చారిత్రక కథలు

దేశమంతటా స్వాతంత్య్రకాంక్ష రగులుతున్న వేళ గాంధీజీ ఆశయాల పట్ల ప్రభావితురాలైన కనుపర్తి వరలక్ష్మమ్మ స్త్రీ స్వేచ్ఛా మహిళాభ్యుదయాల గురించి ఎన్నో రచనలు చేశారు. తొలి ‘గృహలక్ష్మి స్వర్ణకంకణా’న్ని అందుకున్నారు. ‘చిట్టి’ ఒక్కపేజీకి మించని కథ. శారదా

Updated : 12 Aug 2022 16:19 IST

చారిత్రక కథలు

దేశమంతటా స్వాతంత్య్రకాంక్ష రగులుతున్న వేళ గాంధీజీ ఆశయాల పట్ల ప్రభావితురాలైన కనుపర్తి వరలక్ష్మమ్మ స్త్రీ స్వేచ్ఛా మహిళాభ్యుదయాల గురించి ఎన్నో రచనలు చేశారు. తొలి ‘గృహలక్ష్మి స్వర్ణకంకణా’న్ని అందుకున్నారు. ‘చిట్టి’ ఒక్కపేజీకి మించని కథ. శారదా చట్టం రాకముందే పెళ్లి చేసెయ్యాలన్న ఆత్రుతతో పసిబిడ్డల గొంతులకు ఉరితాడు బిగించిన నాటి సమాజపు దౌష్ట్యానికి అక్షరరూపం. స్త్రీ పురుష సమానత్వం గురించి సున్నితంగా చర్చించే ‘చట్టసభల్లో మెజారిటీ మీదేగా’ ఇప్పటికీ వర్తించే విషయమే. కథారచన గురించి కథలోనే చర్చిస్తూ ‘కథ ఎట్లా వుండాలె?’ అంటూ విభిన్నమైన కథ రాసిన అభ్యుదయ రచయిత్రి వరలక్ష్మమ్మ. నాటి చరిత్రను నమోదు చేసిన ఈ కథలన్నీ ఆలోచింపజేస్తాయి.

కనుపర్తి వరలక్ష్మమ్మ కథలు;

పేజీలు: 111; వెల: రూ.65/-

ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

- పద్మ


సజీవ చిత్రణ

రాయలసీమ ప్రాంత బహుజనుల, రైతుల బతుకు సంఘర్షణను కళాత్మకంగా చిత్రించిన కథలివి. పాఠకులను తన కథావరణంలోకి నేర్పుగా తీసుకువెళ్లి వారి ఆలోచనలపై ప్రబల ముద్ర వేయగల రచయిత నైపుణ్యం వీటిలో దర్శనమిస్తుంది. ‘తల్లి మట్టి’ కథలో సంస్కృతీకరణ ప్రభావానికి గురైన దళితుడైన బ్యాంకు క్లర్కు శ్రీనివాసులు బతుకు వేర్లు వేరే కొత్త వాతావరణంలో ఉంటాయి. కానీ అతడి తండ్రి మాత్రం ‘కులం మార్చి సెప్పుకోవాల్సిన తప్పును మేము ఏం చేసినాము?’ అని అడుగుతాడు. ‘ఎవరి వేరు ఎక్కడ?’లో పిల్లల చదువులూ, ఉద్యోగాల కోసం పొలం అమ్ముకున్న బాపన సామి ఒక పక్క; అదే పొలం కోసం కొడుకునే అమ్ముకున్న గొల్ల ముసలప్ప కోడలు మరోపక్క జీవన బీభత్సానికి సాక్షులవుతారు. కష్టజీవి సాలమ్మ స్థైర్యం ఓ కథలో అబ్బురపరుస్తుంది. ‘అగాధం’లో సూరి, ‘ఆగామి వసంతం’లో పార్వతి పాత్రలు గుర్తుండిపోతాయి. అక్కడక్కడా రచయిత వ్యాఖ్యానాలూ, మెరుపు సూత్రీకరణలూ ఆకట్టుకుంటాయి.

శూద్రపాదం (కథలు);

రచన: బండి నారాయణస్వామి

పేజీలు: 247; వెల: రూ. 250/-

ప్రతులకు: ఫోన్‌- 9848799092

- సీహెచ్‌.వేణు


మత్తడి దూకిన జ్ఞాపకాలు

జీవిత కథ రాసుకోవడమంటే అనుభవాలమూటని విప్పడమే. ఎదుగుతున్న తనతోపాటు పెరుగుతున్న అమ్మానాన్నల కష్టాల్నీ, మారుతున్న సమాజం తీరుతెన్నుల్నీ అక్షరీకరించారు రచయిత. బడిలో మొక్కజొన్న ఉప్మా, హాస్టల్లో పురుగుల అన్నం, ఒక్క లైఫ్‌బాయ్‌ సబ్బుని ఆర్నెల్లు వాడడం... చదువుకీ ఆకలికీ ముడిపెట్టకూడదన్న తొలి పాఠాన్ని నేర్పిన రోజులవి. ‘నువ్వు గాలిమోటార్ల తిరగాల, ఇంగ్లీషుల గలగల మాట్లాడితే సూడాల’న్న తండ్రి కోరికను కొడుకు తీర్చగలిగాడా అన్నది తెలియాలంటే ఆ మనసుపడ్డ గోస చదవాలి. ‘మా సెరువు సూడాల. సిక్కంగ కలిపి ఉట్టి మీదుంచిన గట్క కుండోలె ఉంటది. మత్తడి బడ్డదంటే, ఇంగ మేము మెతుకులు దిన్నట్లే’- వంటి వాక్యాల్లో తెలంగాణ మాండలిక సొగసు ఆకట్టుకుంటుంది. 

మత్తడి దునికిన కోపుల నీళ్లు;

రచన: డా.వెన్నం ఉపేందర్‌

పేజీలు: 143; వెల: రూ. 100/-;

ప్రతులకు: ఫోన్‌- 9441268861

- శ్రీ


మనస్తత్వ చిత్రణ

బాల నేరస్థుల శిక్షణాసంస్థలో ప్రధానాచార్యుడిగా ఆధునిక బోధనా శిక్షణ విధానాలను ప్రవేశపెట్టిన రచయిత ఆ అనుభవాలతో రాసిన పుస్తకం ఇది. విశేష ప్రశంసలు అందుకున్న ఈ నవల ఒక తండ్రీకొడుకుల కథ. తండ్రి మతగురువు. ఏనాడూ ఊరు దాటని ఆయన తప్పు దారిపట్టిన కొడుకుని వెతుకుతూ జొహన్నెస్‌బర్గ్‌ చేరుకుంటాడు. పాపాలకూ శాపాలకూ పెట్టిన పేరైన ఆ నగరంలో అతడికి అడుగడుగునా గండాలే. జైల్లో ఉన్న అతడి కొడుకు హత్యచేసింది నల్లజాతి వారికోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఓ ఆంగ్లేయుడి కొడుకుని. ఆ ఇద్దరు తండ్రుల గుండెగాయాలూ ఎలా మానాయో చెప్పే ఈ నవల చక్కనిశైలికి ఉదాహరణ.

దేశం ఏమైంది!

రచన: ఎలన్‌ పేటన్‌

అనువాదం: రెంటాల గోపాలకృష్ణ

పేజీలు: 312; వెల: రూ.300/-

ప్రతులకు: ఫోన్‌-9866115655

- సుశీల



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..