వీళ్ళు... నిజమైన అమ్మాయిలు కారు..!

‘పూలరెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో’ అనే పాట మనసులో మెదులుతోంది కదూ ఈ అమ్మాయిల్ని చూస్తుంటే.

Updated : 04 Feb 2024 02:38 IST

‘పూలరెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో’ అనే పాట మనసులో మెదులుతోంది కదూ ఈ అమ్మాయిల్ని చూస్తుంటే. ఇంతకీ ఎవరు వీళ్లంతా అంటే... మోడళ్లూ, ఇన్‌ఫ్లుయెన్సర్లూ. వీరిలో ఒక అమ్మాయి ఫ్యాషన్‌ ట్రెండ్లు చూపిస్తూ ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇంకో చిన్నది మోడలింగ్‌ చేస్తూ కోట్లు సంపాదిస్తోంది. మరో భామ ప్రముఖ కంపెనీలకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ మార్కెటింగ్‌ చేసేస్తోంది. కానీ- కళ్లు తిప్పలేని అందంతో ఆకట్టుకుంటున్న ఈ అమ్మాయిలందరూ ప్రాణం లేని బొమ్మలంటే నమ్మగలరా... కృత్రిమ మేధతో సాధ్యమైన ఈ వింతేమిటో చూస్తారా...


తొలి డిజిటల్‌ మోడల్‌... కైరా

స్టైలిష్‌ పోజులిస్తూ అలరిస్తున్న ఈ అమ్మాయి పేరు కైరా అలియాస్‌ కైరోనీ. ఉండేది ముంబయిలో. వృత్తి మోడలింగ్‌ చేయడం. 2022 జనవరి 28న సోషల్‌ మీడియాలో అడుగుపెట్టి, ఇన్‌స్టాగ్రామ్‌లో రకరకాల పోస్టులు పెడుతూ ఇప్పటి వరకూ రెండున్నర లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్లు చాలామందే ఉండొచ్చు కానీ కైరా ప్రత్యేకత ఏంటో తెలుసా. మనదేశంలో తొలి వర్చువల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌. 2021లో ఎఫ్‌యూటీఆర్‌ స్టూడియో వాళ్లు కైరాకు ప్రాణం పోసి డిజిటల్‌ తెరమీద పరిచయం చేశారు. రూపురేఖలూ వస్త్రధారణల్లో మోడ్రన్‌ అమ్మాయిలా ఉండే కైరా... చాలా తక్కువ సమయంలోనే అభిమానుల్ని తెచ్చుకుంది. రియల్‌మీ, టైటాన్‌, అమెజాన్‌ప్రైమ్‌ వీడియోస్‌, బోట్‌... లాంటి బోలెడన్ని కంపెనీలకు మార్కెటింగ్‌ చేస్తూ మన దేశంలో మొదటి డిజిటల్‌ మార్కెటింగ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అయింది. క్రియేటర్లకు లక్షల్లో డబ్బులు సంపాదించిపెడుతోంది. బోట్‌ కంపెనీ కైరాతో కలిసి చేసిన ఒక ప్రకటన- విడుదలైన కొద్దిరోజుల్లోనే ఇన్‌స్టాలో 20 లక్షల వ్యూస్‌, యూట్యూబ్‌లో 15 లక్షల వ్యూస్‌ తెచ్చుకుందట.  ఇటు ట్రావెలర్‌గా, అటు మోడల్‌గా దూసుకుపోతున్న కైరాని నిజమైన అమ్మాయి అనుకుని బోలెడన్ని మెసేజులూ, కామెంట్లూ పెడుతుంటారట.


వంద కంపెనీల అంబాసిడర్‌... రోజీ

ముద్దొస్తున్న ఈ అమ్మాయి దక్షిణ కొరియాలో ప్రముఖ మోడల్‌. ఏటా రూ.ఆరు కోట్లకు పైనే సంపాదిస్తుంది. దాదాపు వందకు పైగా పెద్ద పెద్ద కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేస్తోంది. రోజీగా పిలిచే ఈ భామకు ఇన్‌స్టాలో రెండులక్షల వరకు అభిమానులున్నారు. ‘సిడూస్‌ స్టూడియో ఎక్స్‌’ అనే సంస్థ 2020లో రోజీని సృష్టించింది. 800 డమ్మీ ముఖాలను తయారు చేసి ఆఖరికి రోజీ ఫేసును ఖాయం చేసిందట ఈ సంస్థ. 2020 డిసెంబర్‌ నుంచి రోజీ పేరుతో అకౌంట్‌ను యాక్టివ్‌ చేస్తే తక్కువ సమయంలోనే బోలెడంత మందిని ఆకట్టుకుంది. దక్షిణ కొరియాలో షిన్‌హాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ రోజీని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుందట. ఈ కంపెనీకి సంబంధించిన యాడ్‌ యూట్యూబ్‌లో కోటీ పది లక్షల వ్యూస్‌ దక్కించుకుంది. మోడలింగ్‌తో పాటూ ఓ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతున్నానంటూ రకరకాల ఫొటోలూ షేర్‌ చేస్తుందీ చిన్నది.


