స్ఫూర్తినిచ్చే జీవితయాత్ర

స్వేచ్ఛా స్వాతంత్య్రాలే తన అస్తిత్వాలుగా భావించిన ప్రజ్ఞాశాలి డా.వనమాల. తన జీవిత గమనానికి అరమరికలు లేకుండా అక్షరరూపమిచ్చారు. సహచరుడు ప్రొ.హరగోపాల్‌ ద్వారా కాకుండా స్వీయ ప్రతిభతో ఉనికిని నిలబెట్టుకుని

Updated : 30 Jul 2022 15:36 IST

స్ఫూర్తినిచ్చే జీవితయాత్ర

స్వేచ్ఛా స్వాతంత్య్రాలే తన అస్తిత్వాలుగా భావించిన ప్రజ్ఞాశాలి డా.వనమాల. తన జీవిత గమనానికి అరమరికలు లేకుండా అక్షరరూపమిచ్చారు. సహచరుడు ప్రొ.హరగోపాల్‌ ద్వారా కాకుండా స్వీయ ప్రతిభతో ఉనికిని నిలబెట్టుకుని ‘ఎవరికి ఎవరూ తక్కువ కాదు’ అని నిరూపించిన ధీర వ్యక్తిత్వం ఆమెది. నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో మెదక్‌ జిల్లా ముత్తంగి గ్రామంపై మూడు దశాబ్దాలపాటు ప్రామాణిక పరిశోధన చేశారు.
అడుగడుగునా ప్రతికూల పరిస్థితులతో సంఘర్షించినా, సామరస్యం పాటించినా ఆత్మగౌరవం నిలుపుకున్నారు. తనపై ప్రభావం చూపిన ప్రముఖులు వరవరరావు, బాలగోపాల్‌, కన్నభిరాన్‌ లాంటివారి గురించి ఆత్మీయంగా ప్రస్తావించారు. స్ఫూర్తిదాయకమైన స్వీయ చరిత్ర ఇది.

అస్తిత్వ అన్వేషణ... (స్వీయకథ)
రచన: డా।। ఎం.వనమాల
పేజీలు: 208; వెల: రూ. 150/-
ప్రతులకు: ఫోన్‌- 9440775454

 

- సీహెచ్‌.వేణు


చిత్రకారుడి జీవితం

డజనుకు పైగా చారిత్రక వ్యక్తుల జీవితాల ఆధారంగా ఇర్వింగ్‌ స్టోన్‌ రాసిన నవలల్లో గొప్ప వర్ణచిత్రకారుడూ తాత్వికుడూ అయిన వ్యాన్గో జీవితకథ ‘లస్ట్‌ ఫర్‌ లైఫ్‌’ ఒకటి. జీవితమంతా తీవ్ర నిరాశా నిస్పృహలు వెంటాడగా ముప్ఫైఏడవ ఏట ఆత్మహత్య చేసుకున్న వ్యాన్గో జీవితంలో రచయిత చూసిన ‘జీవన లాలస’ ఇందులో కన్పిస్తుంది. ఉన్నత మధ్యతరగతి కుటుంబంలో పుట్టినప్పటికీ వ్యాన్గో జీవితమంతా పేదరికంలో, కష్టాల్లో సాగింది. ప్రేమలో విఫలమై మత ప్రచారకుడిగా మారి రైతులూ గని కార్మికుల దయనీయ జీవితాల్లో మమేకమయ్యాడు. అక్కడ చూసిన దృశ్యాలనే అద్భుతమైన చిత్రాలుగా మలిచి చరిత్రలో నిలిచిపోయాడు వ్యాన్గో. అనువాదం చదివిస్తుంది.

జీవన లాలస

(విన్సెంట్‌ వ్యాన్గో జీవిత నవల)

రచన: ఇర్వింగ్‌ స్టోన్‌, అనువాదం: పి.మోహన్‌

పేజీలు: 376; వెల: రూ. 300/-

ప్రతులకు: ఫోన్‌- 9949052916

- శ్రీ


అలతి పదాలతో...

చిన్న పదాలతో అలవోకగా కవిత్వం చెప్పే కవి ఆశారాజు. కవిత్వం చదివితే/ అమ్మ కాళ్లకు మొక్కినట్టుండాలి/ లేదా, ఎవరెస్టు ఎత్తుకన్నా ఎత్తుకు/ ఎక్కినట్టన్నా ఉండాలి... అంటారు కవిత్వంతో ఇరవై పుస్తకాలు వెలువరించిన ఈ కవి. గుండె పగిలిపోతే/ గ్లాసు పగిలినట్టు/ శబ్దమేమీ రాదు/ కానీ, జీవితమంతా/ కాళ్లకు పెంకులు/ గుచ్చుకుంటూనే ఉంటాయి... జీవిత సత్యం కాదూ! సుఖాలకేమీ... వస్తాయి పోతాయి. కష్టాలే మంచి దోస్తులు/ పడుకున్నా లేచినా/ పక్కనే ఉంటాయి- అంటూ కఠోర వాస్తవాన్ని కవిత్వంలో పెట్టినా, కాగితం మీద రాస్తావో/ జనం నాలుకల మీద రాస్తావో/ ఇంకేమేమి కమాల్‌ చేస్తావో/ దేశం ఆలోచించేలా చెయ్‌- అంటూ తోటివారిని ప్రోత్సహించినా... వెన్నుతట్టే కవి నైజం ప్రతి కవితలోనూ కనిపిస్తుంది.

