింది. అయినా ఈ సొమ్ము చేతికి రావాలంటే చాలా తతంగం ఉంది. పైగా నీకు చదువు రాదు. ఈ విషయం లాటరీ కంపెనీ వాళ్లకు తెలిస్తే ఇక అంతే. నేను ఎలాగూ రేపు పట్నం వెళ్తున్నా. నాకు ఓ రెండు వేల రూపాయలు ఇచ్చావంటే.. నేను చూసుకుంటా’ అన్నాడు మాధవయ్య. ‘అయ్యా.. నా దగ్గర డబ్బులెక్కడ ఉన్నాయి. మొన్నే కదా.. మీ దగ్గర ఎరువులూ అరువుకు తీసుకెళ్లా. ఓ పని చేయండి. ఆ రెండు వేల రూపాయలు మినహాయించుకొని మిగతా సొమ్ము ఇప్పించండి’ అన్నాడు ఎల్లయ్య. ఈ అవకాశం మళ్లీ రాదని, వెంటనే ఇరవైమూడు వేల రూపాయలు ఎల్లయ్యకు ఇచ్చి పంపించాడు మాధవయ్య. ఆ సంతోషంతో అతనికి నిద్రే పట్టలేదు. తెల్లవారగానే మొదటి బస్సుకే పట్నానికి వెళ్లాడు మాధవయ్య. అక్కడ ఏజెంటును కలిసి లాటరీ టిక్కెట్లు చూపించి తన బహుమతి  ఇప్పించమన్నాడు. వెంటనే ఏజెంట్‌ ఆశ్చర్యపోతూ... ‘అయ్యో... మీరు ఈ రోజు పేపరు చూడలేదా? నిన్న పొరపాటున తప్పు నంబరుకు లాటరీ వచ్చినట్లు అచ్చైంది. ఈ రోజు సరైన నంబరు ప్రకటించారు’ అన్నాడు. అంతే మాధవయ్య గుండె గుభేలుమంది. ఎల్లయ్యను మోసం చేద్దామనుకుని తానే.. నష్టపోయాను అని బాధపడ్డాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే.. తన కుటిల బుద్ధి బయటపడు తుందని తేలు కుట్టిన దొంగలా మిన్నకుండిపోయాడు.











Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..