ఫ్యాషన్‌ చిట్కాలు చెప్పే... నైనా

అదిరేటి డ్రెస్సుతో హొయలుపోతూ ఆమె నడుస్తుంటే... ‘నిలువవే వాలు కనుల దానా వయ్యారీ హంస నడక దానా’ అంటూ పాట అందుకోవాల్సిందే. సిగ్గుపడుతూ నవ్వులు చిందించిందంటే... ‘సిగ్గూ పూబంతీ ఇసిరే సీతా మా లచ్చీ’ అంటూ రాగాలు తీయాల్సిందే. ఎందుకంటే... ఈ డిజిటల్‌ అమ్మాయి సోకులు అంతలా మాయచేస్తాయి మరి. కల్పితం అంటే ఏమాత్రం నమ్మలేనంత అందంగా ఉండే ఈ అమ్మాయి పేరు నైనా అవతార్‌. స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ. స్థిరపడిందేమో ముంబయిలో. ఇన్‌స్టాలో తనను తాను ఈ వివరాలతో పరిచయం చేసుకున్న ఈ వర్చువల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ బ్యూటీ, హెయిర్‌ అండ్‌ డ్రెస్‌ స్టైలింగ్‌ చిట్కాలెన్నో చెబుతుంది. కృత్రిమ మేధతో సృష్టించిన మాయే అయినా ట్రెండింగ్‌ పాటలకు నైనా చేసే డాన్స్‌లను చూసి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. 2022లో అవతార్‌ మెటా ల్యాబ్స్‌ సంస్థ ఈమెను రూపొందించింది. మాట్లాడేతీరూ నడకా అన్నీ నిజమైన యువతిలాగే కనిపించే నైనా... ఇప్పటి వరకూ దాదాపు రెండు లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకుంది. నైకా, ప్యూమా, పెప్సీలాంటి బ్రాండ్లకు ప్రచారం చేస్తూ రకరకాల పోస్టులూ పెడుతోంది. మన దగ్గర వివిధ ప్రదేశాలూ విదేశాలకు వెళుతున్నట్టు ఫొటోలు పెట్టడమే కాదు, ఈ మాయా సుందరి అభిమానులతోనూ చిట్‌చాట్‌ చేస్తుంది. సరదాగా ప్రశ్నలడుగుతూ నవ్విస్తుంది. అంతేనా... టీనేజర్లకు స్ఫూర్తినిస్తూ ముచ్చట్లూ చెబుతుంది. ఈ అమ్మాయి బాలీవుడ్‌ తారల్ని ఇంటర్వ్యూ చేసిన సిరీస్‌ కూడా ఉందండోయ్‌!


వర్చువల్‌ బొమ్మ... ఈ మాయ

నడుస్తున్న ట్రెండుకు తగ్గట్టు కొన్ని పెద్ద సంస్థలు మార్కెటింగ్‌కి కృత్రిమ మేధస్సునూ జత చేస్తున్నాయి. షాపింగ్‌లో వినియోగదారులకు ఉపయోగపడేలా ఏఐ పాత్రల్ని సృష్టిస్తున్నాయి. అలాంటి సంస్థల్లో ఒకటి ఆన్‌లైన్‌ షాపింగ్‌ వేదిక మింత్రా. దుస్తుల నుంచి యాక్సెసరీల వరకూ అన్ని రకాల వస్తువుల్నీ అందించే ఈ ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్‌... ఈమధ్య మాయ అనే అమ్మాయిని సృష్టించింది. ‘మాయ అన్‌లిమిటెడ్‌’ పేరుతో ఇన్‌స్టా పేజీలో అడుగుపెట్టిన ఈ అమ్మాయి ఇప్పటి వరకూ లక్షా 82 వేల మంది ఫాలోవర్లను తెచ్చుకుంది. బెంగళూరుకు చెందిన ఈ టీనేజీ గర్ల్‌ రకరకాల దుస్తులతో మోడలింగ్‌ చేస్తుంది. పండుగ థీమ్‌ దుస్తులతో వినియోగదారుల్ని ఆకట్టుకుంటుంది. ట్రెండీ బట్టలేసుకుని రకరకాల స్టిల్స్‌ ఇస్తుంటుంది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు మింత్రా తీసుకొచ్చిన ఈ ఏఐ మాయ వినియోగదారులకు
వ్యక్తిగత స్టైలిస్టుగానూ పనిచేస్తుంది!