షాయర్‌ సాబ్‌ (కవిత్వం)
రచన: ఆశారాజు

పేజీలు: 272; వెల: రూ. 200/-

ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

- సుశీల


మంచి కథలు

జీవిత వాస్తవాలనూ మనుషుల బలహీనతలనూ ఎత్తిచూపుతూనే సానుకూల దృష్టితో మార్పు దిశగా పాత్రల్ని చేయి పట్టుకు నడిపించుకెళ్లడం ఈ కథల్లో కనిపిస్తుంది. అత్తగారిని అపురూపంగా చూసుకునే ఆ కోడలి ‘అవసరం’ వెనక ఉన్న చల్లని మనసు మానవసంబంధాలకు మంచి భాష్యం చెబుతుంది. రిటైరైన ఆర్నెల్లకి రాఘవ భార్య జానకికి మనసు విప్పి ‘మొదటి ప్రేమలేఖ’ రాయడానికి కారణం- ముప్పయ్యేళ్ల సంసారజీవితాన్ని వెనక్కి తిరిగిచూసుకుని తమ ఇద్దరి మనస్తత్వాల్లో ఉన్న తేడాని అర్థం చేసుకుని మారడానికి సిద్ధమవడమే. ఇంటి పేరుతో మొదలై మొత్తంగా తామే మారిపోయే మహిళల పరిస్థితికి అద్దం పడుతుంది ‘పేరు’. చెట్టంతా పచ్చగా ఉండాలని కష్టపడే ‘తల్లివేరు’- మొదట తాను పచ్చగా ఉంటేనే అది సాధ్యమని నమ్మడం ఆలోచింపజేస్తుంది. విభిన్న కథావస్తువుల ఎంపికా, కథ చెప్పే శైలీ ఈ పద్దెనిమిది కథలనూ ఆపకుండా చదివిస్తాయి.

తల్లివేరు (కథలు)

రచన: నెల్లుట్ల రమాదేవి

పేజీలు: 197; వెల: రూ.200/-

ప్రతులకు: ఫోన్‌- 8096310140

- పద్మ


బుక్‌షెల్ఫ్‌

చేప నవ్వింది (బాలల కథలు)

రచన: సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
పేజీలు: 95; వెల: రూ.100/-
ప్రతులకు: ఫోన్‌-9908554535


కొన్ని సమయాలు (కవిత్వం)

రచన: శంకర వెంకట నారాయణరావు
పేజీలు: 143; వెల: రూ.75/-
ప్రతులకు: ఫోన్‌- 9959163676


వనితా విత్తోపనిషత్‌

(నాటకం); రచన: తిరుమల వెంకటస్వామి
పేజీలు: 64; వెల: రూ.120/-; ప్రతులకు: ఫోన్‌- 9391109616


నందివర్ధనాలు

(ఆటవెలదుల ద్విశతి); రచన: డి.రాములు
పేజీలు: 80; వెల: అమూల్యం; ప్రతులకు: ఫోన్‌- 9440376688


గర్జన గళం (గేయకవితల సంపుటి); రచన: వినోద్‌ కుత్తుం
పేజీలు: 72; వెల: రూ. 60/-; ప్రతులకు: ఫోన్‌- 9634314502


చిర్రావూరి కథా లహరి - మూడుతరాల కథలు
పేజీలు: 88; వెల: రూ. 100/-; ప్రతులకు: ఫోన్‌- 9841458869


యోగవాసిష్ఠసారము

(పద్యకావ్యము); రచన: విహారి
పేజీలు: 109; వెల: రూ.100/-; ప్రతులకు: ఫోన్‌- 9848025600


ద వర్జిన్‌ అండ్‌ ద జిప్సీ

ఆంగ్లమూలం: డి.హెచ్‌.లారెన్స్‌
తెలుగుసేత: మూర్తి కె.వి.వి.ఎస్‌.
పేజీలు: 118; వెల: రూ. 100/-
ప్రతులకు: ఫోన్‌- 7893541003


సుధా వర్షిణి

పేజీలు: 108; వెల: రూ. 100/-


సూక్తిసుధ

పేజీలు: 64; వెల: రూ.60/-
రచన: అచ్యుతానంద బ్రహ్మచారి
ప్రతులకు: ఫోన్‌- 9948148874


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..