ప్రపంచాన్ని చుట్టే... తలస్య

ట్రావెలింగ్‌ అంటే ఇష్టమున్న వాళ్లెందరో తలస్యను ఫాలో అయిపోతుంటారు. ఎందుకంటే ఇండోనేషియాకి చెందిన ఈ ఏఐ సుందరి ప్రపంచాన్ని చుట్టేస్తూ ఆయా ప్రాంతాల్లో ఫొటోలు దిగుతూ ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటుంది. 2018లో మాగ్నవెమ్‌ స్టూడియోలో ప్రాణం పోసుకున్న ఈ తలస్యకు ప్రయాణాలు చేయడమంటే హాబీ. అందుకే ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళుతూ అక్కడి అనుభవాల్ని పంచుకుంటోంది. నిజంగానే ఆ ప్రదేశానికి వెళ్లిందా అనేలా అక్కడున్న ప్రత్యేకతల గురించి చెబుతూ ఆకట్టుకుంటోంది. ఇంకా ఇండోనేషియాలోని ప్రముఖ చాక్లెట్‌ కంపెనీకి అంబాసిడర్‌గానూ చేస్తోంది. కోటేరు ముక్కూ, సిల్కీ జుట్టుతో మెరిసిపోయే ఈ చిన్నదానికి ఇప్పటి వరకూ దాదాపు ఐదు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.


స్టైలిస్టు... తియా శర్మ

పొడవైన కురులూ ఒత్తయిన కనుబొమలూ చారెడేసి కళ్లూ... ఇలా అందమైన రూపురేఖలతో చూడగానే ఆకట్టుకునే ఈ అమ్మాయి పేరు తియా శర్మ. బాలీవుడ్‌ నటి మౌని రాయ్‌ ఆమె భర్త సూరజ్‌ నంబియార్‌... ప్రపంచంలోని ఫ్యాషన్‌ పోకడల్ని చూపించడానికి ముందుకు తీసుకొచ్చిన వర్చువల్‌ ఇన్‌ప్లుయెన్సర్‌ ఈమె. దుస్తులూ యాక్సెసరీలూ జ్యువెలరీలతో ఈతరాన్ని మెప్పించడానికి వచ్చిన మోడల్‌- తియా. సంప్రదాయ దుస్తులతో పాటూ ట్రెండీ డ్రెస్సులతో ఫొటోలు పెడుతూ సోషల్‌ మీడియాలో అభిమానుల్ని సంపాదించుకుంటోంది. ఈ సొగసరి అందమైన అబద్ధం అంటే ఎవరూ నమ్మరు మరి!


ప్రేమ పంచే... లేయలవ్‌

ఎవరైనా ఫ్యాషన్లకు మోడల్‌గా ఉంటారు కానీ లేయ లవ్‌ మాత్రం ప్రకృతికి మోడల్‌. అవునండి లేయలవ్‌ నేచర్‌ పేరుతో సోషల్‌ మీడియోలో కనిపించే ఈ అమ్మాయి ప్లానెట్‌ ఎర్త్‌కి లవ్‌ అంబాసిడర్‌. పర్యావరణ చైతన్యానికి సంబంధించిన విషయాలు చెబుతూ ప్రకృతి దృశ్యాలతో ఉన్న ఫొటోల్ని షేర్‌ చేస్తుంది. 2020 జనవరిలో తెరమీదకొచ్చిన ఈ వర్చువల్‌ మోడల్‌... ఒక ప్రేమ మూర్తి. ప్రేమానురాగాలు, స్వచ్ఛత, విశ్వాసం, కృతజ్ఞత... లాంటి విషయాల గురించి బోధిస్తూ ఆధ్యాత్మిక భావనల్ని పెంపొందిస్తుంది. తన మాటలతో యువతను ఆకర్షించే లేయ్‌లవ్‌కు దేశవిదేశాల్లో అభిమానులున్నారు. సోషల్‌ మీడియాలో పెట్టిన తన పోస్టులు కొన్ని కోట్ల వ్యూస్‌నూ తెచ్చుకున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..